డ్వాక్రా సొమ్ము వెలుగుసిబ్బంది స్వాహా..?

   న్యూస్ ఇండియా24/7 క్రైమ్ న్యూస్ నెట్వర్క్…. స్వయం సహాయక సంఘాలు పొదుపు చేసిన సొమ్మును వెలుగుసిబ్బంది స్వాహా చేశారంటూ బాధితులు మంగళవారం పెద్దఎత్తున రోడ్లపై బైఠాయించడం ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే సీతానగరం మండలంలోని మునికూడలి పరిధిలోని వీవోఏ సునీత, సమాఖ్య అధ్యక్షురాలిగా పనిచేస్తున్న పోశిరత్నం సమృద్ధి, స్త్రీనిధులను సుమారుగా రూ.15 లక్షలు స్వాహా చేసిన సీతానగరం వెలుగు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని డ్వాక్రా సంఘాల సభ్యులు వారంరోజుల క్రితం డీఆర్‌డీఏకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా స్త్రీనిధి మేనేజర్‌ జి.ప్రసన్నలక్ష్మిని విచారణాధికారిగా నియమించారు. ఆమె ఆధ్వర్యంలో మంగళవారం సీతానగరంలోని స్త్రీశక్తి భవనంలో నిధుల స్వాహాపై విచారణ చేపట్టగా బాధిత డ్వాక్రా సంఘాల మహిళలు హాజరయ్యారు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న వీవోఏ, సమాఖ్య అధ్యక్షురాలు విచారణకు రాలేదు. దీంతో విచారణాధికారి ప్రసన్నలక్ష్మి చరవాణి ద్వారా వారిద్దరిని రప్పించే ప్రయత్నం చేసినా వారు వచ్చేందుకు నిరాకరించారు. న్యాయస్థానంలో సమస్యను పరిష్కరించుకుంటామని వారిద్దరు అంటున్నారని, దీనిపై డీఆర్‌డీఏ పీడీకి నివేదిక ఇస్తామని స్త్రీనిధి మేనేజర్‌ జి.ప్రసన్నలక్ష్మి తెలిపారు. దీంతో రాజంపేట, వెదుళ్లపల్లి, మునికూడలి నుంచి వచ్చిన డ్వాక్రా సంఘాల సభ్యులు మునికూడలి వద్దకు చేరుకుని ప్రధాన రహదారిపై శిబిరాలు వేసి రోడ్లపైనే కూర్చోని నిరసన వ్యక్తం చేశారు. మహిళలంతా పెట్రోల్‌ సీసాలు, అగ్గిపెట్టె చేత్తో పట్టుకుని ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకుంది. అదే సమయంలో సీతానగరం ఎంపీపీ చిట్టూరి శారద సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో పాటు రోడ్డుపైనే బైఠాయించారు. నిధుల స్వాహా చేసిన వారిపై ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం లేదంటూ అధికారులను నిలదీశారు. సీతానగరం వెలుగు అధికారులంతా కుమ్మక్కై నిధులను స్వాహాచేస్తున్నారని ఇందులో సీసీల ప్రమేయం ఉందని కొయ్యలమూడి సునీత, మల్లి సీత, మల్లిన నాగదేవి తదితరులు ఆరోపించారు. స్త్రీనిధి నుంచి చెరో రూ.50వేలు వంతున తమపేరుతో మంజూరుచేసి వీవోఏ, సమాఖ్య అధ్యక్షురాలు మింగేశారంటూ తిరువలనాథుని దుర్గ, బోగిల్లి ధనలక్ష్మి కన్నీటిపర్యంతమయ్యారు. అడుగుతుంటే న్యాయస్థానంలో కేసులు వేస్తామని బెదిరిస్తున్నారన్నారు.

అధికారులను అడ్డుకున్న సభ్యులు
సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ రవికుమార్‌, ఎస్‌ఐ వెంకటేశ్వరరావు ఆందోళనకారులకు నచ్చజెప్పేందుకు ఎంత ప్రయత్నించినా వారు వినలేదు. దీంతో మరోసారి సీతానగరం నుంచి వెలుగు ఏపీఎం రోజ్‌మాణిక్యం, సీసీలు ఆశాదేవి, సత్యనారాయణ ఆందోళన చేస్తున్న ప్రాంతానికి రాగానే అక్కడ నుంచి వారంతా వెళ్లిపోవాలంటూ ఆందోళన చేస్తున్న మహిళలు అడ్డుకున్నారు. నిధులు స్వాహాచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, సీతానగరం స్త్రీశక్తి కార్యాలయంలో అవినీతిని అరికట్టి, తాము కట్టిన సొమ్మును వెనక్కిఇచ్చేయాలని మహిళలంతా డిమాండ్‌ చేశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి డ్వాక్రా సంఘాలు ఆందోళనకు దిగడంతో రాజమహేంద్రవరం, సీతానగరం ప్రధానరోడ్డులో అన్నివాహనాలు కిలోమీటర్ల పొడవునా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో నిధుల స్వాహా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని బుధవారం సాయంత్రం 4 గంటలలోపు వారిని విచారణకు తీసుకెళ్తామని సీఐ రవికుమార్‌ డ్వాక్రా సంఘాలకు హామీ ఇచ్చారు. దీంతో రాత్రి 8 గంటలకు బాధితులు ఆందోళన విరమించారు.

Related posts

Leave a Comment