ఇరిడియం,రైస్‌ పుల్లింగ్‌ ఆశచూపి..”కోట్లు” దోచేశారు

న్యూస్ ఇండియా24/7 క్రైమ్ న్యూస్ నెట్వర్క్….  ఆధ్యాత్మిక శక్తులు, నాగ బంధం కలిగిన వస్తువు ,ఇరిడియం,రైస్‌ పుల్లింగ్‌ … అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.1000 కోట్ల విలువ ఉంటుంది… దీన్ని మీరు తీసుకుంటే దైవ శక్తులు రావడంతోపాటు వేల కోట్లు సంపాదిస్తారు… ఇలా భాస్కర్‌రెడ్డి అనే వ్యక్తిని నమ్మించి రూ.41.85 లక్షలు టోకరా వేశారు. బాధితుడి ఫిర్యాదుతో ఏడుగురు సభ్యుల ముఠాను రాచకొండ భువనగిరి ఎస్‌ఓటీ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. మరో నిందితు డు పరారీలో ఉన్నాడు. ఎల్బీనగర్‌లోని సీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ నిందితుల వివరాలు వెల్లడించారు. యాదాద్రి సమీపంలోని కూనూరుకు చెందిన మదను మోక్ష రాజు(37) అనేక పేర్లతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నాడు. అంతర్జాతీయ మార్కెట్లో రూ.వేల కోట్లు విలువచేసే రైస్‌ పుల్లింగ్‌ పరికరాన్ని రూ.లక్షల్లోనే అమ్ముతానంటూ తాడేపల్లి గూడేనికి చెందిన భాస్కర్‌రావు అనే వ్యాపారిని బుట్టలో వేసుకున్నారు. మోక్ష రాజు ముఠాలోని సభ్యుడైన విజయవాడకు చెందిన జీనేపల్లి ఆదిశేషు(31)కు భాస్కర్‌రావుతో పరిచయం ఉంది. తాను గ్లోబల్‌ స్పేస్‌ మెటల్స్‌ సంస్థలో కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నట్లు ఆదిశేషు అతడ్ని నమ్మించాడు. అరుదుగా దొరికే రైస్‌ పుల్లింగ్‌ పరికరానికి ఆధ్యాత్మిక శక్తులతోపాటు అందులోని ఇరీడియం పదార్థంతో నాసా సంస్థ అంతరిక్ష ఉపగ్రహాల్లో శక్తి ఉత్పన్నం చేసేందుకు ఉపయోగిస్తారంటూ నమ్మబలికాడు. సదరు రైస్‌పుల్లింగ్‌ పరికరం ఒకటి బెంగళూరుకు చెందిన పూర్ణచందర్‌రెడ్డి అనే వ్యక్తి వద్ద ఉందనీ..

ఆ పరికరాన్ని నాసా సంస్థకు ఇరిడియం ధాతువును సరఫరా చేసే తమ గ్లోబల్‌ స్పేస్‌ మెటల్‌ సంస్థ కొంటోందనీ నమ్మకంగా చెప్పాడు. కొనేముందు ఆ సంస్థకు చెందిన అకౌంటులో రూ.లక్షల్లో పెట్టుబడి పెడితేనే కొంటారనీ.. కానీ.. పూర్ణచందర్‌రెడ్డి వద్ద డబ్బు లేదనీ, ఆ మొత్తాన్ని భాస్కర్‌రావు సమకూర్చితే కొన్నాక వచ్చే రూ.వేల కోట్లలో రూ.వంద కోట్లు భాస్కర్‌రావుకు ఇస్తారంటూ ఆశజూపాడు.

