టీడీపీపై అభిమానం ఉన్నవాళ్లు ముందుకు రావాలి: చంద్రబాబు

THE NEWS INDIA 24/7 NATIONAL NEWS NETWORK….టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో చాన్నాళ్ల తర్వాత అడుగుపెట్టిన ఆయన తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ, తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు. వారానికి ఒకసారి సమీక్ష చేస్తూ కార్యకర్తలందరికీ అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. తెలంగాణలో పార్టీ లేదని అందరూ విమర్శిస్తున్నారని, ఇలాంటి వ్యాఖ్యల పట్ల ఎవరూ అధైర్యపడవద్దని సూచించారు.

తెలంగాణలో పార్టీ బలోపేతంపై రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తామని, తన ఆధ్వర్యంలోనే కమిటీ పనిచేస్తుందని వెల్లడించారు. తెలంగాణలో టీడీపీ ఉండడం చారిత్రక అవసరమని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. కొందరు నాయకులు పోయారు కానీ, కార్యకర్తలు మాత్రం పార్టీని వెన్నంటే ఉన్నారని కొనియాడారు. తెలంగాణలో ఎవరూ అధైర్యపడవద్దని, మళ్లీ క్షేత్రస్థాయి నుంచి పార్టీని నిర్మిస్తామని స్పష్టం చేశారు.

టీడీపీపై అభిమానం ఉన్నవాళ్లు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. అన్ని స్థాయుల్లో సమర్థులైన నాయకులను నియమిస్తామని అన్నారు. నాయకులు స్వార్థంతో వెళ్లిపోయారని, నాయకులు శాశ్వతంకాదని, కార్యకర్తలే శాశ్వతమని అన్నారు. పార్టీని వీడిన వాళ్లు ఇప్పుడు ఒంటరి అయ్యారని చంద్రబాబు విమర్శించారు. ఇద్దరిని గెలిపిస్తే ఒకరు పోయారని, ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు పార్టీకి అంకితమయ్యారని అభినందించారు.

Related posts

Leave a Comment