ఆరెస్సెస్ ప్రచారక్ నుంచి చరిత్రాత్మక నేతగా..

– హిందుత్వానికి జాతీయవాదం మేళవింపు
– విమర్శలకు వెరవని నేత.. దేశంలోనే శక్తిమంతుడు
– సంపూర్ణ మెజారిటీతో రెండోసారి ప్రధానిగా ప్రమాణం చేసిన మూడోనేత

న్యూఢిల్లీ, మే 30: నినాదాలతో ప్రజలను మంత్రముగ్ధులను చేయడంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు ఆయనే సాటి. తొలుత 2014లో అబ్‌కీ బార్ మోదీ సర్కార్, సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ నినాదాలతో యావత్ భారతావనిని హోరెత్తించి ఒంటి చేత్తో తొలిసారి బీజేపీని సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి తీసుకొచ్చారు. తాజాగా 2019 ఎన్నికల్లో ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అన్న నినాదంతో భారతీయులందరి మనస్సులు చూరగొన్న మోదీ.. గురువారం రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలి ప్రధాని పండిట్ నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత సంపూర్ణ మెజార్టీతో రెండోసారి ప్రధానిగా ప్రమాణం చేసిన మూడో నేతగా మోదీ.. దేశ చరిత్రలో తన స్థానాన్ని పదిలపర్చుకున్నారు. దామోదర్‌దాస్ మోదీ, హీరాబెన్ దంపతుల ఆరుగురి పిల్లల్లో మోదీ మూడో సంతానం. సాధారణ ఆరెస్సెస్ ప్రచారక్‌గా 1985లో ప్రయాణం ప్రారంభించిన మోదీ.. తర్వాత బీజేపీలో చేరారు. 2001 అక్టోబర్‌లో కేశూభాయి పటేల్ స్థానంలో గుజరాత్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తిరిగి వెనుకకు చూసుకోలేదు. నాటి నుంచి 2014లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించే వరకు గుజరాత్ సీఎంగా పని చేసి రికార్డు నెలకొల్పారు. ప్రధానిగా మోదీ తొలిసారి స్వచ్ఛ భారత్, మేకిన్ ఇండియా తదితర పథకాలను ప్రారంభించారు. పెద్దనోట్ల రద్దుతోపాటు దేశవ్యాప్తంగా జీఎస్టీ అమలుతో చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను తక్షణం గాడిలో పెట్టాల్సిన అవసరం ఉన్నది.

విదేశీ బ్యాంకుల్లో కుబేరులు దాచుకున్న నల్లధనాన్ని వెనుకకు రప్పిస్తానని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలుపుకోలేదు. అయితే ఆర్థిక సంస్కరణల అమలు ద్వారా సులభ వాణిజ్యంలో అంతర్జాతీయంగా ప్రపంచ బ్యాంకు సూచీలో భారత్ స్థానాన్ని 100వ ర్యాంక్ నుంచి 77కు పెంచడంలోనూ కీలక భూమిక పోషించారు. అత్యంత సున్నితమైన రామమందిరం అంశంపై ప్రధాని మోదీ ఆచితూచి స్పందించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పరాధీనులమని భావిస్తున్న ముస్లిం మైనారిటీల్లో నెలకొన్న ఆందోళనను పరిగణనలోకి తీసుకోవాలని చెబుతున్నారు. ఇక జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న 370, 35 అధికరణాలను రద్దు చేస్తామని మోదీ ఇచ్చిన హామీపై ఆ రాష్ట్ర వాసుల్లో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. మాజీ ప్రధాని వాజపేయి జాడల్లో ప్రయాణం సాగించిన మోదీ ధైర్యంగా, దూకుడుగా హిందుత్వ నినాదానికి జాతీయ వాదాన్ని జోడించి ముందుకు తీసుకెళ్లడంలో ఆయనకు ఆయనే సాటి.
Amit-Shah

