తన ఆరోగ్య సమస్యను బయటపెట్టి కంటతడి పెట్టిన నటుడు రానా

తన ఆరోగ్యంపై గత కొంతకాలంగా వస్తున్న వార్తలపై టాలీవుడ్ ప్రముఖ నటుడు రానా స్పందించాడు. నటి సమంత హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘సామ్‌జామ్’ కార్యక్రమంలో పాల్గొన్న రానా తన ఆరోగ్యం గురించి మాట్లాడుతూ.. పుట్టినప్పటి నుంచి తనకు బీపీ ఉందని, దీనివల్ల గుండె సమస్య తలెత్తుతుందని పేర్కొన్నాడు.

కిడ్నీలు పాడవుతాయని వైద్యులు చెప్పారని, అలాగే, మెదడులో నరాలు చిట్లిపోవడానికి (స్ట్రోక్ హెమరేజ్) 70 శాతం, మరణానికి 30 శాతం అవకాశం ఉందని వైద్యులు చెప్పారంటూ కంటితడి పెట్టాడు. జీవితంలో వేగంగా ముందుకు వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా వచ్చిన చిన్న పాజ్ బటన్ ఇదని పేర్కొన్నాడు. రానా కంటతడితో స్పందించిన సమంత.. జనాలు ఏదేదో మాట్లాడుకుంటున్నా, మీరు మాత్రం ధైర్యంగానే ఉన్నారని, ఆ సమయంలో తాను స్వయంగా మిమ్మల్ని చూశానని తెలిపింది.

రానాకు కిడ్నీ సమస్య ఉందని, విదేశాలకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నాడంటూ ఇటీవల పలు వార్తలు సోషల్ మీడియాతోపాటు ప్రధాన మీడియాలోనూ చక్కర్లు కొట్టాయి. దీనికి తోడు ఆయన బాగా సన్నబడడంతో అది నిజమేనని నిర్ధారించారు కూడా. అయితే, ఆ తర్వాత ‘అరణ్య’ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కావడంతో ఆ సినిమా కోసమే రానా తన బరువు తగ్గించుకుని ఉంటాడని అందరూ భావించారు. అయితే, తన ఆరోగ్యంపై మాత్రం ఎప్పుడూ పెదవి విప్పని రానా.. తాజాగా ‘సామ్‌జామ్’ కార్యక్రమంలో తన ఆరోగ్యం గురించి చెప్పి పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టాడు.
Tags: Rana Daggubati, Tollywood, Health, samjam Samantha

Related posts

Leave a Comment