కాబోయే భర్త గురించి ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకోకండి: పూరీ జగన్నాథ్

  • మహిళకు పర్‌ఫెక్ట్‌ తండ్రి, అమ్మ, డ్రైవర్‌, నర్సు దొరుకుతారేమో
  • కానీ, పర్‌ఫెక్ట్‌ భర్త మాత్రం దొరకడు
  • కోరుకున్నట్లే భర్త ఉండాలని అనుకుంటే సమస్యల్లో పడిపోతారు
  • పెళ్లయిన ప్రతి అమ్మాయి ఏదో ఒక సమయంలో కన్నీరు పెట్టాల్సిందే

పూరీ మ్యూజింగ్స్ పేరుతో అనేక అంశాలపై తన అభిప్రాయాల గురించి మాట్లాడుతోన్న సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ తాజాగా భర్తల గురించి మాట్లాడారు. మహిళకు పర్‌ఫెక్ట్‌ తండ్రి, అమ్మ, డ్రైవర్‌, నర్సు దొరుకుతారేమో కానీ, పర్‌ఫెక్ట్‌ భర్త మాత్రం దొరకడని ఆయన చెప్పారు. తనకు కాబోయే భర్త గురించి అనేక ఎక్స్ పెక్టేషన్లు పెట్టుకుని, తను కోరుకున్నట్లే ఉండాలని అనుకుంటే సమస్యల్లో పడిపోతారని ఆయన చెప్పారు.

పెళ్లయిన ప్రతి అమ్మాయి ఏదో ఒక సమయంలో కన్నీరు పెట్టాల్సిందేనని తెలిపారు. అమ్మాయిలను వారి జీవితంలో చాలా మంది ఏడిపిస్తుంటారని, కానీ, అధికంగా ఏడిపించే అవకాశం మాత్రం వారి భర్తకే దక్కుతుందని తెలిపారు. ఎందుకంటే, ఆయన పక్కనే ఉంటాడని, జీవితంలో భార్యకు చెప్పి కొన్ని, చెప్పకుండా కొన్ని చేస్తాడని, దీంతో వారికి కోపం వస్తుందని తెలిపారు.

అయితే, అందులో తప్పులేదని, అటువంటి తప్పులే అమ్మాయిల నాన్నలు చేస్తారని, దీంతో ఎన్నిసార్లు వారి అమ్మ ఏడ్చిందో గుర్తు తెచ్చుకోవాలని ఆయన అమ్మాయిలకు సూచించారు. తండ్రిని క్షమించినట్లే భర్తను కూడా క్షమించి వదిలేయాలని ఆయన చెప్పారు. పక్కింటి మహిళలు చెప్పే మాటలు విని అమ్మాయిలు భర్తలతో గొడవపడొద్దని ఆయన సూచించారు. భర్త ఎంత గొప్ప వాడైతే భార్యకు అన్ని కన్నీళ్లు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. పురుషులు మంచి వాళ్లు కాదని, అలాగే రాక్షసులు కాదని ఆయన అన్నారు. వివాహం అంటే సర్దుకుని పోవడమేనని చెప్పారు.

Tags: Puri Jagannadh, Tollywood director, womens expectations

Related posts

Leave a Comment