15న రాష్ట్రానికి కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌ రాక

న్యూస్ ఇండియా24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్… (అమరావతి బ్యూరో)

అటవీహక్కుల చట్టంపై సమీక్ష ,….
 
ఈ నెల 15న కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ (మోటా) డైరెక్టర్‌ డాక్టర్‌ ఎ అనిల్‌ కుమార్‌ రాష్ట్రానికి రానున్నారు. రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అటవీ హక్కు చట్టం అమలవుతున్న తీరుపై ఆయన రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అటవీ హక్కు చట్టం ప్రకారం ఇప్పటి వరకు భూమి హక్కు పత్రాల కోసం ఎంత మంది గిరిజనులు దరఖాస్తులు చేసుకున్నారు, ఎంత మందికి పంపిణీ చేశారు, ఎంత మందికి నిరాకరించారు, అలా నిరాకరించడానికి కారణాలు ఏమిటనే అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. భూమి హక్కు పత్రాలు పొందని వారిని అడవి నుంచి ఖాళీ చేయించాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చి, తర్వాత దానిని నిలుపదల చేసిన విషయం తెలిసిందే. అయితే భూమి హక్కు పత్రాలు పొందిన వారితో పాటు పొందని వివరాలతో కూడిన అఫిడవిట్‌లను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టులో దాఖలు చేయాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాల గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో జరుగుతోన్న అటవీ హక్కుల చట్టం ( ఆర్వోఎఫ్‌ఆర్‌ ) అమలు తీరును సమీక్షించడంతో పాటు ఆయా రాష్ట్రాల్లోని గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో చేపడుతోన్న పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ (మోటా) అధికారులు అన్ని రాష్ట్రాలు పర్యటిస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 15న మోటా డైరెక్టర్‌ డాక్టర్‌ ఎ అనిల్‌ కుమార్‌ రాష్ట్రానికి రానున్నారు. ఆ మేరకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులకు లేఖ రాసినట్లు ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు. విశాఖపట్నంలో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరుతో నిర్మిస్తోన్న ట్రైబల్‌ మ్యూజియం గురించి కూడా ఈ సందర్భంగా చర్చ జరపనున్నారు.
మ్యూజియంలో ప్రస్తుతం చేపడుతోన్న నిర్మాణాలకు అదనంగా ఏర్పాటు చేయాల్సిన ఆకృతులపై అధికారులతో చర్చించనున్నారు. ఆకృతుల నిర్మాణ రంగంలో నిపుణులతో సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. అంతేగాక ప్రముఖ ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో కార్పొరేట్‌ సోషల్‌ రెస్సాన్సిబిలిటీ ( సిఎస్‌ఆర్‌ ) పైన కూడా చర్చించనున్నారు. సిఎస్‌ఆర్‌ కింద ఇప్పటి వరకు రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధి కోసం చేపట్టిన, చేపట్టబోతున్న కార్యక్రమాల గురించి కూడా చర్చించనున్నారు.

…..ఎడిటర్ ఇన్ చీఫ్., 
   సీతారామన్న దొర,.

Related posts

Leave a Comment