ఇందుకు కదా.. కమ్యూనిస్టులను ఛీ కొట్టేది..?

గురివింద గింజ సామెత . అంతా అయ్యవారి ఉల్లిగడ్డ బాగోతం. తెలుగు రాష్ర్టాల్లోని కమ్యూనిస్టుల రాజకీయం. నిత్యం పేదలను పలవరిస్తారు. బూర్జువా వ్యతిరేక నినాదాలను వల్లేవేస్తారు. పడికట్టు పదజాలంతో తామే బడుగుబలహీన వర్గాల శ్రేయోభిలాషులమని, కార్మికుల సంక్షేమాన్ని కోరుకునే మానవతా వాదులను ఫోజులు కొడతారు. ఆచరణలోకి వచ్చేసరికి ఫక్తు అదే పెట్టుబడిదారీ విధానాన్ని అవలంభిస్తారు. బూర్జువా పార్టీలకు తోకలుగా మెదులుతారు. అసలు ఇదంతా ఇప్పుడు ఎందుకంటే ఈ నయా కమ్యూనిస్టుల నడిపే పత్రిక ఒకటి అప్పుల్లో కూరుకుపోయింది. అదే ప్రజాశక్తి ఉరఫ్ నవ తెలంగాణ. అయితే ఏంటంటా అనుకోవచ్చు. వ్యాపారం అన్నతరువాత నష్టాలు సహజం. మరీ ఇది అప్పుడెప్పుడో కేసీఆర్ అన్నట్టుగా పూర్తి మూర్ఖిస్టువాదుల చేతుల నడిచేదాయే. ప్రకటనలు, ప్రభుత్వ ప్రోత్సాహం లేదాయే? ఇంకే ఆ నష్టాలు కొంచెం భారీగా వచ్చాయని సమాచారం. ఇంకేముందు పత్రికను మూసేయాలని నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు కూడా గుప్పుమన్నాయి. అందులో పెద్ద విశేషం ఏమీ లేదు. కాకపోతే నిత్యం కార్మిక శ్రేయస్సునే పలవరించే పత్రిక, దాని పార్టీ నాయకులు ఆ కార్మిక హక్కులను కాలరాయడమే విస్మయానికి గురిచేస్తున్నది. అదే చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటికే ప్రింట్ పేపర్, ఇతరత్ర ముడిసరుకులు పెరగడంతో పత్రిక నిర్వహణ తలకుమించిన భారంగా మారింది. ప్రధాన పత్రిక, భారీ సర్య్కూలేషన్ ఈనాడు పత్రికనే తన పేజీలను, సంస్థలోన ఉద్యోగులను కుదించుకుంది. ఇక వేలు కూడా సర్క్యూలేషన్ దాటని ఇక పత్రిక సంగతి చెప్పాలా. వ్యాపార సంస్థను మూసేయడం, నడిపించడం ఆ పత్రిక ఇష్టం. కానీ దానిని ఏ పద్ధతిలో చేశారన్నదే ముఖ్యం. ఒక ఉద్యోగిని తీసేస్తున్నామంటే ఏదేని ప్రైవేట్ సంస్థ సదరు వ్యక్తికి కనీసం మూడు నెలల వేతనాన్ని ముందుగా చెల్లించాలి. అది సదరు ఉద్యోగి వేరొక ఉద్యోగంలో స్థిరపడేంతవరకు జీవభృతిగా పనికి వస్తుంది. దీనిపై కార్మికుల పక్షాన అనేక పోరాటాలను చేసింది ఆ పత్రిక, దాని యాజమాన్య పార్టీనే. ఇప్పుడు అవే హక్కులను వారు కాలరాయడం శోచనీయం. మొన్నటికి మొన్న పత్రికకు సంబంధించిన పలువురు స్టాఫ్ రిపోర్టర్లను, డెస్క్ జర్నలిస్టులను పిలిపించుకుని రేపటి నుంచి కార్యాలయానికి రావాల్సిన పనిలేదని ఖరాకండిగా చెప్పేసిందట. కేవలం ఒక్కరోజు వ్యవధి మాత్రమే ఇవ్వడం ఇక్కడ గమనార్హం. జీతాలు లేవు. కనీసం నోటీసులు లేవు ఇలా ఒక్క ఉదుటన అంత మందిని తొలగించడం ఎక్కడి కమ్యూనిస్టు పార్టీ సూత్రమో మరి.

