పాదయాత్ర నుంచి.. సీఎం పీఠానికి

న్యూస్ ఇండియా24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్

ఏపీ రాజకీయాల్లో సంచలనం జగన్…

కాంగ్రెస్‌ను ధిక్కరించి.. సొంత పార్టీ...

చంద్రబాబుపై పోరాడి అధికారంలోకి..

 జగన్! ఇప్పుడు ఈ పేరు దేశంలోనే ఒక సంచలనం! మొన్నటిదాకా.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనయుడు! నేడు.. ఆ తండ్రి వారసత్వాన్ని స్వీకరించిన పాలకుడు! ఒక జాతీయ పార్టీని ఢీకొన్నా.. రాష్ట్ర విభజన తర్వాత ఒక సీనియర్ నాయకుడిని ఎదిరించి తన ఉనికిని చాటుకున్నా.. సాహసంతో మూడువేల కిలోమీటర్లకుపైగా రాష్ట్రంలో పాదయాత్ర చేసినా.. అది జగన్‌కే చెల్లింది! తొమ్మిదేండ్ల కష్టం.. ఫలితాన్నిచ్చింది. ఏపీ రెండో సీఎంగా ప్రమాణం స్వీకరించిన జగన్మోహన్‌రెడ్డి 1972 డిసెంబర్ 21న పులివెందులలో జన్మించారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, విజయమ్మల ఏకైక కుమారుడు. జగన్‌కు భార్య భారతి, ఇద్దరు కుమార్తెలు హర్షారెడ్డి, వర్షారెడ్డి ఉన్నారు. జగన్ విద్యాభ్యాసం పులివెందులలో, తదుపరి హైదరాబాద్ పబ్లిక్‌స్కూల్‌లో సాగింది. 

నిజాంకాలేజీలో బీకాం పూర్తిచేశారు. అనంతరం మాస్టర్ ఆఫ్ బిజినెస్ చేశారు. 2009లో మొదటిసారి కడప లోక్‌సభ నియోజకవర్గంనుంచి ఎన్నికయ్యారు. రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం 2010 నవంబర్ 29న కాంగ్రెస్ పార్టీకి, 2011 మార్చిలో కడప లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు. వైఎస్సార్సీపీని స్థాపించి, 2011 మే నెలలో జరిగిన ఉప ఎన్నికల్లో కడప నుంచి 5,45,043 ఓట్ల రికార్డు మెజార్టీతో ఎన్నికయ్యారు. 2014లో పులివెందుల నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన జగన్.. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నుంచి తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 

దక్కిన యాత్రాఫలం

జగన్ రాజకీయ జీవితంలో అనేక ఢక్కామొక్కీలు తిన్నా.. పూర్తిస్థాయి రాజకీయ పరిణతిని అందించింది ఆయన అత్యంత సాహసంతో నిర్వహించిన ప్రజాసంకల్ప యాత్ర. 2017 నవంబర్ 6న ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. ఏపీలోని 125 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా 430 రోజులపాటు సాగింది. 3600 కిలోమీటర్ల పాదయాత్రతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. ప్రజల కష్టనష్టాలు విన్నారు. వాటన్నింటినుంచే తన ఎన్నికల మ్యానిఫెస్టోకు రూపకల్పన చేశారు.

ఎడిటర్ ఇన్ చీఫ్
సీతారామన్న దొర

Related posts

Leave a Comment