మహాత్మా గాందీ ” మన జాతిపిత “….. ప్రపంచానికే ఆదర్శం

THE NEWS INDIA 24/7 NATIONAL NEWS NETWORK….{SPECIAL STORY}  

మహాత్మా గాందీ… ఈ పేరు వింటేనే ఒక్క మన దేశమే కాకుండా యావత్తు ప్రపంచం లేచి నిలబడి మరీ సెల్యూట్ కొట్టేస్తోంది. విద్యార్థి దశ నుంచే తనదైన శైలి అహింసను ఆయుధంగా మలచుకుని గాంధీ కొనసాగించిన ప్రస్థానం నిజంగానే అజరామరమేనని చెప్పక తప్పదు. మన దేశానికి స్వాతంత్య్రం కోసం గాంధీ సాగించిన పోరాటం ప్రపంచ దేశాలకే మార్గదర్శకంగా నిలిచింది. ఏదో జయంతి వర్థంతి సందర్భాల్లో మాత్రమే ప్రస్తావించుకునే స్థాయిని దాటేసిన గాంధీ… నిత్యం యావత్తు మానవాళికి గుర్తుకు వచ్చే గొప్ప పోరాట యోధుడిగా పేరు సంపాదించారు. అలాంటి మహోన్నత వ్యక్తిత్వంతో కూడిన గాంధీ గురించి మనం ఇప్పుడు చాలా ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. అదే గాంధీ 150వ జయంతి వేడుక. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని భారత మీడియాతో పాటు అన్ని ప్రపంచ దేశాలకు చెందిన మీడియా ప్రత్యేక కథనాలతో ఆయనను స్మరించుకుంటోంది. 150వ జయంతే కాకుండా ప్రపంచ మానవాళి కొనసాగినంత కాలం కూడా మహాత్ముడిని మరిచే ప్రసక్తే లేదన్న రీతిలో వరల్డ్ మీడియా గాంధీపై స్పెషల్ స్టోరీలను ప్రచురిస్తోంది. ఇలాంటి అరుదైన సందర్భంలో మనం కూడా గాంధీజి గురించి ఆయనకు మాత్రమే సాధ్యమైన ఉదాత్త వ్యక్తిత్వం గురించి మననం చేసుకోవాల్సిందే.

1869 అక్టోబర్ 2న నాటి బ్రిటిష్ పాలనలోని భారత్ లో జన్మించిన మహాత్ముడి ప్రస్థానం అనన్య సామాన్యంగా కొనసాగింది. మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీగా తల్లిదండ్రులు నామకరణం చేసిన మహాత్ముడు బాల్య దశను దాటి ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసుకుని ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లినంతనే ఆయనలోని ఉద్యమ నేత బయటకు వచ్చేశారు. ఎక్కడో దక్షిణాఫ్రికాలో ఉండగానే అహింసా పద్దతిలో పోరు మెదలెట్టేసిన గాంధీ… ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదనే చెప్పాలి. దక్షిణాఫ్రికాలో నల్ల జాతీయులపై శ్వేత జాతీయులు పాల్పడుతున్న అకృత్యాలపై గళం విప్పిన గాంధీ… స్వదేశానికి తిరిగి వచ్చినంతనే భారత స్వాతంత్య్ర పోరాటానికి నాందీ పలికారు. బ్రిటిషర్లు తుపాలకు ఎదురొడ్డి మహాత్మా గాందీ సాగించిన పోరు… శ్వేత జాతీయులను వణికించిందని కూడా చెప్పక తప్పదు. ఏళ్ల తరబడి సాగిన స్వాతంత్య్ర సమరంలో మహాత్మా గాంధీది ముందడుగే తప్పించి ఏనాడూ వెనకడుగు వేసిన దాఖలాలే లేవని చెప్పాలి.

సరే… మహాత్ముడి గురించి మనకు ఇవన్నీ తెలిసిన సంగతులే. మరి మహాత్ముడి గురించి మనకు తెలియని సంగతులు ఏమైనా ఉన్నాయా? ఉండే అవకాశమే లేదు. మన దేశంలో గాంధీజీ సాగించిన అవిశ్రాంత పోరాటం బ్రిటిష్ పాలన నుంచి మనకు విముక్తి కలిగించిన వైనం మనకే కాకుండా యావత్తు ప్రపంచ దేశాలకు కూడా తెలిసిందే. మరి గాంధీజి గురించి మనం ఏం చెప్పుకోవాలి. మన దేశంలో గాంధీకి మనం ఇస్తున్న విలువ ఏ పాటితో ప్రత్యేకించి ప్రస్తావించుకోవాల్సిన అవసరం లేదు. అదే ప్రపంచంలోని మెజారిటీ దేశాలు గాందీజీని ఎలా గుర్తించాయి? ఇప్పటికీ ఆయన నడిచిన మార్గాన్ని ఎలా తమకు అపాదించుకున్నాయి? ఆ మార్గాన్ని ఇంకా ఏ రకంగా కొనసాగిస్తున్నాయి? ఈ క్రమంలో ఆయా దేశాలు తీసుకున్న నిర్ణయాలు ఏమిటి? ఇలాంటి విషయాలు కూడా మనకు తెలిసివే అయినా… మన దేశాన్నే కాకుండా యావత్తు ప్రపంచాన్ని మహాత్ముడు తన మార్గంలోకి వచ్చేలా చేసిన వైనంపై ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిందే. ఆ వివరాల్లో కొన్నింటిని మనమూ ప్రస్తావించుకుందాం.

