జగన్మోహన్‌రెడ్డి అనే నేను..

-ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తూ ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తున్నాను
-ఏపీ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణం అనంతరం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి
-వృద్ధాప్య పింఛన్ల పెంపు ఫైల్‌పై తొలి సంతకం
-అవినీతి లేని పాలన
-యువతకు 5.60లక్షల ఉద్యోగాలు
-అక్రమాలుంటే రివర్స్ టెండరింగ్
-విచారణకు జ్యుడిషియల్ కమిషన్
-ఎల్లో మీడియాపై పరువునష్టం దావా: జగన్
-విజయవాడలో పండుగలా కార్యక్రమం
-హాజరైన సీఎం కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్ తదితరులు

అమరావతి, నమస్తే తెలంగాణ: వైఎస్ జగన్ అనే నేను.. మీ అందరికి ఒకే మాట చెప్తున్నా.. 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. మీ కష్టాలు చూశాను. మీ బాధలు విన్నాను. మీ అందరికీ నేను ఉన్నానని గట్టిగా చెప్తున్నా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకరించిన అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడిన జగన్.. తన తొలి సంతకాన్ని వృద్ధాప్య పింఛన్ల పెంపుదల ఫైలుపై చేస్తున్నట్టు ప్రకటించడంతోపాటు.. నిరుద్యోగులపై వరాల జల్లు కురిపించారు. అవినీతిరహిత పాలన అందించేందుకు సీఎం కార్యాలయంలో కాల్‌సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన జగన్.. చంద్రబాబు హయాంలో టెండర్లలో జరిగిన అవినీతిని వెలికితీసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే పనులను, టెండర్లను రద్దుచేసి, రివర్స్ టెండరింగ్ జరిపిస్తామని చెప్పారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి యెల్లో మీడియా తప్పుడు రాతలురాస్తే, పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఒక్క ఏడాది సమయం ఇస్తే పూర్తి ప్రక్షాళన చేసి అవినీతి రహితపాలన సాధ్యం చేస్తానని చెప్పారు. మ్యానిఫెస్టోలో పేర్కొన్న నవరత్నాలను కుల, మత,రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ అందజేస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు మధ్యాహ్నం 12.23 గంటలకు ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్.. జగన్‌తో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు.

వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అనే నేను.. అని జగన్ అనగానే ఒక్కసారిగా స్టేడియం హోరెత్తింది. ఏపీ సీఎంగా ప్రమాణం స్వీకరించిన జగన్‌ను గవర్నర్ అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్.. జగన్‌కు పుష్పగుచ్ఛాలు అందించి, శుభాకాంక్షలు తెలిపారు. వేదికపై మతపెద్దలు సర్వమత ప్రార్థనలు నిర్వహించి.. ఆశీర్వచనాలు ఇచ్చారు. వృద్ధాప్య పింఛన్ల పెంపుదల ఫైలుపై సీఎం హోదాలో జగన్ తొలి సంతకంచేశారు. కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్, పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేవీపీ రామచంద్రరావు, స్టాలిన్ కుమారుడు, సినీ హీరో ఉదయనిధి స్టాలిన్, జగన్ తల్లి విజయమ్మ, భార్య భారతి, కుమార్తెలు హర్ష, వర్ష, సోదరి షర్మిల, ఇతర కుటుంబీకులు పాల్గొన్నారు. సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ కూడా హాజరయ్యారు. మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడును జగన్ స్వయంగా ఆహ్వానించినప్పటికీ.. ఆయన హాజరుకాలేదు. పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీ నేతలతోపాటు రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో స్టేడియం నిండిపోయింది.

ys-jagan4ఆకాశమంత గెలుపునిచ్చారు

రాష్ట్ర ప్రజలు తనకు ఆకాశమంత విజయాన్ని అందించారని సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అ న్నారు. ఆద్యంతం నినాదాల హోరు నడుమ వైఎస్ జగన్ అనే నేను అంటూ ప్రసంగం ప్రారంభించిన జగన్.. ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తూ ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తున్నాను. 3648 కిలోమీటర్లు ఈ నేలపై నడిచినందుకు తొమ్మిదేండ్ల కష్ట్టానికి ప్రతిగా ఆకాశమంతటి విజయాన్ని అందించారు. ప్రతి అక్కకు, చెల్లెమ్మకు, అవ్వకు, తాతకు, సోదరుడికి, స్నేహితుడికి రెండు చేతులు జోడించి పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. పదేండ్ల నా రాజకీయ జీవితంలో 3648 కి.మీ. పాదయాత్రలో పేదల కష్టాలు చూశాను. మీ కష్టాలు విన్న తర్వాత, ఈ వేదిక మీద నుంచి మీకు మాట ఇస్తున్నాను. మీ అందరికీ నేను ఉన్నాను. మీ అందరి ఆశలు, ఆకాంక్షలు పూర్తిగా పరిగణనలోకి తీసుకుంటూ మ్యానిఫెస్టోలోని అన్ని అంశాలను పూర్తిగా అమలుచేస్తాను. వేదికమీద ఉన్న పెద్దలు, ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్, ఇక్కడకు వచ్చిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను అన్నారు. జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. ఆయన మాటల్లోనే..

