కొత్త అక్రిడిటేషన్లు ఇవ్వలేం : మంత్రి కాల్వ‌

జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్లు ఇవ్వలేమని మంత్రి కాల్వ శ్రీనివాసులు తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ చిన్న పత్రికల సంఘం జెఎసి బుధవారం సమాచార పౌర సంబంధ, గృహ‌ నిర్మాణాభివృద్ధి శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులను శాసనసభ సమావేశాల విరామ సమయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జెఎసి కన్వీనర్‌ కుమార్‌రాజా, చిన్న పత్రికల ఎడిటర్లు రాష్ట్రంలో పత్రిక నిర్మాణ నిర్వహణలో ఎదురవుతున్న కష్టనష్టాలను ఏకరువు పెట్టారు. ప్రస్తుతం కొన్ని సంఘాలు చిన్న పత్రికలపై చిన్నచూపు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వపరమైన సంక్షేమానికి తూర్పు పొడుస్తున్న వైనం సవివరంగా వివరించారు. భవిష్యత్తులో ప్రభుత్వపరమైన అక్రిడిటేషన్‌ మంజూరు విధానంలో గత రెండు సంవత్సరాల నుంచి ఇటీవల వరకూ కొన్ని పత్రికలు నిరంతరంగా వెలువరిస్తూ ఇటు సామాజిక, అటు ప్రభుత్వపరంగా అనేక విషయాలను వార్తలు రూపంలో సమాచారాన్ని అందిస్తూ నిరాధరణకు గురవుతున్న వైనాన్ని మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పాత అక్రిడిటేషన్‌ ఉన్నవారికి మార్చి 30వ తేదీలోపు ఆయా జిల్లాల పౌర సంబంధాల శాఖ కార్యాలయానికి అందించినట్లయితే ఏప్రిల్‌ 1వ తేదీ నుండి సదరు అక్రిడిటేషన్లను రెన్యువల్‌ చేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా నూతన అక్రిడిటేషన్లను ఇవ్వటం జరగదని తేల్చి చెప్పారు. ఇందుకు అందరూ సహకరించాలని ఆయన కోరారు. జర్నలిస్టులకు మంజూరు చేసే గృహ‌ నిర్మాణాలను చిన్న పత్రికలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరగా సూచనప్రాయంగా అంగీకరించారు. మంత్రిని కలిసిన వారిలో చిన్న పత్రిక ఎడిటర్లు పబ్బరాజు నాగేశ్వరరావు, చల్లా మధుసూదనరావు, వెన్నపూస దశరథరామిరెడ్డి, శివ లీలయ్య, పబ్బరాజు శ్రీనివాసరావు, బ్రహ్మనాయుడు, రమేష్‌, తదితరులు పాల్గొన్నారు. 

Related posts

Leave a Comment