వామపక్షాల కీలకపాత్ర…

 న్యూస్ ఇండియా24/7 న్యూస్ నెట్వర్క్
కొత్త సంవత్సరం వచ్చేసింది. అంతకు మూడు నెలల మునుపే ఎన్నికల వాతావరణం కూడా వచ్చేసింది. రాష్ట్రంలో అధికారంలో వున్న తెలుగుదేశం పార్టీ ధర్మ పోరాట దీక్షలు, జిల్లాల వారీ, నియోజక వర్గాల వారీ సమీక్షలు, పార్టీ సభ్యత్వ నమోదు వంటి సన్నాహక కార్యక్రమాలను ఒకవైపు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, భారీ అడ్వర్‌టైజ్‌మెంట్లు, శ్వేత పత్రాలనబడే ప్రచార పత్రాలు ఇంకోవైపు చేపట్టింది. అన్నింటా తానై అన్నట్టు చంద్రబాబు క్షణం తీరిక లేకుండా ఈ షో నిర్వహిస్తున్నారు. తానే తిరిగి ముఖ్యమంత్రి కాకపోతే ‘ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏమైపోతుందో చూసుకోండి’ అంటూ ఒక విధంగా ప్రజల్ని హిప్నటైజ్‌ చేద్దామని ఆయన ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తోంది. సంక్షేమ పథకాల వల్లనే తెలంగాణలో కెసిఆర్‌ ఘన విజయం సాధించారన్న పత్రికా విశ్లేషణలు వచ్చాక ఈ హడావుడి ఆంధ్రప్రదేశ్‌లో మరీ వేగంగా జరుగుతోంది. ఇంకోపక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే చాలా అన్యాయంగా వుంది. తలకు మించిన అప్పులు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు రేపో, మాపో పూర్తయిపోతుందన్నట్టు ప్రజలకు సినిమా చూపిస్తున్నారు. 5 శాతం పునరావాసం కూడా జరగలేదు. కాని ప్రాజెక్టు నిర్మాణంలో 67 శాతం పూర్తయిపోయిందని, ఏకంగా 70 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేస్తామని ప్రచారం చేసుకుంటున్నది రాష్ట్ర ప్రభుత్వం. వందల కోట్ల రూపాయల బడ్జెట్‌ ప్రత్యేకంగా కేటాయించి అమరావతి సందర్శన, పోలవరం సందర్శన ఒక జాతరను తలపించే మాదిరిగా నిర్వహిస్తున్నారు.
బిజెపితో స్నేహం చెడిపోయాక రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తోందని, నిధులు, ప్రత్యేక హోదా నిరాకరిస్తోందని విమర్శలు రోజూ గుప్పిస్తున్నారు. మరోవైపు కేంద్రం తిరస్కరించినా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి తీరుతామని బింకంగా ప్రకటిస్తున్నారు. కడప స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేసేశారు. రామాయపట్నం పోర్టుకు, ప్రకాశం జిల్లాలో భారీ కాగిత పరిశ్రమకు శంకుస్థాపనలు చేయబోతున్నారు. ఇంతటితో ఆగకుండా కేంద్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు వ్యూహ రచన చేసే చాణక్య పాత్ర తనదేనని చెప్పుకుంటున్నారు మన ముఖ్యమంత్రి. చంద్రబాబు శ్రీకృష్ణుడైతే రాహుల్‌ గాంధీ అర్జునుడుగా 2019 జనరల్‌ ఎన్నికలనబడే మహాభారత యుద్ధం జరగబోతోందన్న సినిమా చూపిస్తున్నారు. చంద్రబాబు చూపిస్తున్న సినిమాకి బోనస్‌గా బాలయ్య బాబు ఎన్టీయార్‌ బయోపిక్‌లను ప్రజల మీదికి వదుల్తున్నారు. 
మొత్తం మీద 2019 ఎన్నికలలో ప్రజలు ఏ నిర్ణయానికి రావాలో, చంద్రబాబే నిర్ణయించేసినట్టు కనపడుతోంది. ‘అన్యధా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ’ అని భక్తులు దైవాన్ని శరణుజొచ్చిన చందాన ఆంధ్ర రాష్ట్ర ఓటర్లు ‘చంద్రబాబు తప్ప మాకు వేరే దిక్కు లేదు’ అని అనుకోవాలని తెలుగుదేశం అధినేత భావిస్తున్నట్టుంది. ఈ వన్‌సైడ్‌ లవ్‌ రోజురోజుకీ పెరిగిపోతోంది.
ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా వున్న వైఎస్సార్‌ సీపీ తమ అధినేత జగన్‌ దాదాపు సంవత్సరం నుంచి సాగిస్తున్న పాదయాత్ర మీదే ఆశలు పెట్టుకున్నట్టు కనపడుతోంది. అసెంబ్లీని వేదికగా చేసుకుని ప్రజా సమస్యలను, రాష్ట్ర సమస్యలను లేవనెత్తి ప్రభుత్వ వైఫల్యాలను, లోపాలను ఎత్తిచూపి బోనులో నిలబెట్టే ప్రయత్నం చేయడం ప్రతిపక్షం కనీస బాధ్యత. కాని అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి వైఎస్సార్‌ సీపీ ఆ పాత్రను పోషించడంలో వైఫల్యం చెందింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని సమస్యలనూ పరిష్కరిస్తుందని నమ్మబలకడం మినహా జగన్‌ గాని, ఆ పార్టీ గాని చేస్తున్నదేమీ కనిపించడం లేదు. గత సంవత్సర కాలంగా ముఖ్యంగా రాష్ట్రపతి ఎన్నికల కాలం నుంచి బిజెపి వ్యవహరిస్తున్న తీరు, ఆ పార్టీని పల్లెత్తు మాట అనకుండానే రాష్ట్రానికి హోదా విషయంలో చేస్తున్న ప్రకటనలు చూస్తే ఏదో ఒక విధంగా ఈ పార్టీ బిజెపితో అవగాహనకొచ్చి వ్యవహరించే దిశగానే అడుగులు వేస్తున్నదని భావించాల్సి వుంటుంది. 
2018లో ముందుకొచ్చినది జనసేన పార్టీ. రాష్ట్రంలోని యువత గణనీయంగా జనసేన పట్ల ఉత్సాహంగా స్పందిస్తున్నారనేది దాదాపు అందరూ అంగీకరిస్తున్నారు. ఈ పార్టీ కేవలం చంద్రబాబు వ్యతిరేకతను చీల్చి పరోక్షంగా టిడిపికి మేలు చేయడం కోసమే వచ్చిందని వైఎస్సార్‌ సీపీ నేతలు, 2014లో తమకు ఓట్లేసిన ప్రజలను చీల్చి పరోక్షంగా జగన్‌కు మేలు చేస్తుందని టిడిపి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. దీనిని బట్టి ఇటు టిడిపి, అటు వైఎస్సార్‌ సీపీ రెండిట్లోనూ జనసేన చూపబోయే ప్రభావం తమకు నష్టం కలిగిస్తుందన్న ఆందోళన పెరుగుతోందని స్పష్టం అవుతోంది. ప్రజా సమస్యలపై వివిధ ప్రాంతాలలో పర్యటించి బాధితులకు అండగా నిలవడం, వామపక్షాలు నడుపుతున్న ఉద్యమాలకు సంఘీభావం తెలపడం, ప్రత్యేక హోదా, రాయలసీమ కరువు వంటి అంశాలను లేవనెత్తి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రశ్నించడం, వివిధ జిల్లాల్లో సంస్థాగత నిర్మాణం దిశగా జనసేన వేస్తున్న అడుగులు – ఇవన్నీ ఆ పార్టీ 2019 ఎన్నికలలో రాష్ట్రంలో నిర్వహించబోయే పాత్రను సూచిస్తున్నాయి. ద్విముఖ పోటీ వుండే రాజకీయ చిత్రం కాస్తా బహుముఖ పోటీ వైపు మారుతోంది. కనుకనే టిడిపి, వైఎస్సార్‌ సీపీ, జనసేన పట్ల తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు. 
కాంగ్రెస్‌ 2014లో రాష్ట్రంలో పూర్తిగా మట్టిగరిచింది. ఈ మారు టిడిపి కూటమిలో భాగస్వామి అయింది. ఇది ఇరు పార్టీల కింది స్థాయి శ్రేణులకు ఎంతవరకూ మింగుడు పడుతుందో చూడాలి. ఇక 2014లో టిడిపితో మిత్రత్వం నెరపి, నాలుగేళ్ల పాటు ప్రభుత్వంలోనూ భాగస్వామిగా వున్న బిజెపి ఈ మారు రాష్ట్రంలో దిక్కుతోచని స్థితిలో పడింది. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు విషయాల్లో రాష్ట్రానికి బిజెపి ద్రోహం చేసిందనే భావం ప్రజల్లో బలంగా నాటుకుంది.
2019 లోకి అడుగుపెట్టిన ఈ రోజు రాష్ట్ర రాజకీయ చిత్రపటం ఈ తీరున కనపడుతోంది. అయితే ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. ప్రధాన స్రవంతి మీడియాగాని, ప్రధాన రాజకీయ పార్టీలుగాని ప్రజల ముందు రెండో వైపు ఏముందో చూపించడానికి, చర్చించడానికి సాహసం చేయలేకపోతున్నాయి.
2018 జనవరి ఒకటవ తేదీ నాటికి బలంగా కొనసాగుతున్న టిడిపి-బిజెపి మైత్రీబంధం మార్చి 2018 నాటికల్లా తెగిపోయి ఎందుకు ఆ పార్టీలు బద్ధ శత్రువులుగా వ్యవహరిస్తున్నాయి? వైఎస్సార్‌ సీపీ లోక్‌సభ ఎంపీలు రాజీనామా ఎందుకు చెయ్యాల్సి వచ్చింది? ‘ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీ యే మిన్న’ అని అసెంబ్లీ సాక్షిగా వాదించిన చంద్రబాబు నేడు ‘ప్రత్యేక హోదా మన హక్కు’ అని ఎందుకు గర్జిస్తున్నారు? ‘అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఫైలుపై మొదటి సంతకం చేస్తాం’ అని రాహుల్‌ గాంధీ ఎందుకు ప్రకటించారు? రాష్ట్రంలో 2019లో ఏర్పడబోయే ప్రభుత్వంలో బిజెపి కీలక పాత్ర పోషిస్తుందని ప్రగల్భాలు పలికిన బిజెపి నేతలు నేడు ఈ రాష్ట్రంలో ఒక మూలకు ఎలా నెట్టబడ్డారు?
ఇటువంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే నాణేనికి రెండోవైపు చూడాల్సిందే. ఆ రెండోవైపున వున్నది రాష్ట్రంలోని సామాన్య ప్రజలూ, వారినే అంటిపెట్టుకున్న ఉద్యమాలే ఊపిరిగా ముందుకు సాగుతున్న వామపక్ష పార్టీలూ, ప్రజా సంఘాలూ, శాసన మండలిలో ప్రత్యేక హోదాపై చర్చ జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి ప్రజల దృష్టిలో ప్రత్యేక హోదాకు పెద్ద ప్రాధాన్యత లేదని ప్రకటించారు. పిడిఎఫ్‌ కు చెందిన శాసనమండలి సభ్యులు ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రజల హక్కు అని, రాష్ట్ర ప్రజల సెంటిమెంటు అని చెప్పినా ముఖ్యమంత్రి వినిపించుకోనట్టే వ్యవహరించారు. 2018 ఫిబ్రవరి 8న వామపక్షాలు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో కేంద్రం ప్రదర్శించిన నిర్లక్ష్యానికి నిరసనగా రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. ప్రజల నుంచి ఆ పిలుపుకు అనూహ్యంగా సానుకూల స్పందన వచ్చింది. దాంతో టిడిపి వైఎస్సార్‌ సీపీతో సహా ఉలిక్కిపడ్డాయి. ఇక బిజెపితో అంటకాగితే తనకు పుట్టగతులుండవని టిడిపి గ్రహించింది. అందుకే వెంటనే బిజెపితో తెగతెంపులకు సిద్ధం అయ్యింది. ప్రజలలో ఏర్పడిన బిజెపి వ్యతిరేకతకు తానే ప్రతినిధిని అన్నట్టు ఇప్పుడు వ్యవహరిస్తోంది. 
