ఉప ముఖ్యమంత్రి….పుష్ప శ్రీవాణి గిరిజన సామాజిక వర్గం కాదా?

THE NEWS INDIA 24/7 NEWS NETWORK

ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి , విజయనగరం జిల్లా కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి గిరిజన సామాజిక వర్గం కాదా? అంటే గిరిజన సంఘాల నేతలు అవుననే అంటున్నారు. గిరిజనేతర మహిళను తీసుకువచ్చి మంత్రి పదవి కట్టబెట్టడమే కాకుండా, ఆమెను ఉప ముఖ్యమంత్రిని చేయడం హాస్యాస్పదంగా ఉందని మండిపడుతున్నారు. పుష్ప శ్రీవాణి కులానికి సంబంధించిన కేసు ప్రస్తుతం న్యాయస్థానం లో కొనసాగుతుందని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పల నర్స తెలిపారు. అరకు లో ఆయన మీడియా తో మాట్లాడుతూ పుష్ప శ్రీవాణి సోదరి రామ తులసి ఎస్టీ కాదని గతంలో పార్వతీపురం ఐటి డిఏ అధికారులు జరిపిన విచారణ లో తేలిందని గుర్తు చేశారు. ఎస్టీ కాదని అధికారులు ధ్రువీకరించడం తో రామతులసి తన ఉపాధ్యాయ ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చిందని చెప్పారు.

సోదరి రామతులసి ఎస్టీ కానప్పుడు పుష్ప శ్రీవాణి ఎలా ఎస్టీ అవుతుందని, ఎస్టీగా పరిగణిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి , ఆమెను మంత్రివర్గం లోకి తీసుకుంటారని అప్పల నర్సు ప్రశ్నిస్తున్నారు. గిరిజనేతరులు, గిరిజనులుగా చలామణి అవుతుండడం వల్లే అసలైన గిరిజనులకు అన్యాయం జరుగుతోందని గిరిజన సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . పుష్ప శ్రీవాణి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడే ఆమె గిరిజనురాలు కాదంటూ కేసు దాఖలయింది . ఆ కేసు ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీవాణి గిరిజన రిజర్వ్ అసెంబ్లీ స్థానం కురుపాం నుంచి పోటీ చేయడాన్ని బీజేపీ గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి గాంధీ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ, ఆమె కులం పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులు తాజాగా తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలని నిబంధన ఉన్నప్పటికీ, దాన్ని కాదని శ్రీవాణి 2013 పొందిన కుల ధ్రువీకరణ పత్రాన్ని నామినేషన్ సమయం లో సమర్పించడం, దాన్ని ఎన్నికల అధికారి ఒకే చేయడాన్ని కూడా గిరిజన సంఘాల నేతలు తప్పుపడుతున్నారు.

గతం లో శ్రీవాణి ఎస్టీ కాదంటూ రాజకీయ ప్రత్యర్ధులు చేసిన ఆరోపణలనే, ఇప్పుడు గిరిజన సంఘాల నేతలు చేస్తుండడం తో జగన్ సర్కార్ ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కన్పిస్తున్నాయి. అయితే గతం లోనూ మంత్రి పదవి చేపట్టిన పలువురు ప్రజాప్రతినిధుల్ని గిరిజన సంఘాల నేతలు, గిరిజనేతరు లుగా పేర్కొనడం, వారు ఈ వివాదాలు కొనసాగుతుండగానే పదవి కాలాన్ని పూర్తి చేయడం జరిగిపోయాయి. ఇప్పుడు శ్రీవాణి కూడా ఎస్టీ కాదంటూ గిరిజన నేతలు ఆరోపణలు చేస్తున్న, ఆమె ను మంత్రివర్గం నుంచి ముఖ్యమంత్రి తప్పించే సూచనలు ఎంతమాత్రం కన్పించడం లేదు.

సీతారామన్న దొర
ఎడిటర్ ఇన్ చీఫ్
9966698666

Related posts

Leave a Comment