జీడి రైతుకు సర్కారు టోకరా…

న్యూస్ ఇండియా నేషనల్ న్యూస్ నెట్వర్క్….విందు భోజనం పసందుగా వుండాలంటే జీడిపప్పు తప్పక వాడాల్సిందే. కానీ ఆ జీడి పప్పు ఉత్పత్తికి మూల కారణమైన జీడి మామిడిని పండించే రైతుకు మాత్రం పసందైన ధర కాదు కదా కనీసమైన ధర కూడా దక్కడం లేదు. అటు వ్యాపారులూ ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలూ దగా చేస్తున్నాయి. జీడిపప్పు ఉత్పత్తి, వినియోగం, ఎగుమతిలో ప్రపంచంలోనే ముందు పీఠిన వున్న భారత్‌ ఇప్పుడు తీవ్ర ఒడుదుడుకులకు గురవుతోంది. సందట్లో సడేమియాలా విదేశీ జీడి పిక్కల దిగుమతితో ఇబ్బందులు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీ కూడా ఎక్కువగానే వుంది. ప్రస్తుతం రాష్ట్రంలో జీడి పిక్కలు రైతు చేతికొచ్చే సమయం. అలాగే అమ్ముకునేదీ ఇప్పుడే. ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం. 

సాగు, ఉత్పత్తి, ప్రోసెసింగ్‌ ఇలా… 

దేశంలోని 17 రాష్ట్రాలలో జీడి మామిడి 10.4 లక్షల హెక్టార్ల (25.7 లక్షల ఎకరాలు)లో సాగవుతోంది. సుమారు 7.8 లక్షల మెట్రిక్‌ టన్నుల జీడి పిక్కలు పండుతాయి. ప్రపంచ ఉత్పత్తిలో ఇది 25 శాతం కావడం గమనార్హం. అంతేగాక సుమారు 16 లక్షల టన్నుల పిక్కలను ప్రోసెస్‌ చేసి భారత్‌ ప్రపంచంలో ప్రథమ స్థానంలో వుంది. దాదాపు 3.68 లక్షల టన్నుల జీడిపప్పు ఉత్పత్తి అవుతుండగా అందులో 2.7 లక్షల టన్నుల దేశీయ వినియోగంతో ప్రపంచంలో మొట్టమొదటిదిగా నిలిచింది.

అయితే అంతర్జాతీయ జీడిపప్పు వ్యాపారంలో మాత్రం భారత్‌ వాటా కేవలం 21 శాతం కాగా వియత్నాం 61 శాతం వాటాతో అగ్ర స్థానంలో వుంది. జీడి పిక్కల నుండి వచ్చే జీడిని (కాషఉ్య షెల్‌ లిక్విడ్‌) రంగులు, మందులు, రసాయనాల పరిశ్రమలో వినియోగిస్తారు. దాని ఎగుమతిలో మనది అగ్ర స్థానమే! అయితే, జీడి పండ్లను (కాషఉ్య ఆపిల్‌) మాత్రం మన దేశంలో సద్వినియోగం చెయ్యడం లేదు. పండ్ల రసం, అదే విధంగా ఆల్కహాల్‌ ఉత్పత్తి వైపు ప్రభుత్వాలు దృష్టి పెట్టడం లేదు. 
దేశంలోని జీడిపప్పు ప్రోసెసింగ్‌ పరిశ్రమలకు భారత్‌లో పండిన జీడి పిక్కలకు రెట్టింపు పరిమాణంలో అవసరం అవుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు జీడి పంట సాగు విస్తీర్ణాన్ని, ఉత్పాదకతను పెంచుకోవడంపై కేంద్రీకరించి, ఆ లోగా అవసరాలకు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవచ్చు. అంటే స్వల్ప కాలిక, దీర్ఘ కాలిక ప్రణాళికతో ప్రభుత్వాలు వ్యవహరించాలి. కాని, కేంద్ర ప్రభుత్వం, చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విధమైన చర్యలు చేపట్టలేదు. ప్రోసెసింగ్‌ పరిశ్రమలు అత్యధికంగా కేరళలో వున్నాయి. 865కి పైగా పరిశ్రమల్లో దాదాపు మూడు లక్షల మంది పని చేస్తున్నారు. వీరిలో 95 శాతం మంది మహిళలు కావడం గమనార్హం. ఒకప్పుడు దేశంలో అత్యధిక సాగు విస్తీర్ణం కలిగిన రాష్ట్రం కూడా అదే. అయితే, గతంలో ఆ రాష్ట్రంలో పాలన సాగించిన ప్రభుత్వాల లోపం, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిషా ప్రభుత్వాలు తీసుకున్న కొన్ని సానుకూల చర్యల మూలంగా ప్రస్తుతం ఆరవ స్థానానికి దిగజారింది. జీడి పంట విస్తీర్ణం పెంపు, రైతుల సంక్షేమం, ప్రోసెసింగ్‌ పరిశ్రమ పరిరక్షణ, కార్మికుల ప్రయోజనాలు కాపాడడానికి ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం గత మూడేళ్లుగా బహుముఖ చర్యలు చేపడుతోంది. అదే ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే అంతా తిరోగమనంలో వుంది.

