పసుపు- కుంకుమ డబ్బుల్లో చేతివాటం…!!

న్యూస్ నెట్వర్క్ 24/7పొలిటికల్ న్యూస్ నెట్వర్క్…

  • ‘పసుపు-కుంకుమ’లో  వసూల్‌ రాణిలు

 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని మహిళలకు పసుపు-కుంకుమ పేరుతో నిర్వహించిన కార్యక్రమం కొందరి చర్యల వల్ల విమర్శల పాలవుతోంది. బ్యాంకు అధికారులు డబ్బులు ఇవ్వటంలో జాప్యం చేస్తున్నట్లు, కొన్నిచోట్ల బ్యాంకు ఖాతాల్లో కనీస నిల్వ లేదని దానికి కొంత జమ చేస్తున్నామని చెబుతున్నట్లు మహిళల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి.

ముఖ్యంగా మెప్మాలో రీ సోర్స్‌పర్సన్‌లు మహిళలకు వచ్చే రూ.2,500 కొంత తమకు ఇవ్వాలని వసూలు చేస్తున్నట్లు మార్కాపురంలో వినిపిస్తున్నది. పట్టణంలో మొత్తం 1194 గ్రూపుల సభ్యులకు పసుపు,కుంకుమ పథకం కింద చెక్కులు మంజూరయ్యాయి. వారిలో 1,148 మందికి చెక్కులు పంపిణీ చేశారు. వారు బ్యాంకుల వద్దకు వెళ్లగానే చెక్కులు మార్చుకునే సమయంలో ఉచితంగా వచ్చిన డబ్బులే కదా? మేము తీర్మానాలు రాయటం దగ్గర నుంచి మీకు అన్ని విధాల రికార్డుల నిర్వహణకు సహకరిస్తున్నామని ప్రతి సభ్యురాలు 10శాతం అంటే తొలివిడత రూ.250 ఇవ్వాలని వసూలు చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. ఒక్కొక్క గ్రూపు మార్చుకునే రూ.25వేలల్లో రూ.2500 వారికి చెల్లించాల్సిందేనట. వారిని వారించలేక రూ. 250 కదా అని ఒక్కొక్క మహిళ సరిపెట్టుకుని ఇస్తున్నట్లు చెబుతున్నారు.

ఎవరికి వారే ఇస్తున్న సొమ్ము రీసోర్స్‌ పర్సన్‌లకు మాత్రం రూ.లక్షలను కూడబెడుతుంది. ఈ చొప్పున పట్టణంలోని మొత్తం గ్రూపుల నుంచి రూ. 28.70 లక్షలు ముట్టనున్నాయి. మరోవైపు బ్యాంకుల వద్ద కూడా మహిళలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకుల్లో నగదు లేదని, చెక్కులు ఇచ్చి పది రోజుల తరువాత వచ్చి నగదు తీసుకోవాలని పంపుతున్నట్లు చెబుతున్నారు. పుల్లలచెరువు ఎస్‌బీఐ శాఖలో ఇదే పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. కొన్నిచోట్ల బ్యాంకు అధికారులు మహిళల ఖాతాల్లో కనీస నిల్వ లేదని, ఒక్కొక్కరు కనీసం మీ ఖాతాల్లో రూ. 500 అయినా ఉంచాలని సూచిస్తు వచ్చిన రూ.25వేలల్లో రూ.5వేలును బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇలా ఎక్కడిక్కడ కొర్రీల కారణంగా మహిళలు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

ఫిర్యాదు వస్తే చర్యలు

మార్కాపురంలో మొత్తం 48 మంది రీసోర్స్‌పర్సన్‌లు ఉన్నారు. పసుపు,కుంకుమ చెక్కుల విషయంలో ఎవరి వద్దడబ్బులు తీసుకుంటున్నట్లు ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు. ఇటువంటి అక్రమాలు తెలిస్తే సదరు రీసోర్స్‌పర్సన్‌లపై తప్పకుండా చర్యలు తీసుకుం టాం. మహిళలు ఎవరికి కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు.

ప్రసాదు, మెప్మా మేనేజర్‌

Related posts

Leave a Comment