తమిళనాడు అతలాకుతలం…చిత్తూరు, నెల్లూరు అస్తవ్యస్తం!

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తమిళనాడుతో పాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి తమిళనాడులో రికార్డు స్థాయిలో వర్షం పడగా, వరదనీరు రావచ్చన్న భయాలతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. అడయార్ నదికి ఇరువైపులా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నారు. చెన్నై ఓడరేవు సహా, కృష్ణపట్నం, మచిలీపట్నం ఓడరేవుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరికలను, నాగపట్నం, పుదుచ్చేరి, రామేశ్వరం ఓడరేవుల్లో మూడవ నంబరు ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. మధురై, తూత్తుకుడి, కన్యాకుమారి జిల్లాల్లో వర్ష బీభత్సం అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు విశాఖపట్నం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. చిత్తూరు జిల్లా సత్యవేడు, శ్రీకాళశస్తి, నగరి, తిరుపతి ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తోంది. నెల్లూరు జిల్లాలోని ఒకటి రెండు మండలాలు మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో గత రాత్రి నుంచి భారీ వర్షం పడుతోంది. ప్రకాశం జిల్లాలోని కందుకూరు, సింగరాయకొండ, ఒంగోలు, చీమకుర్తి, చీరాల, వేటపాలెం, టంగుటూరు తదితర ప్రాంతాల్లో, కృష్ణా జిల్లాలోని కొన్ని చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. తిరుపతిలో రహదారులన్నీ జలమయం కాగా, గోవిందరాజస్వామి ఆలయ వీధులతో పాటు 1, 2 సత్రాల ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. వర్షపు నీరు చేరినట్టు తెలుస్తోంది. తిరుమలలో పడుతున్న వర్షానికి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం గంటకు 11 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతోందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇది రాగల 48 గంటల్లో తీవ్ర వాయుగుండంగా, ఆపై పెను తుపానుగా మారే ప్రమాదం కనిపిస్తోందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తమిళనాడుతో పాటు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవవచ్చని తెలిపారు. మరో వారంలో రుతుపవనాలు అండమాన్ దీవులను తాకే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

Related posts

Leave a Comment