రాష్ట్రంలో పరిస్థితి …

రాష్ట్రంలో 1,15,277 హెక్టార్లలో జీడి తోటలు (పూత, కాపుతో వున్న విస్తీర్ణం) వున్నట్టు ప్రభుత్వం ప్రచురించిన గణాంక దర్శిని పేర్కొంది. ఇంకా కాపునకు రానివి, కొత్తగా నాటినవి కలిపితే కొంత ఎక్కువగా వుండొచ్చు. అయితే ఇందులో 99 శాతం శ్రీకాకుళం నుండి పశ్చిమ గోదావరి వరకుగల ఐదు జిల్లాలలోనే కావడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఉద్యానవన రైతుల సర్వే ప్రకారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలలో 1,53,167 మంది ఆ తోటల యజమానులున్నారు. అంటే సగటున ఒక్క హెక్టారు కూడా లేని సన్న, చిన్నకారు రైతులే వీరంతా. ఐటిడిఎ, ఎస్‌సి కార్పొరేషన్‌ ద్వారా కొన్ని సబ్సిడీ పథకాల్లో అసైన్డ్‌ భూములు, డీఫారెస్టు భూముల్లో 1995-2005 మధ్య జీడి మామిడి సాగును ప్రోత్సహించారు. ఇక, సొంత భూమి లేదా అసైన్డ్‌ భూమి సాగుదార్లు కాకుండా అటవీ శాఖ పరిధిలోని జీడి తోటలను వేలం పాడి, ఆ రుసుము చెల్లించి ఫలసాయాన్ని పొందే పేదలు వేల సంఖ్యలో వుంటారు. కాబట్టి జీడి పంటపై ఆధారపడేది  అత్యధికులు గిరిజనులు, భౌగోళికంగా చూస్తే జీడి తోటలు సముద్ర తీర ప్రాంతాల్లోనూ, కొండల పైన, వాటిని ఆనుకొనివున్న ప్రాంతాల్లోనే అధికంగా వుంటాయి. ప్రకృతి రీత్యా కూడా జీడి దుర్బలమైనదే. ఎప్పుడు గాలివాన, తుపాను వచ్చినా దెబ్బ తగిలేదీ ఈ పంటకే. ఇటీవలి తిత్లీ తుపాను మూలంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో జీడి రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలిందన్న విషయం విదితమే.

ప్రోసెసింగ్‌ పరిశ్రమల విషయాని కొస్తే శ్రీకాకుళం జిల్లా పలాస, విశాఖ జిల్లా నర్సీపట్నం, ప్రకాశం జిల్లా వేటపాలెం కేంద్రాలుగా వందల సంఖ్యలో విస్తరించి వున్నాయి. వేలాది మంది పని చేస్తున్నా వారికి శాశ్వత కార్మికులుగా గుర్తింపే లేదు. పిఎఫ్‌, ఇఎస్‌ఐ తదితర సౌకర్యాలు లేవు. 99 శాతం మందినీ పీస్‌ రేట్‌ పనివారి గానూ, సీజనల్‌ కార్మికులగానూ యాజమాన్యాలు చెబుతుంటాయి. వారికి ఎలాంటి చట్టపరమైన రక్షణలూ లేవు. సంఘాల అధ్వర్యాన కార్మికులు ఉద్యమిస్తున్నా ప్రభుత్వ స్పందన అంతంత మాత్రంగానే వుంటోంది. ఉత్తరాంధ్రలో పండిన జీడి పిక్కలు పూర్తిగా ఇక్కడి పరిశ్రమల్లోనే ప్రోసెస్‌ కాగా 20-25 శాతం పంట కేరళ వ్యాపారులు కొనేవారు. పలాస ప్రోసెసింగ్‌ పరిశ్రమల యజమానులు తాము కొనుగోలు చేసిన జీడి పిక్కలను కేరళ వ్యాపారులకు అమ్మేస్తుంటే తమ ఉపాధి పోతుందని కార్మికులు ఆందోళన చేయడం, కొన్ని సందర్భాల్లో అందుకు నష్ట పరిహారాన్ని కూడా పొందిన ఉదాహరణలున్నాయి. అలాంటిదీ వ్యాపారులు ఇప్పుడు ఆఫ్రికా నుండి జీడి పిక్కలు దిగుమతి చేసుకుంటాం అని ఇక్కడి రైతులను బెదిరిస్తున్నారు. ధర దిగ్గొయ్యడానికి వ్యాపారులు చేస్తున్న మాయ ఇది. స్థానిక రైతుల నుండి కొనుగోలు చేయాలని, అవి చాలకపోతే దిగుమతులని షరతు విధించాల్సిన ప్రభుత్వం మౌనంగా వుండడం ద్వారా వ్యాపారుల కొమ్ము కాస్తోంది. ఇదే నయా ఉదారవాద విధానాలు, డబ్ల్యుటిఒ ఒప్పందాల వల్ల వచ్చిన చిక్కులు.

