ఏపీలో పెద్ద నియోజకవర్గంలో గెలుపు ఎవరిది….

న్యూస్ ఇండియా24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్...రాష్ట్రంలో అన్నీ నియోజకవర్గాల్లో ఎన్నికల పోరు ఒక ఎత్తు అయితే తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో మరో ఎత్తు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో మొన్నటివరకు తెలంగాణలో ఉన్న ఓటర్లు కలవడమే. పోలవరం ముంపు మండలాల్లోని మెజారిటీ మండలాలు ఈ నియోజకవర్గంలోనే కలిశాయి. దీంతో ఈ సారి పోరు ఆసక్తికరంగా జరగనుంది. 2014లో వైకాపా తరుపున గెలిచి తెదేపాలో చేరిన వంతల రాజేశ్వరి మరోసారి పోటీకి దిగారు. తెదేపా అభ్యర్ధిగా ఎన్నికలో ప్రచారంలో దూసుకెళుతున్నారు. ఇక తెదేపాలో చేరిన దగ్గర నుంచి ఆమె నియోజకవర్గంలో అభివృద్ధి పనులు బాగానే చేశారు. అలాగే సంక్షేమ పథకాలు కూడా ప్రజలకి చేరువయ్యేలా చేశారు. ఇవే రాజేశ్వరికి ప్లస్ కానున్నాయి.

కానీ విలీన మండలాలో సీపీఎంకి మంచి పట్టుంది. పైగా సున్నం రాజయ్య 2014లో ఖమ్మం జిల్లా భద్రాచలం నుంచి సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఎన్నికల తర్వాత పోలవరం ప్రాజెక్టు కోసం భద్రాచలం నియోజకవర్గంలోని ఏడు మండలాలను ఏపీలో కలిపారు. దీంతో రాజయ్య స్వగ్రామమైన వీఆర్ పురం మండలంలోని సున్నంవారిగూడెం రంపచోడవరం నియోజకవర్గంలో కలిసింది. ప్రస్తుతం జనసేన పార్టీతో పొత్తులో భాగంగా రంపచోడవరం స్థానం సీపీఎంకు దక్కింది. దీంతో ఆ పార్టీ తరపున సున్నం రాజయ్య బరిలో దిగుతున్నారు. రాజయ్యకి విలీన మండలాల్లో మంచి పేరుంది. అతి సామాన్యుడుగా ఉన్న రాజయ్య అంటే వీరికి అభిమానం ఎక్కువ. అయితే ఈ విలీన మండలాల్లో ఏకపక్షంగా పూర్తి మెజారిటీగల పట్టు సాధిస్తే జనసేన సాయంతో ఏడు మండలాల్లో విజయానికి సరిపడ ఓట్లు దక్కుతాయని రాజయ్య భావిస్తున్నారు.

ఇక రాజేశ్వరి తమ పార్టీలో గెలిచి టీడీపీలోకి వెళ్లిపోవడంతో జరిగిన నష్టాన్ని జగన్ ముందుగానే గ్రహించారు. ఆమెకు ధీటుగా మరో అభ్యర్థిని ప్రకటించారు. నాగులపల్లి ధనలక్ష్మికి టికెట్ కేటాయిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి ధనలక్ష్మి నియోజకవర్గంలో తిరుగుతూ మంచి పట్టు సాధించింది. కానీ ఆమె రాజకీయాలకి కొత్త కావడం మైనస్. ఆపైగా తెదేపా, సీపీఎం అభ్యర్ధులు స్ట్రాంగ్‌గా ఉన్నారు. రంపచోడవరం నియోజకవర్గ పునర్విభజనతో మొత్తంగా 11 మండలాలస్థాయిలో తమ బలాబలాలను అంచనా వేసుకోవడం ఆయా పార్టీలకు కత్తిమీద సామే అవుతోంది. ఏడు మండలాల విషయానికి వస్తే ఉండే ధీమా 11 మండలాల విషయంలో ఎవరికీ లేదు.

ఈ నియోజకవర్గంలో జనాభాపరంగా చూస్తే కొండరెడ్డి గిరిజనులే అధికం. ఇక 1983 నుంచీ తెలుగుదేశానికి ఈ నియోజకవర్గంలో గిరిజనేతర్లు అండగా నిలవడమే 2004 ఎన్నికల వరకూ వరుస విజయాలను టీడీపీ కి  తెచ్చిపెట్టింది. కానీ 2009, 14 ఎన్నికల్లో కాంగ్రెస్, వైసీపీ విజయం సాధించాయి. అయితే ఈ సారి పరిస్తితి భిన్నంగా ఉంది. విజయావకాశాలని ఎవరు అంచనా వేయలేకపోతున్నారు. కొంతవరకు ఇక్కడ సీపీఎం రాజయ్య వైపే జనం ఉన్నట్లుగా తెలుస్తోంది. సామాన్యుడుగా ఉండటం..ప్రజల కోసం పోరాడటమే ఆయన్ని విజయం వైపు నడుస్తున్నాయి. కానీ తెదేపా, వైకాపా అభ్యర్ధులు స్ట్రాంగ్‌గా ఉండటం…వారికి బలమైన కేడర్ ఉండటం వలన రాజయ్య విజయం సులువు కాదు. మరి చూడాలి ఆంధ్రా, తెలంగాణ ప్రజలు కలిసున్న ఈ నియోజకవర్గంలో ఈ సారి ఎవరు గెలుస్తారో…

Related posts

Leave a Comment