ప్రజలలో బిజెపి పట్ల ఏర్పడిన అసంతృప్తి, వ్యతిరేకత ఒక్క రోజులో వచ్చిన మార్పు కాదు. వామపక్షాలు ఎప్పటికప్పుడు ప్రజల్ని చైతన్యపరుస్తూ చేపట్టిన ఉద్యమాల ఫలితం అది. ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌, కడప ఉక్కు, నిర్వాసితుల పునరావాసం వంటి అంశాలపై వామపక్ష పార్టీలుగాని ప్రజాసంఘాలుగాని ఉద్యమాలు చేపడితే అతి దుర్మార్గంగా వాటిని అణచివేయజూసింది చంద్రబాబు ప్రభుత్వం. లెక్కలేనన్ని కేసుల్ని బనాయించింది. 2014 నుంచి 2017 వరకు ఒక్కసారి కూడా అఖిల పక్షాన్ని సమావేశపరచలేదు. ఢిల్లీ మీద ఒత్తిడి కోసం అందరం కలుద్దాం అన్న ప్రతిపాదనను ఏనాడూ అంగీకరించలేదు. 2018 ఫిబ్రవరి బంద్‌ తర్వాత ఫిరాయించి ‘అఖిలపక్షం’ పల్లవి ఎత్తుకుంది. ఈ రోజు టిడిపి ప్రత్యేక హోదా విషయంలో ప్రదర్శిస్తున్నది అవకాశవాదమే తప్ప అందులో నిజాయితీ మచ్చుకైనా లేదు. కడప ఉక్కు విషయంలోనూ అంతే. వామపక్షాలు కడప ఉక్కుపై ఆందోళన చేపడితే వారిపై నిర్బంధాన్ని ప్రయోగించింది. తీరా ప్రజలు ఆగ్రహంతో వున్నారన్నది అర్థమయ్యాక సి.ఎం రమేష్‌ చేత నిరాహార దీక్ష డ్రామా ఆడించింది. ఈరోజు కడప ఉక్కుకు శంకుస్థాపన చేసినా, అదీ రాజకీయ జిమ్మిక్కు మాత్రమేనని, కేంద్రం అమలు చేయాల్సిన విభజన హామీని వనరులు లేకపోయినా తానే చేపడతానని ప్రకటించడం రాయలసీమ ప్రజల్ని మోసగించడానికేనని వస్తున్న విమర్శలలో వాస్తవం వుంది.