దీంతో భువనగిరిలోని ఓ హోటల్‌లో ఏర్పాటైన మీటింగ్‌లో డీల్‌ కుదిరింది. గ్లోబల్‌ స్పేస్‌ మెటల్‌ సంస్థ సీఈవోగా జాన్‌ మిల్టన్‌ పేరుతో మోక్షరాజు నటించాడు. రైస్‌పుల్లింగ్‌ యంత్రాన్ని నిర్ధారించే వ్యక్తిగా ముంబయికి చెందిన గోపాల అనంత కృష్ణన్‌ వ్యవహరించాడు. ఈ మేరకు జనవరి 19న అడ్వాన్సుగా రూ.41,85,000/- నగదును భాస్కర్‌రావు ఆ సంస్థ అకౌంట్లలో జమచేశాడు.

సహకరిస్తున్నందుకు పూర్ణచందర్‌రెడ్డితోపాటు ఆదిశేషు అకౌంట్లలోనూ కొంత మొత్తాన్ని ఖర్చులకోసం ఇచ్చాడు. రైస్‌ పుల్లింగ్‌ పరికరం ఎలా ఉంటుందో చూడాలనుకున్నాడు.. భాస్కర్‌రావు. దీంతో రాజు బంధువైన మదాను బాలసుందర్‌(38) ద్వారా పాములు పట్టే ఆసిఫ్‌ సల్మాన్‌, కుతాడి అమరేందర్‌(29)ల ద్వారా రెండు నాగుపాములను తెప్పించారు.ఈ నెల 2న భువనగిరి సమీపంలోని మస్త్వాలపల్లి ఫౌల్ట్రీ ఫారంలో థర్మాకోల్‌ షీట్లతో ఓ గదిలో ఏర్పాటుచేశారు. ఆ షీట్ల మధ్యలో రైస్‌పుల్లింగ్‌ పరికరం ఉందని అక్కడికి చేరుకున్న భాస్కర్‌రావుకు దూరం నుంచే చూపారు. ఆ దాతువుకు ఆధ్యాత్మిక శక్తులు ఉండటం వల్ల శుచిగా వెళ్తేనే చూడగలమంటూ కాళ్లూ చేతులు కడుక్కోమన్నారు. అతడు ఆ పనిలో ఉండగానే పాములుపట్టే ఇద్దరు వ్యక్తులు తెచ్చిన నాగుపాములను ఆ గదిలో విడిచి ఏమీ తెలియనట్లు నటించారు.

శుచిగా ఒక్కడే గదిలోకి చేరుకున్న భాస్కర్‌రావుపైకి ఆ నాగులు బుస్సు మంటూ ఉరకడంతో అతను హతాషుడై బయటికి పరుగు లంకించుకున్నాడు. ఇలా జరిగిందేమిటని వారిని అడగ్గా.. ఆ రైస్‌పుల్లింగ్‌ యంత్రానికి నాగబంధం ఉండి వుంటుందనీ.. పూజలు చేస్తేనే చూడగలమని ముఠా సభ్యులు తెలిపారు.

ఇంటికి చేరుకున్న భాస్కర్‌రావుకి వీరి వ్యవహారంపై అనుమానం కలిగి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆరుగురితోపాటు వీరికి సహకరించిన విశాఖకు పంగా రాజును అరెస్టుచేశారు. పూర్ణచందర్‌రెడ్డి పరారీలో ఉన్నాడు. నిందితుల వద్ద 7లక్షల 90వేల నగదు, 5.5తులాల బంగారం, పలు ఎలక్ట్రానిక్‌ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో చొరవచూపిన పోలీసులను సీపీ అభినందించారు.

సమావేశంలో ఎస్‌వోటీ అదనపు డీసీపీ సురేందర్‌రెడ్డి, ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్‌ రాజు, భువనగిరి సీఐ సురేందర్‌రెడ్డి, ఎస్సై లక్ష్మీనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రత్యేక కథనం త్వరలో..

ఇరిడియం, రైస్ పుల్లింగ్,  నల్లధనాన్ని… తెల్లధనంగా చేసే మోసాలు, ఎన్జీవో ట్రస్ట్ నుండి ట్రస్ట్ లకు డబ్బు బదలాయింపు మోసాల పై ప్రత్యేక కథనం త్వరలో… ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్  “రామ్” 

Related posts

Leave a Comment