 ప్రపంచ శాంతి కోసం తమదైన శైలి వ్యూహాలను అమలు చేసిన వారందరికీ గాంధీజీనే స్ఫూర్తి. గాంధీజీ స్ఫూర్తితో నడిచిన ఎందరికో నోబెల్ శాంతి బహుమతులు వచ్చాయి. అయితే వారికి ఆదర్శంగా నిలిచిన గాంధీజీకి మాత్రం ఇప్పటికీ నోబెల్ పీస్ ప్రైజ్ రానే లేదు. నోబెల్ పీస్ ప్రైజ్ కోసం గాంధీజీ పేరు ఏకంగా ఐదు సార్లు నామినేట్ అయినా కూడా ఆ బహుమతి గాంధీజీకి దక్కకపోవడం గమనార్హం.

మహాత్మా గాంధీ 1948లో మరణించిన తర్వాత… కేవలం రెండేళ్లకే అమెరికాలోని కాలిఫోర్నియాలో మహాత్ముడి పేరిట ‘మహాత్మా గాంధీ వరల్డ్ పీస్ సెంటర్‘ను అమెరికా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో గాంధీ అస్తికలను మూడు లోహాలతో తయారు చేసిన ప్రత్యేక పాత్రలో నిక్షిప్తం చేశారు.

1968లో బ్రిటన్ ప్రభుత్వం తమ దేశ రాజధాని లండన్ టావిస్టోక్ స్క్వేర్ లో గాందీ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఈ విగ్రహాన్ని నాటి బ్రిటన్ ప్రథాని హెరాల్డ్ విల్సన్ ఆవిష్కరించారు.

* డెన్మార్క్ లోని కోపెన్ హాగెన్ లోనూ గాంధీ విగ్రహాన్ని 1984లోనే ఆవిష్కరించారు. నాడు భారత ప్రధాని హోదాలో ఇందిరా గాంధీ తన డెన్మార్క్ పర్యటన సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

* 1898లో ఎక్కడైతే జాతి వివక్ష నేపథ్యంలో గాందీజీని రైల్లో నుంచి గెంటేశారో… తదనంతర కాలంలో అక్కడే దక్షిణాఫ్రికాలోని పీటర్స్ బర్గ్ లో గాంధీజీ నిలువెత్తు విగ్రహం వెలసింది.

* ఇక 2015లో బ్రిటిష్ రూల్ కు వ్యతిరేకంగా పోరాటం చేసిన గాంధీజీకి చెందిన నిలువెత్తు విగ్రహాన్ని బ్రిటన్ పార్లమెంటులోనే నాటి ఆ దేశ ప్రధాని డేవిడ్ కామెరూన్ ఆవిష్కరించారు.

ఇలా గాందీజీని స్మరించుకుంటూ ఆయనకు చెందిన విగ్రహాలు ఏదో కొన్ని దేశాల్లోనే కాకుండా ప్రపంచంలోని మెజారిటీ దేశాలన్నీ కూడా తమ తమ దేశాల్లో ఆవిష్కరించుకోవడమే కాకుండా గాంధీజీ జయంతి వర్ధంతిలను మన మాదిరే క్రమం తప్పకుండా జరుపుకుంటూ గాంధీజీని స్మరించుకుంటున్నారు.

 ఈ తరహాలో గాందీజీని అందరికంటే ఎక్కువగా స్మరించుకుంటున్న దేశంగా అగ్రరాజ్యం అమెరికానే కొనసాగుతోంది. గాంధీజీకి సంబంధించి విదేశాల్లో వెలసిన విగ్రహాల్లో మెజారిటీ అమెరికాలోనే ఉన్నాయట.

ఇలా చెప్పుకుంటూ పోతే… గాంధీజీకి సంబంధించిన విషయాలు చెప్పుకుంటూ పోతే పేజీలు కాదు కదా… పుస్తకాలు కూడా సరిపోవన్నది అతిశయోక్తి కాదు. భారత స్వాతంత్య్రం కోసం పోరాటం సాగించిన గాంధీజీ.. ఒక్క భారత్ కే కాకుండా యావత్తు ప్రపంచ దేశాలకు కూడా మార్గదర్శిగా ఆదర్శనీయుడిగా నిలిచిన వైనం మదేశానికి మాత్రమే దక్కిన అరుదైన ఘనతగా చెప్పుకోవాలి .

SEETHARAM  SANGINEEDI ,

EDITOR-IN -CHIEF,

THE NEWS INDIA 24/7 NATIONAL NEWS NETWORK.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *