ఏపీలో యథేఛ్ఛగా తెలంగాణ మద్యం అమ్మకాలు!

ఆంధ్రప్రదేశ్ లో సంపూర్ణ మద్య నిషేధం.. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన ప్రధాన హామీలలో ఇది కూడా ఒకటి. ఇంకా చెప్పాలంటే జగన్ ను సీఎం అయ్యేందుకు ఉపయోగపడిన నవరత్నాలలో మేజర్ వాటా ఈ హామీదే. కాగా, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా ఆ హామీ అమలయ్యే ఆలోచన మాత్రం ప్రభుత్వ పెద్దలు చేయడమే లేదు.పైగా ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన ఆదాయవనరు కూడా అదే. ఇంతకు ముందు వరకు ప్రైవేట్ వ్యక్తుల చేతులలో ఉండే మద్యం వ్యాపారం ప్రభుత్వం లాగేసుకుంది. రాష్ట్రంలో మద్యం షాపులన్నీ ప్రభుత్వమే నడిపిస్తుంది. వీటి నిర్వహణ కోసం భారీగా ప్రభుత్వమే యువతను నియమించుకుంది. అయితే, ప్రభుత్వం మద్యం వ్యాపారంలోకి దిగడంపై తీవ్ర విమర్శలు వచ్చినా ఇదంతా నిషేధంలో భాగమేనని ప్రభుత్వం సమర్ధించుకుంది.రాష్ట్రంలో మద్యం షాపులపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా ప్రభుత్వం మాత్రం బెల్టు షాపుల నిర్వహణకు అడ్డుకట్ట వేశామని జబ్బలు చరుచుకుంది. ఇక షాపుల సంఖ్యను తగ్గిస్తున్నామని చెప్తూనే ఎక్సయిజ్ శాఖ ఎక్కడిక్కడ షాపులను తెరిచింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే ఈ షాపులలో మద్యం అమ్మకాలు జరుగుతుండడంతో రాత్రి సమయంలో మద్యం కోసం బ్లాక్ మార్కెట్ విస్తృతంగా పెరిగిపోయినట్లుగా తెలుస్తుంది.తొలి రోజుల్లో బ్లాక్ మార్కెట్ వ్యాపారులు ముందుగానే షాపుల సమయంలో స్టాక్ పెట్టి రాత్రి సమయాల్లో భారీ ధరలకు అమ్ముకున్నారు. ప్రస్తుతం రాష్ట్రమున్న ఆర్ధిక పరిస్థితి మద్యంపై వచ్చే ఆదాయం ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా చెప్పుకోవాలి.

అందుకే రాష్ట్రంలో ధరలను భారీగా పెంచేసింది. దీనికి కూడా ధరలు పెంచితే భారమై తాగుడు మానేస్తారని మరోసారి సమర్ధించుకుంది ప్రభుత్వం.అయితే, ప్రస్తుతం ఆర్ధికంగా తీవ్ర పరిస్థితులను చవి చూస్తున్న ప్రభుత్వం మద్యం కంపెనీలకు భారీగా బకాయిలు పడింది. దీంతో ప్రముఖ కంపెనీలు ప్రభుత్వానికి మద్యం సరఫరా చేసేందుకు సుముఖత చూపడం లేదు. ఎప్పటికప్పుడు బకాయిలలో స్వల్ప వాటాలను చెల్లించి ప్రభుత్వం స్టాకు తెచ్చుకుంటున్నారు.

ఎప్పటికప్పుడు సరఫరాకు కొత్త కంపెనీలు పుట్టుకొస్తున్నాయి.ప్రస్తుతం గతంలో ఎన్నడూ లేని సరికొత్త బ్రాండ్లు ఏపీలోని మద్యం దుకాణాలలో దర్శనమిస్తున్నాయి. వీటిని తాగి ప్రాణాల మీదకి తెచ్చుకొనే బదులు పొరుగు రాష్ట్రాలలో ప్రీమియం బ్రాండ్లు అదే ధరకు కొనుక్కోవడం బెటరని మందు బాబులు పొరుగున ఉన్న తెలంగాణ మద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. ఎలాగూ రాత్రి వేళల్లో బ్లాకు మార్కెట్ యథేచ్ఛగా నడుస్తుంది.అదేదో ఏపీ డూప్లికేట్ కంపెనీల కంటే తెలంగాణ బ్రాండెడ్ మద్యమే బెటర్ కావడంతో దానికే భారీ డిమాండ్ పెరిగిందని చెప్తున్నారు. ఏపీ తెలంగాణ సరిహద్దు ప్రాంతాలైన నల్లగొండ, సూర్యాపేట, గద్వాల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాల నుండి ఏపీకి ఈ మద్యం సరఫరా జరుగుతున్నట్లుగా తెలుస్తుంది.నిజానికి రాష్ట్రాల మధ్య సరిహద్దులు ఉన్నా అక్కడ కూడా మామూళ్లు..

కొంత సానుభూతి కలిసి గేట్లు బార్లా తీర్చుకున్నట్లుగా చెప్తున్నారు. మొత్తంగా ఏపీ ప్రభుత్వం బెల్ట్ షాపులను అరికట్టామని ప్రగల్భాలు పలుకుతున్నా.. ప్రభుత్వం షాపుల నుండి బెల్ట్ షాపులకు మద్యం సరఫరా ఆగిందేమో కానీ తెలంగాణ నుండి యథేచ్ఛగా సరఫరా అవుతున్నట్లుగా తెలుస్తుంది. రాత్రి సమయాల్లో నడిచే దందా అంతా తెలంగాణ సరుకేనని తెలుస్తుంది!

Related posts

Leave a Comment