పత్రిక నిర్వహణలో నష్టాలు వచ్చాయి. సరే తప్పడం లేదు అనుకుందాం. కానీ ఇక్కడ మరో విషయం కూడా ఉంది. ఆ పార్టీ ఎప్పుడూ చెప్పే నిస్వార్థం, ఆశ్రితపక్షపాతం, బంధుప్రీతి అంశాలు. వాటిని చర్చించుకోవడం కూడా ముఖ్యమే. సంస్థలోని చాలా మంది ఉద్యోగులను తీసేసిన పత్రిక కొందరు ఆంధ్ర ఉద్యోగులను మాత్రం అలానే అంటిపెట్టుకుంది. వారిని ఏపీ ఎడిషన్ ప్రజాశక్తికి తరలిస్తున్నదని సమాచారం. మరొక అంశం ఏమిటంటే.. పత్రికలో కింది స్థాయి మొదలు పైస్థాయి వరకు అంతా బంధువులు, ఆశ్రితులదే రాజ్యం. భర్త ఒక హోదాలో, భార్య మరొక హోదాలో ఉద్యోగాలను వెలగబెట్టడం. వేల జీతాలు వారి జేబుల్లోకే వెళ్లడం. ఆ జాబితాలో స్వయంగా ఆ పత్రిక సంపాదకుడు కూడా ఉండడం కొనమెరుపు. ఇక సంస్థ లాభాలబాట నడిచేదెప్పుడు? అన్నది ఉద్యోగుల అభిమతం.

సరే ఆ పార్టీ పూర్తిగా నవ తెలంగాణ విషయంలోనే ఇలా చేసిందని కాదు. ఇంకా అందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. మచ్చకు మరో రెండు చెబుతా. గతంలో ప్రజాభాగస్వామ్యం పేరుతో పేదల నుంచి విరాళాలను సేకరించి, షేర్లను విక్రయించి ఆ సొమ్ముతో టీవీ10 అనే న్యూస్ చానల్‌ను ప్రారంభించింది ఈ యాజమాన్యమే. దానిని సైతం రాత్రికి రాత్రికి షేర్ హోల్డర్లకు, విరాళాలు ఇచ్చిన ప్రజలకు ఒక్కమాట చెప్పకుండా తెగ నమ్మింది పార్టీ. ఇక ఎన్నికల ముందుకు వీర ఫోజులు పెడుతు అన్ని పార్టీలను కలుపుతూ బీఎల్ఎఫ్ (బహుజన లెఫ్ట్ ఫ్రంట్) అనే పార్టీని స్థాపించింది. ఓ ఇక అధికారంలోకి వచ్చినట్లే.. ఇక మాదే రాజ్యం అంటూ కాస్తా వినోదాన్ని పంచింది. తీరా ఎన్నికలయ్యాక పార్టీని పెట్టిన అదే అందులో నుంచి తప్పకోవడం గమనార్హం. పశ్చిమ బెంగాల్ సింగూరు భూముల ఉదంతం అందరికీ తెలిసిందే. ఆ దెబ్బతో అక్కడి దశాబ్డాల కోటలు సైతం కుప్పకూలిపోయాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో. అయినా తమపై ఎన్ని విమర్శలు వచ్చినా అది పునఃసమీక్షలు చేసుకోదు. ఆచరణ దిశగా అడుగులు వేయదు. పంథాను మార్చకునేది లేదు. ఎందుకంటే రాజకీయనేతలు ఇప్పటికే ముద్రవేసినట్లుగా అవి మూర్ఖిస్టు తత్వం. ఇందుకు కదా ప్రజలు వారిని దూరం పెట్టేది? ఆ పార్టీలను ఛీ కొట్టేది. వారనే కాదు. ఆచరణకు దూరమైన, ప్రజల నాడిని పట్టుకోలేకపోయిన ఎవరైనా, ఎంతటి వారైనా కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. చరిత్రలో ఒక పుటగా మిగలాల్సిందే.

Related posts

Leave a Comment