టాప్ సింగర్ బిచ్చగాడైపోయాడు

గత శుక్రవారం రిలీజైన ‘బిచ్చగాడు’ సినిమాలో బిలియనీర్ అయిన హీరో.. తన తల్లి కోసం బిచ్చగాడిగా మారి గుడి ముందర అడుక్కుంటూ ఉంటాడు. ఇక్కడ నిజ జీవితంలో కూడా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. ఐతే ఇది ఓ ప్రమోషనల్ ఈవెంట్లో భాగంగా చోటు చేసుకున్న చిత్రమిది. బాలీవుడ్ టాప్ గాయకుల్లో ఒకడైన సోనూ నిగమ్ ఉన్నట్లుండి బిచ్చగాడిగా మారిపోయాడు. ముంబయి నగరంలో రోడ్డు పక్కన కూర్చుని పాటలు పాడుకుంటూ కనిపించాడు. ఐతే జనాలెవ్వరూ అతనెవరో గుర్తు పట్టలేదు. అంత పెద్ద గాయకుడు పాడుతున్న పాటల్ని వినడానికి కూడా చాలామంది ఆసక్తి చూపించలేదు. ప్రస్తుతం జనాలు ఎంత బిజీ బిజీగా గడిపేస్తున్నారో చెప్పడానికి ఇదే నిదర్శనం.

‘బీయింగ్ ఇండియన్’ యుట్యూబ్ ఛానెల్ నిర్వాహకులతో కలిసి సోను నిగమ్ ఈ సామాజిక ప్రయోగాన్ని చేశాడు. చివరివరకు తాను ఎవరిననే విషయాన్ని చెప్పకుండా ఆయన తన గానాన్ని కొనసాగించాడు. నిత్యం రద్దీగా ఉండే ఓ జంక్షన్లో ఓ మూలన  హార్మోనియం పెట్టుకొని పాటలు పాడాడు. ఐతే సోనును ఎవ్వరూ గుర్తించలేదు. అసలు ఒక నిమిషం ఆగి అతడి పాటను వినడానికి కూడా ఆసక్తి చూపించలేదు. కాసేపటి తర్వాత ఒకరిద్దరు ఆగి పాటవిన్నారు. కొందరు సంగీతప్రియులు ఆయన పాటను ఫోన్లలో రికార్డు చేసుకున్నారు. ఓ యువకుడు ముందుకొచ్చి ఏమైనా తిన్నావా అని అడిగి.. అతడి చేతిలో 12 రూపాయలు పెట్టి వెళ్లాడు. తనను ఎవ్వరూ గుర్తుపట్టకపోవడం చూసి ఆశ్చర్యంతో పాటు సంతోషపడ్డ సోనూ చివరికి తాను పెట్టుకున్న గడ్డం తీసేసి తానెవ్వరో అందరికీ తెలియజెప్పాడు.

Related posts

Leave a Comment