తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట… విశేషాలు

న్యూస్ ఇండియా 24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్…..హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పక్షి అయిన పాలపిట్ట శుభాలకు, విజయాలకు చిహ్నం. విజయదశమి రోజున ఈ పిట్టను చూడడాన్ని ప్రజలు ఎంతో అదృష్టంగా, శుభ సూచకంగా భావిస్తారు. దసరా పండుగ వచ్చిందంటే జమ్మిచెట్టు ఎలా గుర్తుకు వస్తుందో పాలపిట్ట కూడా అలాగే గుర్తుకువస్తుంది. గుప్పెడంత ఉండే ఈ పాలపిట్ట చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. దసరా పర్వదినాన పాలపిట్టను చూడాల్సిందే. దానికి మొక్కాల్సిందే. ఎందుకంటారా..! విజయదశమి రోజున ఈ పిట్టను చూస్తే అంతా శుభమే జరుగుతుందని, చేపట్టిన ప్రతి పనీ విజయవంతంగా పూర్తవుతుందని పూర్వీకుల నమ్మకం.

పాలపిట్టను దసరా రోజే ఎందుకు చూడాలి అంటారా? దీనికి చాలా ఆసక్తికరమైన ‘పిట్ట’ కథే ఉంది. పూర్వం పాండవులు అరణ్యవాసాన్ని ముగించుకుని అయోధ్య రాజ్యానికి తిరిగి వస్తుండగా.. పాలపిట్ట కనపడిందట. అప్పటి నుంచి వారికి విజయాలు సిద్ధించాయని జానపదుల నమ్మకం. అందుకే విజయదశమి రోజున పూర్వం తప్పనిసరిగా మగవాళ్లు అడవికి పోయి పాలపిట్టను చూసిగాని ఇంటికి వచ్చేవారు కాదట. ప్రజల మనస్సుల్లో ఈ పిట్టకు సాంస్కృతికంగా, పురాణాల పరంగా అంత ప్రాధాన్యం ఉంది మరి. అందుకే మన రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్నాటక, ఒడిస్సా, బీహార్‌ల రాష్ట్ర పక్షిగా పాలపిట్ట వెలిగిపోతోంది. ఇప్పుడు ఈ పక్షి జాడ కనుమరుగైపోయింది. ఊళ్లల్లో అక్కడక్కడా ఓ మెరుపు మెరుస్తున్నట్టు కనిపిస్తున్నా.. సిటీల్లో అయితే ఇవి పూర్తిగా కనుమరుగైపోయాయి.

అందుకే దసరా పండుగకు కొందరు పాలపిట్టలను పంజరంలో ఉంచి ప్రజలకు చూపిస్తూ.. శుభాలు కలుగుతాయని డబ్బులు వసూలు చేస్తుంటారు. ఇంకొందరైతే పండుగ సమయాన పాలపిట్టలను కొని, వాటిని ఊరి చివర్లో పొలాల మధ్య విడిచి పెడుతుంటారు. ఏదేమైనా దసరా పండుగ వచ్చిందంటే పాలపిట్టను దర్శించుకోవాల్సిందే. తెలంగాణాలో పాలపిట్టకు అత్యంత ప్రాధాన్యత ఉన్న విషయం తెలిసిందే.

Related posts

Leave a Comment