సర్కారు చేతికి జనం నాడి!

న్యూస్ ఇండియా 24/7  నేషనల్ న్యూస్ నెట్వర్క్

వైద్యఆరోగ్యశాఖ ఇంటింటి సర్వే 
– 30 ఏండ్లు దాటిన వారికి ఆరోగ్య పరీక్షలు 
11 రకాల వ్యాధులపై సమాచార సేకరణ 
– డాటా ఆధారంగా ఉచిత వైద్య పరీక్షలు
– వివరాలు వెబ్‌సైట్‌లో నమోదు 
– హెల్త్‌ ప్రొఫైల్‌ పోర్టల్‌లో 43 అంశాలు
న్యూస్ ఇండియా 24/7  నేషనల్ న్యూస్ నెట్వర్క్ – హైదరాబాద్‌
ప్రజల ఆరోగ్య సమగ్ర సమాచార సేకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ఆధ్వర్యంలో ప్రభుత్వం నాన్‌ కమ్యూనికేబుల్‌ డిసీజెస్‌ (ఎన్‌సీ డీ) కార్యక్రమాన్ని గత నెల 20న ప్రారంభించింది. ఎన్‌సీడీ ఆధారంగా ప్రజల ఆరోగ్య వివరాలు ప్రభుత్వం నిక్షిప్తం చేయ నుంది. సర్వేలో ప్రజల ఆరోగ్య స్థితిగతులు ఎలా ఉన్నాయి.. ఎక్కువగా ఏయే జబ్బులతో బాధపడుతున్నారు.. దీర్ఘకాలిక, ప్రాణాంతక జబ్బులు ఏమైనా ఉన్నాయా? దంపతులు కుటుం బ నియంత్రణ పద్ధతులు పాటిస్తున్నారా.. పాటిస్తే తాత్కాలిక పద్దతులా.. శాశ్వత పద్దతులా? ఎలాంటి ఆహారం తీసుకుం టున్నారు.? పోషకాహారం ఏ మోతాదులో ఉంది. వ్యక్తుల బరువు, ఎత్తు, జనన మరణాలు, మరుగుదొడ్డి, కులం, మతం, వార్షిక ఆదాయం, ఆధార్‌, రేషన్‌ కార్డుతోపాటు ఆర్థిక, సామాజిక తదితర మొత్తం 43 అంశాలను సేకరించి ప్రత్యేకంగా రూపొందించిన హెల్త్‌ ప్రొఫైల్‌ పోర్టల్‌ (ట్యాబ్‌)లో పొందుపరుస్తున్నారు. ఈ పోర్టల్‌ను సమగ్ర కుటుంబ సర్వేకు అనుసంధాం చేశారు. ఈ విధంగా ప్రభుత్వం ప్రజల ఆరోగ్య వివరాలను
తెలుసుకుంటుందని అధికారులు చెబుతున్నారు. ఎన్‌సీడీ కార్యక్రమంలో 30 ఏండ్లు పైబడిన వారికి మాత్రమే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మన దేశంలో ఈ వయస్సు నుంచే వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్‌సీడీ సర్వేలో ఆ వయస్సుపైబడిన వారిని ఎంచుకున్నారు. సర్వేలో భాగంగా ఏఎన్‌ఎం, ఆశావర్కర్లు గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు బీపీతో 2.66 లక్షలు, షుగర్‌తో 1.99 లక్షలు, నోటి క్యాన్సర్‌తో 7,297, రొమ్ము క్యాన్సర్‌తో 2,274, గర్భాశయ క్యాన్సర్‌తో 2,037 మంది బాధపడుతున్నట్టు గుర్తించారు. కాగా, టీచింగ్‌ ఆస్పత్రులు, జిల్లా, ఏరియా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్‌సెంటర్లు ప్రజలకు అందుబాటులో ఉన్నా పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందడం లేదు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారోగ్యానికి భరోసా లేదు. విధిలేని పరిస్థితుల్లో ప్రయివేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. చిన్న చిన్న జబ్బులకు సైతం వైద్యం కోసం ప్రయివేటుకు పరుగు తీస్తున్నారు. ఇది పేద, మధ్య తరగతి వారికి మోయలేని భారంగా మారింది. ఈ క్రమంలో ఏదైనా పెద్ద ఆరోగ్య సమస్య తలెత్తి, ఆపరేషన్లు చేయాల్సి వస్తే అప్పులు చేయక తప్పడంలేదు. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు ఎన్‌హెచ్‌ఎం ఆధ్వర్యంలో ప్రభుత్వం ఆరోగ్య సర్వే చేపట్టింది.
11 రకాల వ్యాధులు గుర్తింపు
ఎన్‌సీడీ కింద ప్రధానంగా 11 రకాల వ్యాధులను అధికారులు గుర్తిస్తున్నారు. సర్వే పూర్తయిన తరువాత అవసరమైన వారికి వైద్య చికిత్సలు, మందులు ఉచితంగా అందించనున్నారు. గుండె వ్యాధులు, ప్రాణాంతకమైన అన్నిరకాల క్యాన్సర్‌ వ్యాధులను సైతం ఇందులో చేర్చారు. మారిన ఆహారపు అలవాట్లు, జీవన విధానంతో వస్తున్న క్యాన్సర్‌ వ్యాధిని సకాలంలో గుర్తించలేక చాలా మంది చనిపోతున్నారు. ఇలాంటి వాటిని సర్వే ద్వారా గుర్తించే అవకాశముంది. దీర్ఘకాలిక వ్యాధులైన గుండె, బీపీ, షుగర్‌, కళ్లు, క్షయ, కుష్టు, పక్షపాతం, ఊపిరితిత్తులు, కిడ్నీ తదితర వ్యాధులతోపాటు గతంలో స్వైన్‌ఫ్లూ, మలేరియా, డెంగీ వంటి వ్యాధులు ఏమైనా వచ్చాయా అని సర్వే ద్వారా తెలుసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఒక సర్వే ప్రకారం దేశంలో ప్రతి 1000 మందిలో 100 మంది బీపీ, షుగర్‌ వ్యాధితో బాధపడుతున్నారు. 30 ఏండ్లు దాటిన వారిలో ఇలాంటి వాటిని సర్వే ద్వారా గుర్తిస్తారు. వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించి ఉచితంగా మందులు అందజేస్తే మరణాలు తగ్గే అవకాశం ఉన్నదని, అందుకే ప్రభుత్వం ఎన్‌సీడీ కార్యక్రమాన్ని చేపట్టిందని అధికారులు తెలిపారు.

Related posts

Leave a Comment