రాజయ్యా.. నీకే మా ఓట్లు…అయ్యా..!!

న్యూస్ ఇండియా24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్

ఇప్పుడున్న నాయకులతో మా గిరిజన పల్లెలకు ఒరిగిందేమీ లేదు

 – విస్తృతంగా సిపిఎం అభ్యర్థుల ప్రచారం 

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన, సిపిఐ, బిఎస్‌పి మద్దతుతో పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థులు ఆదివారం ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం సిపిఎం అభ్యర్థి సున్నం రాజయ్య మన్యంలోని  రాజవొమ్మంగి, గంగవరం మండలాల్లోని గిరిజన పల్లెల్లో ప్రచారం నిర్వహించారు. రాజవొమ్మంగి మండంలోని కొండపల్లి, మర్రిపాలెం, సూరంపాలెం, రాజవొమ్మంగి గ్రామాల్లో పర్యటించిన రాజయ్యను గిరిజనులు, గిరిజనేతరులు ఆప్యాయతగా పలకరిస్తూ కరచాలనం చేశారు. ముఖ్యంగా కొండపల్లి, మర్రిపాలెం గ్రామాల్లో రాజయ్య పర్యటించినప్పుడు గ్రామస్తులు ‘రాజయ్యా… మా ఓట్లు మీకే. ఇన్నాళ్లూ పాలించిన ఎమ్మెల్యేలు ఎవరికో ఒకరికి కొమ్ముకాస్తున్నారు. మా గిరిజన పల్లెలకు ఒరిగిందేమీలేదు. అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయి. వీరి పాలనతో విసుగెత్తిపోయాం. ఈసారి మేమంతా మీకు అండగా ఉంటాం’ అని గిరిజనులు ఆయనకు హామీ ఇచ్చారు. రాజవొమ్మంగిలో జనసేన యువత రాజయ్యతో టీస్టాల్‌ వద్ద టీ తాగుతూ ముచ్చటించారు. ఎటపాక మండలం వినాయకపురం గ్రామస్తులు రాజయ్యకే ఓటు వేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. రంపచోడవరం ఐటిడిఎ పరిధిలోని మారేడుమిల్లి మండలంలో అనేక గ్రామాలకు రహదారులు లేకపోడంతో మోటారు సైకిల్‌పై రాజయ్య లోతట్టు గ్రామాలకు వెళ్లి గిరిజనుల సమస్యలను తెలుసుకుంటున్నారు. కుండాడ పంచాయతీ కనుమూరు, తూరుమామిడి గ్రామాల్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు మంతెన సీతారాం, జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌తో కలిసి పర్యటించారు. 
అరకులో సురేంద్ర విసృత ప్రచారం 
విశాఖ జిల్లా అరకు మండలంలోని సుంకరమెట్ట వారపుసంతలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, అరకు ఎమ్మెల్యే అభ్యర్థి కిల్లో సురేంద్ర ప్రచారం నిర్వహించారు. అరకు ఎమ్మెల్యే అభ్యర్థి సురేంద్ర, జనసేన ఎంపీ అభ్యర్థి వంపూరి గంగులయ్యలను గెలిపించాలని సంతకు వచ్చిన వ్యాపారులు, గిరిజనులను అభ్యర్థించారు. ముంచంగిపుట్టు మండల కేంద్రంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.సూర్యారావు, మండల కార్యదర్శి కె.త్రినాధ్‌, పార్టీ నాయకులు ఎంఎం.శ్రీను, రాజు, భీమరాజు ఆధ్వర్యంలో ప్రచారం చేశారు. అనంతగిరి మండలంలోని వారపు సంతలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు డి.వెంకన్న, మామిడి దేముడు, సిహెచ్‌ రాజు, సిహెచ్‌ ఈశ్వరరావు, బి.అప్పలరాజు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం సాగింది. 

Related posts

Leave a Comment