ప్రభుత్వ శాఖలన్నీ ఇంజినీరింగ్ పనులు ఆపేయాలి: ఏపీ సీఎస్ ఆదేశం

న్యూస్ ఇండియా 24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్

  • ప్రభుత్వ శాఖల కార్యదర్శులకు నూతన మార్గదర్శకాలు
  • అనాలోచిత నిర్ణయాలతో ఖజానాపై భారం పడిందన్న సీఎస్
  • ఇంజినీరింగ్ పనుల చెల్లింపులపై నూతన విధివిధానాలు

ఏపీ కొత్త ముఖ్యమంత్రిగా జగన్ పదవీప్రమాణం చేసిన కొద్దిసేపట్లోనే అధికార యంత్రాంగంలో, పాలనా విధానాల్లో వేగవంతమైన మార్పులు కనిపించాయి. ఆర్థిక వనరులు లేనందున ప్రభుత్వ శాఖలన్నీ ఇంజినీరింగ్ పనులు నిలిపివేయాలని సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించారు. ఇంజినీరింగ్ పనుల కారణంగా ఖజానాపై పెనుభారం పడిందన్నారు. ప్రభుత్వ పనుల్లో నిధుల వ్యయం, బిల్లుల మంజూరుకు సంబంధించి స్పష్టతనిస్తూ సీఎస్ కొద్దిసేపటి క్రితం మెమో జారీచేశారు.

ఎఫ్ఆర్ బీఎం పరిమితులను పట్టించుకోకుండా చేసిన పనులతో రాష్ట్రంపై ఆర్థికంగా భారం పడిందని సీఎస్ పేర్కొన్నారు. ముఖ్యంగా, ప్రాధాన్యతలను పట్టించుకోకుండా చేపట్టిన ప్రాజక్టు పనుల్ని సమీక్షించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో క్రమంగా దిగజారుతున్న ఆర్థిక వనరులు అనాలోచిత నిర్ణయాలను ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 కంటే ముందు మంజూరైనా, ఇంకా ప్రారంభించని పనులు ఏవైనా ఉంటే వాటిని రద్దు చేయాలని సీఎస్ స్పష్టం చేశారు. 25 శాతం పనులు పూర్తవని ప్రాజక్టుల విలువను నిర్ధారించాలని, వాటికి తదుపురి బిల్లుల చెల్లింపులు చేయరాదని తన ఆదేశాల్లో వివరించారు.

ప్రస్తుత ప్రభుత్వం పేదల సంక్షేమంతోపాటు అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యంగా పెట్టుకుందని ఎల్వీ సుబ్రహ్మణ్యం చెప్పారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు నిబంధనలకు లోబడి వ్యవహరించాలని నూతన ప్రభుత్వ విధానాన్ని తెలిపారు. అన్ని డిపార్ట్ మెంట్ ల అధిపతులు, అధికారులు తాజా నిబంధనల ప్రకారమే చెల్లింపులు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అన్ని విధాలా ధృవీకరణ జరిగిన పనులకు మాత్రమే చెల్లింపులు చేయాలని పే అండ్ అకౌంట్స్ కార్యాలయానికి వివరించారు.

Related posts

Leave a Comment