అపర చాణక్యుడు.. అమిత్‌షా

అపర రాజకీయ చాణక్యుడు అమిత్ షా. వ్యూహాలు పన్నడంలో దిట్ట. 2014లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత పార్టీలో మోదీ తర్వాత అత్యంత శక్తిమంతమైన నేతగా అమిత్ షా ఎదిగారు. పార్టీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ ప్రాతినిధ్యం వహించిన గాంధీనగర్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2001-14 మధ్య మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో షా ఆయనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. హోంశాఖ బాధ్యతలు నిర్వహించారు. 2014లో బీజేపీ అధికారంలోకి రావడంలో షా కీలకంగా వ్యవహరించారు. షాను కేంద్రం మంత్రివర్గంలోకి తీసుకున్న నేపథ్యంలో బీజేపీ తన సిద్ధాంతపరమైన అజెండాను వేగంగా అమలుపరిచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. చదరంగం, శాస్త్రీయ సంగీతాన్ని షా ఇష్టపడుతారు.
Nitin-Gadkari

ముక్కుసూటిదనం..

సమస్యలను సులువగా పరిష్కరించే నైపుణ్యం.. ముక్కుసూటిగా మాట్లాడే తత్వం.. సుదీర్ఘ రాజకీయ అనుభవం నితిన్ గడ్కరీ సొంతం. మోదీ-1 ప్రభుత్వంతో కీలకపాత్ర పోషించిన ఆయన.. మరోసారి మంత్రిగా ప్రమాణం చేశారు. 1957లో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జన్మించారు. ఆరెస్సెస్ నేతృత్వం కలిగిన నేత. మహారాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన కాలంలో ముంబైలో విస్తృతంగా ైఫ్లెఓవర్లు నిర్మించారు. మౌలిక వసతులను అభివృద్ధి చేశారు. అప్పటి నుంచి ఆయనను ైఫ్లెఓవర్ మ్యాన్‌గా పిలుస్తున్నారు. ఆయనకు 2014లో కేంద్రమంత్రివర్గంలో స్థానం దక్కింది. ఉపరిత రవాణాశాఖ మంత్రిగా సమర్థంగా విధులు నిర్వర్తించారు. ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్ హైవే, ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్ హైవే, జోజిలా టన్నెల్ వంటి కీలక ప్రాజెక్టులను పూర్తిచేయించగలిగారు. తాజా ఎన్నికల్లో గడ్కరీ నాగ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి మరోసారి గెలిచారు.
nirmala

సేల్స్ విమెన్ టు మినిస్టర్

నిర్మలా సీతారామన్.. ఒకప్పుడు గృహాలంకరణ వస్తువుల దుకాణంలో పనిచేసిన ఆమె.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రక్షణ మంత్రిగా బాధ్యతలను నిర్వహించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత ఆ శాఖ బాధ్యతలను నిర్వర్తించిన రెండో మహిళగా రికార్డులకెక్కారు. తమిళనాడులోని మధురైలో 1959 ఆగస్టు 18న జన్మించారు. ఆర్థికశాస్త్రంలో డిగ్రీ పట్టా, ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీని అందుకున్నారు. 2016 నుంచి రెండు పర్యాయాలు రాజ్యసభకు నామినేట్ అయిన నిర్మల.. మోదీ తాజా క్యాబినెట్‌లో మరోసారి బెర్త్‌ను దక్కించుకున్నారు. రక్షణమంత్రిగా సమర్థంగా బాధ్యతలు నిర్వహించిన ఆమె..రాఫెల్ ఒప్పందంపై విపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు ధీటైన సమాధానం ఇస్తూ, ప్రధాని మోదీకి బలమైన సహకారాన్ని అందించారు.
rajnath

