క్యాంప్ ఆఫీసులను మార్చేందుకు అయిన ఖర్చు తడిసి మోపెడై రూ. 80 కోట్లను దాటింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి అవసరాల నిమిత్తం మరో ‘రెసిడెన్స్ క్యాంప్ ఆఫీస్’ సిద్దం కాగా, సీఎంఓ లెక్కల ప్రకారం, క్యాంప్ ఆఫీసులను మార్చేందుకు అయిన ఖర్చు తడిసి మోపెడై రూ. 80 కోట్లను దాటింది. గత రెండేళ్లలో ఏపీ ప్రభుత్వం ఐదు క్యాంప్ ఆఫీసులను, మరో రెండు రెగ్యులర్ కార్యాలయాలను చంద్రబాబు కోసం ఏర్పాటు చేసింది. పెట్టిన ఖర్చులో అత్యధికం, సెక్యూరిటీ సిబ్బందికి వసతులు, భవంతులకు మార్పుచేర్పుల కోసమే వెచ్చించడంతో చాలా వరకూ ప్రజాధనం వృథా అయినట్టే. ఇక తాజాగా, వెలగపూడిలోని తాత్కాలిక ప్రభుత్వ కాంప్లెక్స్ లో సైతం చంద్రబాబు కోసం ఓ ఆఫీసు సిద్ధమవుతోంది. ఇది సిద్ధమైన తరువాత ప్రస్తుతమున్న విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి బాబు ఆఫీస్ ఇక్కడికి మారుతుంది. ఇక వచ్చే రెండు మూడేళ్లలో సెక్రటేరియట్ నిర్మాణమంతా పూర్తయితే, అప్పటికి చంద్రబాబునాయుడు 9 క్యాంపు కార్యాలయాలు మారినట్టు. హైదరాబాద్ లోని మదీనాగూడలో చంద్రబాబు ఉంటున్న నివాసాన్ని రెసిడెన్స్ క్యాంప్ ఆఫీసుగా మారుస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాబు ఉమ్మడి రాజధానిని ఎప్పుడు సందర్శించినా, ఇక్కడి నుంచే రాకపోకలు సాగిస్తారని పేర్కొంది. ఇప్పటికే మదీనాగూడ రెసిడెన్స్ కు మెరుగులు దిద్దేందుకంటూ రూ. 2 కోట్లను ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అంతకుముందు జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 24, రోడ్ నెంబర్ 65లో ఉన్న నివాసాలను సైతం రెసిడెన్స్ క్యాంప్ కార్యాలయాలుగా ప్రకటిస్తూ, రూ. 2 కోట్లకు పైగానే వెచ్చించి మరమ్మతులు చేసింది. ఈ నిధులన్నీ వృథా అయినట్టే. వీటికి అదనంగా లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ను గతంలో చంద్రబాబు వాడినప్పుడు రూ. 45 లక్షలు ఖర్చు పెట్టి ఆధునికీకరణ పనులు చేపట్టారు. హైదరాబాద్ సచివాలయంలోని సీఎం కార్యాలయానికి సైతం లక్షలు ఖర్చు పెట్టారు. తొలుత హెచ్ బ్లాకులో, ఆపై ఎల్ బ్లాకులో ఆయన కార్యాలయాలను కోట్ల ఖర్చుతో మెరుగులు దిద్దగా, ఆ రెండూ ఇప్పుడు వాడకంలో లేవు. బాబు సచివాలయానికి వచ్చి చానాళ్లయింది. ఇక బాబు విజయవాడలోనే ఉండాలని నిర్ణయించుకున్న వేళ, రూ. 21 కోట్లతో తాత్కాలిక క్యాంప్ ఆఫీసును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వెలగపూడిలో కాంప్లెక్స్ సిద్ధమైతే, విజయవాడ నుంచి ఆయన మరోసారి మకాం మారుస్తారు. ఇలా రెండేళ్లలోనే పలుమార్లు కార్యాలయాన్ని మార్చడం ఎంతవరకూ సమంజసమని రాజకీయ పండితులు విమర్శిస్తున్నారు.

Related posts

Leave a Comment