 కేరళ ప్రభుత్వ చర్యలు 

కేరళలో సిపిఎం నాయకత్వాన గల ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం అటు రైతాంగాన్ని, ఇటు కార్మికులను ఆదుకొనేందుకు వివిధ చర్యలు చేపట్టింది. ఆ రాష్ట్రంలో 60-70 శాతం చెట్లు వయసు మీరినవిగా గుర్తించి, వాటి స్థానంలో కొత్త చెట్లు, తోటలు పెంచడానికి విస్తృత చర్యలు చేపట్టింది. అంట్లు, ఎరువు, ఇతర ఇన్‌పుట్స్‌ను అర్హులకు ఉచితంగా అందిస్తోంది. బ్యాంకుల నుండి వడ్డీ రాయితీతో ఉదారంగా రుణాలు ఇప్పిస్తోంది. ఆధునిక రీతిలో క్లోనింగ్‌ ప్రక్రియ చేపట్టేందుకు నర్సరీలు ఏర్పాటు చేసింది. ప్రస్తుతం హెక్టారుకు 860 కిలోలుగా వున్న దిగుబడిని రెండు వేల కిలోలకు పెంచేందుకు అవసరమైన ప్రణాళికలను అమలు చేస్తోంది. రెండు దశాబ్దాలపాటు రాష్ట్రంలో ఎండోసల్ఫాన్‌ ఇబ్బందుల నేపథ్యంలో సేంద్రియ విధానంలో పండించడంపై పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టింది. పంట దిగుబడి పెంచడంతోపాటు కొనుగోలుకూ చర్యలు చేపట్టింది. మార్కెట్‌లో ధర తగ్గిన సందర్భాల్లో కాషఉ్య కార్పొరేషన్‌ ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనుగోలు చేయిస్తోంది. (ఆంధ్రప్రదేశ్‌లో ఏనాడూ ప్రభుత్వం కొన్నది లేదు.) 

జీడిపప్పు ప్రోసెసింగ్‌ కార్మికులకు కనీస వేతనం, చట్టబద్ధమైన సౌకర్యాలను అమలు చేసింది. మూతపడిన పరిశ్రమలను తెరిపించింది. ముడి సరుకు (జీడి పిక్కలు) కొరత వున్నవాటికి కార్పొరేషన్‌ నుండి కేటాయించింది. పొరుగు రాష్ట్రాల నుండి జీడి పిక్కల కొనుగోలుకు, మూడేళ్లు, ఐదేళ్ల ఒప్పందాలకు ప్రయత్నించింది. అలాంటి వాటిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌ అటవీశాఖ పరిధి లోని భూములను, సముద్ర తీర ప్రాంతంలోని ప్రభుత్వ భూములను జీడి సాగుకు దీర్ఘ కాలిక లీజుకు ఇవ్వాలని కోరింది. ఇక్కడి రైతుల నుండి కేరళ కార్పొరేషన్‌ జీడి పిక్కలు కొనుగోలు చేసేందుకు అవసరమైన చట్టపర సహాయాన్నివ్వాలని కోరింది. కాని టిడిపి ప్రభుత్వం వాటికి అంగీకరించలేదు సరికదా ప్రైవెటు కార్పొరేట్‌ సంస్థయైన ఓలం కంపెనీతో వెలుగు ద్వారా కొనుగోలుకు ఒప్పందం చేయించింది. అయితే, ఆ ఓలం కంపెనీ వారు మాత్రం మన రైతుల నుండి ఎక్కడా కొన్నది లేదు. కమ్యూనిస్టుల నాయకత్వం లోని ప్రభుత్వానికి, దోపిడీదార్ల ప్రభుత్వానికీ గల తేడా ఇదే మరి! 

…. రామన్నదొర., సంపాదకులు.

Related posts

Leave a Comment