అజాతశత్రువు.. రాజ్‌నాథ్‌సింగ్

బీజేపీ ముఖ్యనేతల్లో రాజ్‌నాథ్ సింగ్ ఒకరు. అజాత శత్రువుగా పార్టీ కురువృద్ధుడు అటల్ బిహారీ వాజపేయి వారసత్వాన్ని ఆయన కొనసాగిస్తున్నారు. సంక్షోభ సమయాల్లో ప్రధాని మోదీ.. రాజ్‌నాథ్‌పైనే ఎక్కువగా ఆధారపడేవారు. విపక్ష నేతలతో రాజ్‌నాథ్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఫిజిక్స్ మాజీ ప్రొఫెసర్ అయిన ఆయన 2009-13, 2013-14 మధ్య పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. సీనియర్ నాయకులు ఎల్‌కే అద్వానీ వంటి నేతలు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ 2014లో మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంలో రాజ్‌నాథ్ కీలకంగా వ్యవహరించారు. ఆరెస్సెస్ జీవిత కాల సభ్యుడైన ఆయన ఆ సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహించారు. 2000-2002 మధ్య ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. వాజపేయి ప్రభుత్వంలో ఉపరితల రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి మూడుసార్లు, రాజ్యసభకు రెండుసార్లు ఎన్నికయ్యారు. 2009లో తొలిసారి ఘజియాబాద్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2014, 19లో లక్నో నుంచి వరుసగా గెలుపొందారు.
Prakash-Javadekar

జవదేకర్ సేవలకు గుర్తింపుగా..

ఇటు పార్టీలోనూ, అటు ప్రభుత్వంలోనూ కీలక పాత్ర పోషించిన ప్రకాశ్ జవదేకర్‌ను మరోసారి మంత్రి పదవి వరించింది. ఎన్డీఏ-1లో కేంద్రమానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన జవదేకర్ రాజస్థాన్‌లోని మొత్తం 25 లోక్‌సభ స్థానాలకుగాను 24 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడంలో ముఖ్యపాత్ర పోషించారు. విద్యారంగంలో పలు సంస్కరణలను తీసుకొచ్చిన ఆయనకు వివాదరహితుడిగా పేరుంది. పర్యావరణ మంత్రిగా, సమాచార ప్రసార శాఖ మంత్రిగా, పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రిగానూ జవదేకర్ సేవలందించారు. ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన పలు కమిటీల్లోనూ సభ్యుడిగా పనిచేశారు. విద్యార్థి దశలోనే ఏబీవీపీ కార్యకర్తగా పనిచేసిన ఆయన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడారు.
ravishankar

ప్రతి ఎన్డీఏ ప్రభుత్వంలోనూ..

అయోధ్య వివాదంలో రామ్‌లల్లా తరఫున వాదించిన న్యాయవాదిగా, డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ముందుకు నడిపిన ఆధునికవాదిగా రవిశంకర్ ప్రసాద్‌లో అనేక పార్శ్యాలు ఉన్నాయి. గత రెండు దశాబ్దాల్లో ఏర్పాటైన ప్రతి ఎన్డీఏ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఎన్నికల్లో పాట్నా సాహిబ్ నుంచి తన మాజీ సహచరుడు శత్రుఘ్న సిన్హాపై గెలుపొందారు. ఆరెస్సెస్ నేపథ్యమున్న రవిశంకర్..వాజపేయి ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మోదీ ప్రభుత్వంలో తొలుత టెలికం, ఐటీ, న్యాయశాఖ మంత్రి పనిచేశారు. తొలిసారిగా ఈ ఎన్నికల్లో లోక్‌సభకు పోటీచేశారు. అంతకుమునుపు నాలుగు సార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు.
Smitri-Irani

స్మృతికి ఆకాశమే హద్దు..!

పట్టు విడువని తత్వమున్న స్మృతీ ఇరానీ బీజేపీలో అనూహ్యంగా ఎదిగారు. 2014లో కాంగ్రెస్ కంచుకోట అయిన అమేథీలో ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేతిలో పరాజయం పాలైనప్పటికీ ఆయన మెజార్టీని గణనీయంగా తగ్గించగలిగారు. ఓటమికి కుంగిపోకుండా గత ఐదేండ్లగా అమేథీలో విస్తృతంగా పర్యటించి పట్టును పెంచుకున్నారు. ఈ ఎన్నికల్లో రాహుల్‌పై గెలుపొంది జెయింట్ కిల్లర్‌గా నిలిచారు. 2004లో తొలిసారి ఢిల్లీలోని చాందినీ చౌక్ నుంచి కాంగ్రెస్ నేత కపిల్ సిబల్‌పై పోటీచేసి ఓటమిచవిచూశారు. 2011, 17లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2014లో మోదీ క్యాబినెట్‌లో చోటు సంపాదించిన పిన్నవయస్కురాలిగా గుర్తింపు పొందారు.
Harsimrat-Kaur-Badal

