నీరవ్‌ అరెస్ట్‌ను స్వాగతిస్తున్నాం: భారత్‌

న్యూస్ ఇండియా24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్….నీరవ్‌ మోడీ అరెస్ట్‌ను భారత్‌ స్వాగతించింది. నీరవ్‌ అప్పగింత విషయంలో భారత్‌ బ్రిటన్‌తో నిరంతరం చర్చలు జరుపుతూనే ఉందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్‌కుమార్‌ తెలిపారు. ఆయన్ను వీలైనంత త్వరగా భారత్‌కు తీసుకొచ్చేందుకు బ్రిటన్‌ అధికారులతో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. లండన్‌లోని మెట్రో బ్యాంకులో ఖాతా తెరిచేందుకు మంగళవారం వచ్చిన మోడీని గుర్తించిన క్లర్క్‌ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న అధికారులు మోడీని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నగరంలోని వెస్ట్‌మినిస్టర్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో బుధవారం మోడీని హాజరుపరచగా, కోర్టు ఆయనకు మార్చి 29 వరకూ కస్టడీ విధించింది. నీరవ్‌ మోడీకి బెయిల్‌ నిరాకరించిన న్యాయమూర్తి మేరీ మల్లాన్‌.. ఒకవేళ బెయిల్‌ ఇస్తే ఆయన కోర్టు ముందు హాజరుకాబోరని చెప్పేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.

స్కాట్‌లాండ్‌ యార్డ్‌ పోలీసులు అరెస్ట్‌చేసిన నీరవ్‌ మోడీని వాండ్స్‌వర్త్‌లోని ‘హర్‌ మెజెస్టీ జైలు’కు తరలించే అవకాశముందని అధికారిక వర్గాలు తెలిపాయి. అక్కడే జైలులో ప్రత్యేక గదిని మోదీకి కేటాయించే అవకాశముందని లేదంటే మిగతా ఖైదీలతో గదిని పంచుకోవాల్సి రావొచ్చని వెల్లడించాయి. లండన్‌ శివార్లలో ఉన్న ఈ జైలు పశ్చిమ యూరప్‌లోనే అతిపెద్దది. ఈ జైలును ‘బీ’ కేటగిరిలో చేర్చారు. అంటే హైలెవల్‌ సెక్యూరిటీ రిస్క్‌ లేని వ్యక్తులను ఇక్కడ ఉంచుతారు. 1851లో ఏర్పాటైన ఈ జైలు ఖైదీలతో కిటకిటలాడుతోందనీ, ప్రస్తుతం ఇక్కడ 1,628 మంది ఖైదీలు ఉన్నారని అధికారులు తెలిపారు. వీరిలో చాలామంది డ్రగ్స్‌ స్మగ్లర్లు, వ్యసనపరులు, మానసిక సమస్యలతో బాధపడుతున్నవారు ఉన్నారని వెల్లడించారు.

Related posts

Leave a Comment