రాయలసీమ కరువు, ఉత్తరాంధ్ర రాయలసీమ, ప్రకాశం జిల్లాల వెనుకబాటుతనం, రాష్ట్రంలో దళితుల భూములపై, వారి హక్కులపై జరుగుతున్న దాడులు, బలవంతపు భూసేకరణ, రాజధాని ప్రాంతంలో భూములిచ్చిన వారు ఎదుర్కుంటున్న సమస్యలు, వారి విషయంలో చంద్రబాబు చేసిన, చేస్తున్న వాగ్ధాన భంగాలు, రైతులకు దక్కని గిట్టుబాటు, బ్యాంకు రుణాలు, నిరుద్యోగం-ఇలా ప్రజలెదుర్కుంటున్న సమస్యలపై ప్రభుత్వ నిర్వాకాన్ని ప్రశ్నించినదీ, ఉద్యమించినదీ వామపక్షాలే. ఆ తర్వాత వారితో జనసేన కూడా కలవడం మొదలైంది. ఒకవైపు కేంద్రం, ఇంకొకవైపు రాష్ట్ర ప్రభుత్వం తమ విషయంలో చేస్తున్న అన్యాయాలను రాష్ట్ర ప్రజలు ఈ ఉద్యమాల ఫలితంగానే గ్రహిస్తున్నారు. ఇంకోపక్క ఇంత జరుగుతున్నా ప్రకటనలకు, పాదయాత్రకే పరిమితమైన వైఎస్సార్‌ సీపీ నిష్క్రియాపర్వత్వాన్ని వారు అర్థం చేసుకుంటున్నారు. ‘మాకు వేరే ప్రత్నామ్నాయం లేదా?’ అని ప్రశ్నిస్తున్న ప్రజల ముందు జూన్‌ 2018లో వామపక్ష పార్టీలు ఒక స్పష్టమైన ప్రత్యామ్నాయ కార్యక్రమాన్ని ఉంచాయి. నేతలను, పార్టీలను మారిస్తే చాలదు, విధానాలను కూడా మార్చాలని స్పష్టం చేశాయి. ఆ ప్రత్యామ్నాయ విధానాలను అమలు చేయడం కోసం కలిసి వచ్చే శక్తులన్నింటినీ కూడగట్టేందుకు పూనుకున్నాయి. ఈ ప్రయత్నాలకు జనసేన, లోక్‌సత్తా, ఆమ్‌ఆద్మీ పార్టీల నుండి, ఇతర ప్రజాతంత్ర శక్తుల నుండి స్పందన వస్తోంది. ఇది చాప కింద నీరు లాగా రాష్ట్రమంతటా క్రమంగా పరుచుకుంటూ సాగుతోంది. 
ఆర్థిక స్థితిగతుల పెరుగుదల కోసం, సామాజిక న్యాయం కోసం నిరంతరంగా వామపక్షాలు, ప్రజాసంఘాలు గత నాలుగున్నరే ళ్ళుగా సాగించిన, సాగిస్తున్న ఉద్యమాలే ప్రజాభిప్రాయాన్ని బలంగా ప్రభావితం చేస్తున్నాయి. అందుకే పాలక పార్టీ, ప్రధాన ప్రతిపక్షం రెండూ లోలోపల గుబులు పడుతున్నాయి. 2019 ఎన్నికల ఫలితాలను ఈ ప్రజా ఉద్యమాలు ప్రభావితం చేసి ఆ పార్టీల భవిష్యత్తును తిరగరాస్తాయి. ఇది అనివార్యం. బిజెపికి తిరుగులేదన్న పరిస్థితి 2018లో మారిపోయి ఆ పార్టీ ఓటమి ఖాయమన్న స్థితి వచ్చింది. నోట్ల రద్దు, జిఎస్‌టి, కార్పొరేట్ల సేవలో పడి ప్రజాసమస్యల్ని నిర్లక్ష్యం చేసిన వైనం, రాఫెల్‌ ఒప్పందం వంటి కుంభకోణాలు బిజెపి పుట్టి ముంచబోతున్నాయి. రాష్ట్రంలోనూ అలాంటి మార్పులు వస్తాయి. నాలుగున్నరేళ్లు ప్రజల్ని మోసం చేసి ప్రచారార్భాటంతో గట్టెక్కాలనుకుంటున్న పాలక పక్షానికి, పాలక పక్షంపైగల అసంతృప్తి తమకే లాభిస్తుందన్న అతి తెలివితో వ్యవహరిస్తున్న ప్రధాన ప్రతిపక్షానికి రాష్ట్ర ప్రజలు 2019 ఎన్నికలలో పాఠం నేర్పడం ఖాయం. ప్రజలకు చైతన్యం కల్పించడంలో వామపక్ష పార్టీలు, వారి మితృలది కీలక పాత్ర అన్నది స్పష్టం.

– ఎంవిఎస్‌ శర్మ

Related posts

Leave a Comment