కేసీఆర్‌కి జగన్ ఇవ్వబోయే షాక్ ట్రీట్‌మెంట్!

న్యూస్ ఇండియా పొలిటికల్ న్యూస్ నెట్వర్క్…‘ఆంధ్రోళ్ల పార్టీతో మనకేంటి పని..? మన కష్టాల మీద బెజవాడలో పంచాయతీ పెడతారా?’ అనే ఏకవాక్య నిరసనతోనే తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో నెగ్గుకొచ్చారు కేసీఆర్. చంద్రబాబును బూచిగా చూపి.. తెలంగాణ ప్రజల్ని భయపెట్టి సంపాదించుకున్న ఓట్లే తెరాసకు మళ్ళీ పట్టం కట్టాయన్న లెక్క కూడా ఒకటుంది. మనం తెలంగాణ తెచ్చుకుంది ఇందుకేనా? మళ్ళీ ఆంధ్రా పార్టీల చేతుల్లో పెట్టడానికేనా? అంటూ ఆత్మగౌరవ నినాదాన్ని లేవనెత్తిన కేసీఆర్.. ఆ మేరకు భారీగా లబ్ది పొందారన్నది వాస్తవం. ‘మన పాలన మనమే చేసుకుందాం..’ అనే కేసీఆర్ స్లోగన్ వల్లే తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ పునాదులు కదిలిపొయ్యాయన్నది కూడా నిజం. ఈ విషయం ఇప్పుడు చంద్రబాబు బెటాలియన్‌కి కూడా పూర్తిగా బోధపడింది!

‘ఇక్కడ పరిపాలన గాలికొదిలిపెట్టి తెలంగాణ రాష్ట్రంలో పెత్తనం చేయబోయా’రంటూ మొన్నటి ఎన్నికల సందర్భంగా చంద్రబాబును తిట్టిపోసింది ఏపీలో ప్రతిపక్ష వైసీపీ. ఏదైతేనేం.. తెలంగాణాలో సొంత పార్టీ మూలాల్ని పటిష్టపర్చుకోవాలన్న ఉద్దేశంతో చంద్రబాబు చేసిన ప్రయత్నం వికటించింది. కానీ.. ఆ ప్రయత్నాన్ని తప్పుపట్టిన వైసీపీ.. రేపటిరోజున అదే దుస్సాహసం చేయబోతోందన్నది బ్రేకింగ్ న్యూస్. ఒక మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో జగన్ ఈ అంశంపై పూర్తి స్పష్టతనిచ్చేశారు. ‘తెలంగాణాలో మీ పార్టీ పని అయిపోయినట్లేనా?’ అన్న ప్రశ్నకు జగన్ ఏమాత్రం తడుముకోకుండా చెప్పిన సమాధానం ఆసక్తికరంగా వుంది.

“2018, 19 ఎన్నికల్లో తెలంగాణలో మా ఉనికి లేకపోవచ్చు. నేను ఇక్కడ ప్రతిపక్షనేతగా బిజీగా ఉండబట్టి.. తెలంగాణ సమస్యల మీద స్పందించలేకపొయ్యా. రేపటిరోజున నేను ఏపీలో అధికారంలోకొస్తే.. అప్పుడు తెలంగాణ మీద మళ్ళీ దృష్టి పెట్టే అవకాశాల్ని పరిశీలిస్తా” అన్నారు జగన్. ముఖ్యమంత్రి కుర్చీనెక్కిన తర్వాత ఖాళీ సమయం దొరుకుతుందని, అప్పుడు పొరుగు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకోడానికి కావాల్సినంత నైతిక స్థైర్యం లభిస్తుందని తాను భావిస్తున్నట్లు జగన్ చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చితికిపొయ్యే పరిస్థితిలో వుంది కనుక.. అక్కడినుంచి వచ్చే నాయకులతో ‘తెలంగాణ వైసీపీ’కి జవసత్వాల్ని తొడగవచ్చన్నది తన స్ట్రాటజీగా చెప్పుకున్నారు జగన్.

ఇప్పుడు తనకు అపూర్వ స్నేహితుడిగా చెలామణీ అవుతున్న కేసీఆర్‌తో జగన్.. రేపటిరోజున తెలంగాణలో రాజకీయ శత్రుత్వం పెట్టుకునే అవకాశం ఖచ్చితంగా వుంది. ఏపీలో తాను పవర్లోకి రావడానికి కేసీఆర్ తోడ్పాటు తీసుకోబోతున్న జగన్.. తర్వాత తెడ్డు తగలేస్తారా? తెలంగాణలో ప్రతిపక్ష వైసీపీ రూపంలో కేసీఆర్ చాప కిందకు నీళ్లు తీసుకొస్తారా? ఇవి బరువైన ప్రశ్నలు. తెలంగాణలో ఇప్పుడు చంద్రబాబు చేసిన ప్రయోగాన్నే.. రేపటిరోజున తాను కూడా చేయబోతున్నట్లు జగన్ స్పష్టంగా చెప్పేశారు కనుక.. కేసీఆర్ అప్రమత్తం కాక తప్పదు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు వుండరన్న మాటను జగన్ మరోసారి నిజం చేస్తున్నట్లే!

Related posts

Leave a Comment