ఈ రేసింగ్ పావురం పేరు ‘న్యూ కిమ్’.. ధర రూ. 14 కోట్ల పైమాటే!

ఏంటీ.. ఒక్క పావురం ఖరీదు రూ. 14 కోట్లా? అని నోరెళ్లబెట్టకండి. ఎందుకంటే ఇది నిజం. ‘న్యూ కిమ్’గా పిలిచే ఓ ఆడ రేసింగ్ పావురాన్ని చైనాకు చెందిన గుర్తు తెలియని వ్యక్తి ఏకంగా రూ. 1.6 మిలియన్ యూరోలు (భారత కరెన్సీలో దాదాపు రూ. 14.11 కోట్లు) చెల్లించి దానిని కొనుగోలు చేశాడు. బెల్జియంలోని పీజియన్ పారడైజ్ (పిపా) అనే సంస్థ నిర్వహించిన ఆన్‌లైన్ వేలంలో ఈ పావురానికి రికార్డు స్థాయి ధర పలికింది. ఓ పావురం ఇన్ని కోట్లకు అమ్ముడుపోవడం ప్రపంచ రికార్డని చెబుతున్నారు. గతేడాది ఓ మగ కపోతం ‘అర్మాండో’ 1.25 మిలియన్ యూరోలకు అమ్ముడుపోయిందని, ఇప్పుడా రికార్డును ‘న్యూ కిమ్’ బద్దలుగొట్టిందని పిపా తెలిపింది.

రెండేళ్ల వయసున్న ‘న్యూ కిమ్’ను 200 యూరోల బేస్ ప్రైస్‌తో వేలానికి పెట్టగా ఏకంగా 1.6 మిలియన్ యూరోలకు అమ్ముడుపోవడం గమనార్హం. తనకు తెలిసినంత వరకు ఇది ప్రపంచ రికార్డు అని, ఇప్పటి వరకు అధికారికంగా ఎక్కడా ఇంత ధరకు పావురం అమ్ముడైన దాఖలాలు లేవని పిపా చైర్మన్ నికోలస్ గైసెల్బ్రెచ్ట్ అన్నారు. నిజానికి దానికి అంత ధర వస్తుందనుకోలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘న్యూ కిమ్’ 2018లో జరిగిన ‘ఏస్ పీజియన్ గ్రాండ్ నేషనల్ మిడిల్ డిస్టెన్స్’ పోటీల్లో విజేతగా నిలిచింది.
Tags: Belgium Racing pigeon, New Kim,Belgium pigeon racing

Related posts

Leave a Comment