ఉపముఖ్యమంత్రి…ఇంటికి నిప్పు..!!

న్యూస్ ఇండియా24/7 పొలిటికల్ న్యూస్ నెట్వర్క్…..

– అరుణాచల్‌ప్రదేశ్‌లో ఉద్రిక్తత 
– ‘శాశ్వత నివాస ధ్రువపత్రాల’కు వ్యతిరేకంగా నిరసనలు 
ఇటానగర్‌ : ఈశాన్య రాష్ట్రం అరుణాచల్‌ప్రదేశ్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఆరు షెడ్యూల్డ్‌ తెగలకు అడ్డదారిన ‘శాశ్వత నివాస ధ్రువ పత్రాల’ను అందజేయాలన్న బీజేపీ-పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ అరుణాచల్‌ (పీపీఏ) సర్కారు ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిరసనకారుల ఆగ్రహావేశాలతో రాష్ట్ర రాజధాని అట్టుడుకుతోంది. ఈ క్రమంలోనే నిరసనకారులు ఆదివారం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి చౌనా మెయిన్‌ ఇంటిని దహనం చేశారు. జిల్లా కమిషనర్‌ ఇంటికీ మంట పెట్టారు. ఈ ఘటనలో ఎస్పీ స్థాయి పోలీసు అధికారులిద్దరికీ గాయాలయ్యాయి. డిప్యూటీ సీఎం ఇంటిని ధ్వంసం చేసిన నిరసనకారులు.. అక్కడున్న వాహనాలకూ నిప్పంటించడంతో అమాంతం మంటలు ఎగిసిపడ్డాయి.
నమ్సారు, చంగ్లాంగ్‌ జిల్లాలోని ఆరు షెడ్యూల్డ్‌ తెగలకు శాశ్వత నివాస ధ్రువపత్రాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రతిపాదించింది. బీజేపీ-పీపీఏ సర్కారు నిర్ణయాన్ని నిరసిస్తూ పలు గిరిజన తెగలు ఆందోళనలకు దిగాయి. ప్రభుత్వం చెబుతున్న విధంగా.. నివాస ధ్రువ పత్రాలు అందుకునే గిరిజన తెగలు రాష్ట్రానికి చెందినవారు కాదని, కానీ దశాబ్దాలుగా ఇక్కడే జీవిస్తున్నారనే కారణంగా వారికి ధ్రువీకరణ పత్రాలు అందజేయడం పట్ల నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దీంతో తాము తీవ్రంగా నష్టపోతామని ఇక్కడి గిరిజన, విద్యార్థి సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలోనే ఈ నెల 22న జరిగిన పోలీసు కాల్పులలో ఓ వ్యక్తి మరణించాడు. దీంతో, నిరసనకారులు ఆందోళనలను తీవ్రతరం చేశారు. తర్వాతి రోజు కూడా పోలీసుల బుల్లెట్లకు గాయపడి మరోవ్యక్తి చనిపోవడంతో ఇవి మరింత ఉధృతయ్యాయి. నిరసనకారుల రాళ్లదాడులలో పలు వాహనాలు, ఐదు థియేటర్లు పాక్షికంగా ధ్వంసమవగా.. దాదాపు 35 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఆదివారం నాటి ఘటనతో రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటానికి పది కంపెనీల ఆర్మీ బలగాలను ప్రభుత్వం మొహరించగా ఇటానగర్‌లో కవాతు నిర్వహించి కర్ఫ్యూ విధించారు. ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రంలో ఇంటర్నెట్‌ సేవలను ప్రభుత్వం నిలిపివేసింది.

Related posts

Leave a Comment