కౌర్.. వన్స్ మోర్

పంజాబ్‌లోని శిరోమణి అకాళీదల్ పార్టీకి మరోసారి కేంద్రమంత్రి వర్గంలో చోటు లభించింది. ఆ పార్టీ అధ్యక్షుడైన సుఖ్‌భిర్‌సింగ్ బాదల్ భార్య, భటిండా ఎంపీ హర్‌సిమ్రత్‌కౌర్ బాదల్ రెండో సారి కేంద్రమంత్రిగా ప్రమాణం చేశారు. ఢిల్లీలో జన్మించిన ఆమె ఢిల్లీ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందడమే కాకుండా టెక్స్‌టైల్ టెక్నాలజీలో డిప్లొమా చేశారు. భటిండా నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో శిరోమణి అకాళీదల్ రెండు స్థానాల్లో గెలిచింది. ఆ రెండు స్థానాలు కూడా భార్యాభర్తలు గెలిచినవే కావడం విశేషం.
Jaishankar

అన్యూహంగా మంత్రివర్గంలోకి

ప్రధాని మోదీ మంత్రివర్గంలో విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి ఎస్ జైశంకర్‌కు అన్యూహంగా చోటు లభించింది. 64 ఏండ్ల వయసున్న ఆయన గతంలో అమెరికా, చైనాలో భారత రాయబారిగా పనిచేశారు. 1977 ఐఎఫ్‌ఎస్ క్యాడర్‌కు చెందిన జైశంకర్ భారత్-చైనా సరిహద్దులో డోక్లాం వివాదం తలెత్తినప్పుడు సమస్య పరిష్కారంలో కీలకపాత్ర పోషించారు. చైనాతో సంప్రదింపులు జరిపి వివాదం సద్దుమణిగేలా చూశారు. ఉద్యోగరీత్యా జైశంకర్ సింగపూర్‌లో భారత హైకమిషనర్‌గాను, చెక్ రిపబ్లిక్‌లో భారత రాయబారిగాను సేవలందించారు. ఎంతో కీలకమైన విదేశాంగ శాఖ కార్యదర్శిగా ఆయన 2015 నుంచి 2018 వరకు పనిచేశారు. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేసిన జౌశంకర్‌ను 2019లో పద్మశ్రీ పురస్కారం వరించింది.
Ram-Vilas-Paswan

అపర రాజకీయ శిల్పి.. పాశ్వాన్!

లోక్‌జనశక్తి పార్టీ (ఎల్జేపీ) అధినేత రాం విలాస్ పాశ్వాన్.. ఆరుగురు ప్రధానుల క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేసి అరుదైన ఘనత సాధించారు. 1960లలో బీహార్ శాసనసభ సభ్యుడిగా రాజకీయ జీవితాన్ని ఆరంభించిన పాశ్వాన్.. 1977లో ఎమర్జెన్సీ అనంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో హజీపూర్ స్థానం నుంచి 4 లక్షలకుపైగా మెజార్టీతో విజయం సాధించడం ద్వారా గుర్తింపు పొందారు. అనంతరం 1989లో తొలిసారి వీపీ సింగ్ క్యాబినెట్‌లోమంత్రిగా నియమితులయ్యారు. ఆ తర్వాత దేవెగౌడ, ఐకే గుజ్రాల్, వాజపేయి, మన్మోహన్‌సింగ్, మోదీ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న పాశ్వాన్.. బీహార్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశం ఉన్నది.

84

Related posts

Leave a Comment