ఒప్పంద ఉద్యోగాలు …జోరుగా….అమ్మకాలు …!!

న్యూస్ ఇండియా 24/7న్యూస్ నెట్వర్క్…

132/33 కేవీ విద్యుత్తు ఉపకేంద్రం ఒప్పంద ఉద్యోగాలు …జోరుగా…అమ్మకాలు
ఒక్కో కొలువుకు రూ.5 లక్షల వరకూ వసూళ్లు!

కలసపాడు, కాశినాయన మండలాల్లో శాశ్వతంగా విద్యుత్తు సమస్యలు పరిష్కరించేందుకు.. నాణ్యమైన విద్యుత్తు అందించేందుకు కలసపాడు సమీపంలోని తెల్లపాడు రహదారిలో నూతనంగా రూ.20 కోట్లతో 132/33 కేవీ విద్యుత్తు ఉపకేంద్రం నిర్మించారు. రెండు నెలల కిందట ఈ పనులు పూర్తయ్యాయి. ఈ నెల 14న ఉపకేంద్రాన్ని ప్రారంభించాలని అధికారులు భావించారు. ఒప్పంద ఉద్యోగాల కోసం ఒత్తిళ్లతో వాయిదా పడినట్లు సమాచారం. ఉపకేంద్రంలో 4 షిఫ్ట్‌ ఆపరేటర్లు (డిప్లమో), 4 లైన్‌మెన్లు (ఐటీఐ), 2 వాచ్‌మెన్లు (పదో తరగతి) విద్యార్హతతో ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉంది. ఉపకేంద్రం నిర్మించిన గుత్తేదారు ఒప్పంద ఉద్యోగులను ఎంపికచేసి రెండేళ్ల పాటు వేతనాలు అందించాలి. ఈ ఉద్యోగాల కోసం కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున పైరవీలు జరుగుతున్నాయి. కలసపాడుకు చెందిన ఓ ఉపాధ్యాయుడు, మండలంలోని ఓ పార్టీ నాయకులు తమ అధినేతల అండదండలతో ఉద్యోగాలు ఇప్పిస్తామని కలసపాడు, తెల్లపాడు, శింగరాయపల్లె తదితర గ్రామాలకు చెందిన నిరుద్యోగుల నుంచి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షల వరకు ముందుగా వసూలు చేసినట్లు చర్చనీయాంశంగా ఉంది. కలసపాడు మండలంలో 15 మందికి పైగా నిరుద్యోగుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కలసపాడుకు చెందిన ఓ నాయకుడు ఏడాది కిందటే ఓ నిరుద్యోగి నుంచి రూ.4.50 లక్షలకు పైగా తీసుకున్నట్లు తెలిసింది. మండలంలో ఓ పార్టీ తరఫున అన్నీ తానై వ్యవహరిస్తున్న కలసపాడుకు చెందిన ఉపాధ్యాయుడు దళారిపాత్ర పోషించి నలుగురి నుంచి రూ.లక్షలు వసూలు చేసినట్లు కలసపాడులో చర్చనీయాంశంగా మారింది. ఓ నిరుద్యోగికి తొలుత లైన్‌మెన్‌ ఉద్యోగం ఇప్పిస్తామని ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఇప్పుడు వాచ్‌మెన్‌ ఉద్యోగం మాత్రమే ఉందని చెప్పడంతో ఉపాధ్యాయునితో నిరుద్యోగి, కుటుంబ సభ్యులు వాదనకు దిగినట్లు తెలిసింది. ఉద్యోగాల కోసం గుత్తేదారుపై ఓ పార్టీ ప్రధాన నాయకులు పోటాపోటీగా ఒత్తిడి తేవడంతో తలపట్టుకున్నట్లు సమాచారం. దీంతో ఉపకేంద్రం ప్రారంభోత్సవం వాయిదాలు వేస్తున్నట్లు సమాచారం. పైరవీలతో నిరుద్యోగులు రూ.లక్షలు నష్టపోగా అర్హత ఉన్న నిరుద్యోగులకు అన్యాయం జరిగే అవకాశం ఏర్పడింది. ఉన్నతస్థాయి విచారణ జరిపితే వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉంది.
ః ఈ విషయమై ట్రాన్స్‌కో ఏడీ సుబ్బారెడ్డిని వివరణ కోరగా నూతన విద్యుత్తు ఉపకేంద్రంలో గుత్తేదారు ద్వారా ఒప్పంద ఉద్యోగుల నియామకం ఉంటుందన్నారు. పైరవీలు చోటుచేసుకుంటే గుత్తేదారు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. విద్యుత్తు నియంత్రికల టెస్టింగ్‌ రిపోర్టులు రావడంలో జాప్యంతో ఉపకేంద్రం ప్రారంభోత్సవంలో జాప్యం చోటుచేసుకుందని చెప్పారు.

Related posts

Leave a Comment