ఇదొక ఉజ్వల ఘట్టం

-తెలుగు ప్రజలు ప్రేమానురాగాలతో నడిచేందుకు బీజం
-గోదావరి జలాలు సంపూర్ణంగా వాడుకుందాం
-చరిత్రలో నిలిచిపోయేలా జగన్ పాలించాలి
-రెండు రాష్ర్టాల మధ్య ఖడ్గచాలనం కాదు.. కరచాలనం కావాలి
-జగన్ ప్రమాణస్వీకారోత్సవంలో సీఎం కే చంద్రశేఖర్‌రావు

అమరావతి, (న్యూస్ ఇండియా24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారం తెలుగు రాష్ర్టాల ప్రజల జీవనగమనంలో ఉజ్వల ఘట్టమని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభివర్ణించారు. రెండు తెలుగు రాష్ర్టాల మధ్య ఇప్పుడు కావాల్సింది ఖడ్గచాలనం కాదని, కరచాలనమని చెప్పారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో పరస్పర సహకారంతో ముందుకు వెళ్తూ, ఉభయ రాష్ర్టాలు సంపూర్ణంగా నదీజలాలను వినియోగించుకోవాలని ఆకాంక్షించారు. గురువారం ఏపీ సీఎంగా ప్రమాణం స్వీకరించిన జగన్మోహన్‌రెడ్డికి కేసీఆర్ అభినందనలు తెలిపారు. జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన కేసీఆర్ మాట్లాడుతూ, అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జగన్మోహన్‌రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం, ప్రజల పక్షాన హృదయపూర్వక అభినందనలు, ఆశీస్సులు.

తెలుగు ప్రజల జీవనగమనంలో ఇదొక ఉజ్వలమైన ఘట్టం. ఉభయ రాష్ట్రాల సంబంధీకులు దేశంలో, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ప్రేమానురాగాలతో, పరస్పర సహకారంతో ముందుకు సాగటానికి ఈ ఘట్టం బీజం వేస్తుందని విశ్వసిస్తున్నాను అని చెప్పారు. వయస్సు చిన్నదైనా బాధ్యత పెద్దదని, దానిని అద్భుతంగా నిర్వహించే అభినివేశం, ధైర్యం, ైస్థెర్యం, సామర్థ్యం, శక్తి ఉన్నాయని గత తొమ్మిదేండ్లలో జగన్ ప్రస్ఫుటంగా నిరూపించుకున్నారంటూ ప్రశంసించారు. తండ్రి నుంచి వచ్చిన వారసత్వం ఆయనను అద్భుతంగా ముందుకు నడిపిస్తుందని ఆశించారు. సీఎంగా జగన్ కార్యనిర్వహణ కాలంలో ప్రజలందరు సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని, సంపూర్ణ విజయం సాధించాలని భగవంతుడిని మనసారా ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.

ఖడ్గ చాలనం కాదు.. కరచాలనం కావాలి

తెలుగు రాష్ట్రాలు పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలని, కృష్ణా, గోదావరి జలాలను సంపూర్ణంగా వినియోగించుకోవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పుడు చేయాల్సింది ఖడ్గచాలనం కాదు.. కరచాలనం. ఒకరి అవసరాలకు మరొకరు ఆత్మీయతతో, అనురాగంతో పరస్పర సహకారం అందించుకుంటూ అద్భుతమైన ఫలితాలు రాబట్టాలి. నాకు తెలిసి జగన్ ముందున్న కర్తవ్యం గోదావరి జలాల సంపూర్ణ వినియోగం. వందశాతం ఇది జరిగి తీరాలి. మీ ఆధ్వర్యంలో జరుగుతుందని విశ్వసిస్తున్నాను. కృష్ణానదిలో మనకు సమస్యలున్నాయి. అక్కడ లభించే ఒక్కో నీటిబొట్టును ఒడుపుగా, ఒద్దికగా, ఓపికగా ఉభయరాష్ట్రాలవాళ్లం కలిసి వినియోగించుకోవాలి.

సమృద్ధిగా ఉన్న గోదావరి జలాలతో ఉభయ రాష్ట్రాల్లోని ప్రతి అంగుళం సస్యశ్యామలం కావాలని కోరుకుంటున్నా అని చెప్పారు. ఆ కర్తవ్య నిర్వహణలో అవసరమైన అండదండలు, సహాయ సహకారాలు, అన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్రం అందిస్తుందని హామీ ఇచ్చారు. అద్భుతమైన అవకాశాన్ని ప్రజలు కల్పించారని, దాన్ని సద్వినియోగం చేసుకొని నాన్నగారి పేరు నిలబెట్టాలని సూచించారు. చరిత్రలో నిలిచిపోయేవిధంగా కీర్తి ప్రతిష్ఠలు ఆర్జించాలని ఆకాంక్షించారు. మతపెద్దలు దీవించినట్లు.. ఒక టర్మ్ కాదు.. కనీసం మూడు నాలుగు టర్మ్‌ల వరకు ఏపీని పరిపాలించాలంటూ మనసారా కోరుకుంటూ శుభాశీస్సులు అందజేశారు.

Related posts

Leave a Comment