మళ్లీ స్వైన్‌ ఫ్లూ పంజా…

న్యూస్ ఇండియా న్యూస్ నెట్వర్క్… మళ్లీ స్వైన్‌ ఫ్లూ పంజా విసురుతోంది. గత రెండు వారాలుగా చలి తీవ్రత విపరీతంగా పెరగడంతో స్వైన్‌ ఫ్లూ వైరస్‌ అంతకంతకు విస్తరిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఫ్లూ లక్షణాలతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో మరోసారి జనంలో ఆందోళన వ్యక్తమవుతోంది.

చలి తీవ్రత పెరగడంతో మళ్లీ స్వైన్‌ ఫ్లూ ఘంటికలు మోగుతున్నాయి. తాజాగా గాంధీ ఆస్పత్రిలో ఎన్‌-1 హెచ్‌-1 వైరస్‌లో ముగ్గురు చేరడం కలకలం రేపుతోంది. వీరిలో సిద్ధిపేటకు చెందిన ఒక వ్యక్తి, ఉప్పల్‌లో నివసించే ఓ యువతి, ఆల్వాల్‌కు చెందిన మరొకరు స్వైన్‌ ఫ్లూతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ముగ్గురికి వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయ్యిందని గాంధీ డాక్టర్లు ధృవీకరిస్తున్నారు. అటు ఉస్మానియాలో ఆస్పత్రిలో మరో ఇద్దరు ఫ్లూ లక్షణాలతో చేరారు.

ఇప్పటికే ఎంతో మంది స్వైన్‌ ఫ్లూ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. అక్టోబర్‌లో 30 మంది, నవంబర్‌లో 19 మంది, డిసెంబర్‌ 18 మంది స్వైన్‌ఫ్లూ లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. వీరిలో 18 మంది మృతి చెందారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది ప్రైవేట్‌ ఆస్పత్రుల నుంచి ఆఖరి నిమిషంలో గాంధీ ఆస్పత్రిలో చేరే వారే అంటున్నారు వైద్యులు. ఉస్మానియాలో గత డిసెంబర్‌లో ఇవే లక్షణాలతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాదే కాక తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కూడా ఫ్లూతో పెద్ద సంఖ్యలో మృత్యువాత పడ్డారు.

గాలిలో కలిసి ఉన్నఎన్‌-1 హెచ్‌-1.చలి పెరిగిన సమయంలో విస్తరిస్తుంటుందని వైద్యులు చెప్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, గర్బిణీలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఎక్కువ శాతం ఈ వైరస్‌ బారిన పడే అవకాశం ఉంది. మిగతా వారితో పోల్చితే వీరిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండడంతో త్వరగా వ్యాధి సోకుతుంది.

Related posts

Leave a Comment