మ్యానిఫెస్టో ఊపిరిగా బతుకుతా

మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశం నెరవేర్చుతాను. దానిని ఖురాన్, బైబిల్, భగవద్గీతగా భావిస్తాను. ఒక ఊపిరిగా చూసుకుంటూ, ఐదేండ్లూ మీ కోసం పని చేస్తానని ముఖ్యమంత్రి హోదాలో మాటిస్తున్నా.

ys-jagan5యువతకు 5.60 లక్షల ఉద్యోగాలు

ఆగస్టు 15 నాటికి గ్రామాల్లో వాలంటీర్లుగా నాలుగు లక్షల మంది యువతకు ఉద్యోగావకాశం కల్పిస్తాం. ప్రతి 50 ఇండ్లకు ఒక గ్రామ వాలంటీర్‌ను రూ.5వేల వేతనంతో నియమిస్తాం. వారికి మెరుగైన ఉద్యోగం వచ్చేవరకు పనిచేయవచ్చు. గ్రామ సచివాలయం ద్వారా అక్టోబర్ 2 గాంధీ జయంతినాటికి మరో లక్షా 60వేల ఉద్యోగాలు కల్పిస్తాం. పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు గ్రామ సచివాలయాలను తీసుకొస్తున్నాం. నవరత్నాల్లో ఏ పథకం కావాలన్నా నేరుగా గ్రామ సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకుంటే 72 గంటల్లో పరిష్కరిస్తాం. అవినీతికి ఆస్కారం లేకుండా ప్రభుత్వ పథకాలను అందిస్తాం.
లంచం అడిగితే సీఎం ఆఫీస్‌కు ఫోన్ చేయండి

ప్రభుత్వ సేవలు ఎవరికి అందకపోయినా, లంచాలు కనిపించినా చూస్తూ ఊరుకోవద్దు. పథకాలు, సేవల అమలులో పొరపాటున లంచం అడిగినా నేరుగా చీఫ్ మినిస్టర్ ఆఫీస్‌కు ఫిర్యాదుచేయవచ్చు. ఆగస్టు 15 నుంచి కాల్ సెంటర్ అందుబాటులోకి వస్తుంది. ఎన్నికలు వస్తున్నాయని రెండు నెలల ముందు గత ప్రభుత్వం కొంత పింఛన్లు పెంచింది. మా ప్రభుత్వం అలా కాదు. మూడు వేల పింఛన్ వరకు అందించి తీరుతాం. అందుకే తొలి సంతకం చేశాను. జూన్ నెల నుంచి రూ.2,250 వైఎస్సార్ పింఛన్‌గా అందుతుంది. మీ మనుమడిగా ఆశీస్సులు కోరుతున్నాను. గ్రామ వాలంటీర్లు, గ్రామ సెక్రటేరియట్‌తో అనుసంధానమై ఉంటారు. లంచాలు, రికమెండేషన్లు ఉండవు.

ys-jagan3

అవినీతి కాంట్రాక్టులు రద్దు

ముఖ్యమంత్రిగా హామీ ఇస్తున్నా. అవినీతి, వివక్షలేని పాలన అందిస్తా. పైస్థాయి నుంచి కిందిస్థాయి దాకా ప్రక్షాళనచేస్తా. గత ప్రభుత్వ హయాంలో అవినీతి ఎక్కడ జరిగిందో బట్టబయలు చేస్తా. అలా జరిగిన కాంట్రాక్టులు, పనులను పూర్తిగా రద్దుచేస్తా. రివర్స్ టెండరింగ్ నిర్వహించి ఎక్కువమంది టెండర్ల ప్రక్రియలో పాల్గొనేలా చేస్తా. చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిని మీ ముందు పెడుతాం. సోలార్ పవర్, విండ్ పవర్‌ను ఇతర రాష్ట్రాల్లో గ్లోబల్ టెండర్ ద్వారా రూ.2.65 పైసలు నుంచి మూడు రూపాయలకు కొనుగోలుచేస్తుంటే, ఇక్కడ అధిక ధరకు కొనుగోలు చేశారు. పీక్ అవర్స్ పేరిట ఎక్కువ ధరకు కొనుగోలు చేశారు. అందుకే వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం.

జగన్‌పై పూల వర్షం

ప్రమాణ స్వీకార ప్రాంగణానికి చేరుకునేముందు జగన్ తాడేపల్లిలోని తన నివాసంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం జగన్, ఆయన కుటుంబ సభ్యులు ప్రత్యేక కాన్వాయ్‌లో తాడేపల్లి సెంటర్, వారధి మీదుగా విజయవాడలోని మున్సిపల్ స్టేడియానికి చేరుకున్నారు. జగన్ సభాస్థలికి చేరుకున్న సమయంలో వైఎస్సార్సీపీ నేతలు హెలికాప్టర్ నుంచి పూలు జల్లుతూ అభిమానం చాటుకున్నారు. అనంతరం పూలతో సుందరంగా అలంకరించిన ఓపెన్ టాప్ వాహనంలో జగన్ అక్కడి ప్రజలకు అభివాదం చేస్తూ స్టేడియంలో తిరిగారు. తర్వాత స్టేజిమీదకు చేరుకొని మరోసారి ప్రజలకు అభివాదంచేయగా.. ఒక్కసారిగా ప్రజలుచేసిన కరతాళధ్వనులతో స్టేడియం మొత్తం ప్రతిధ్వనించింది.

Related posts

Leave a Comment