హంగ్‌ వస్తే ఏం చేద్దాం?

న్యూస్ ఇండియా పొలిటికల్ న్యూస్ నెట్వర్క్…

*వ్యూహంపై నేడు కేసీఆర్‌తో ఒవైసీ భేటీ !

మజ్లిస్‌ పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సోమవారం సీఎం కేసీఆర్‌తో భేటీ కానున్నారు. అసెంబ్లీ ఓట్ల లెక్కింపునకు ముందు రోజు ఇరువురి భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. రాష్ట్రంలో హంగ్‌ ఏర్పడితే ఏం చేయాలన్న అంశంపై వీరు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. రాజేంద్రనగర్‌ స్థానాన్ని కైవసం చేసుకుంటానన్న ధీమాతో ఉన్న మజ్లిస్‌ పార్టీ.. హంగ్‌ వస్తే 8 సీట్లతో కింగ్‌ మేకర్‌గా మారనుంది. అయితే, మిత్రపక్షమైన టీఆర్‌ఎస్‌ను కాదని కాంగ్రెస్‌కు మద్దతిచ్చే ప్రసక్తే లేదని మజ్లిస్‌ నేతలు అంటున్నారు.తమకు పూర్తి మెజారిటీ వస్తుందని టీఆర్‌ఎస్‌ అంటోంది. అదే సందర్భంలో మెజారిటీ తగ్గితే అండగా నిలవాలని ఒవైసీని కేసీఆర్‌ కోరే అవకాశముంది.

మజ్లిస్‌ను దూరం పెడితే టీఆర్‌ఎస్‌కు మద్దతిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ వ్యాఖ్యానించిన నేపథ్యంలో కేసీఆర్‌తో ఒవైసీ ఏకాంత భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీకి మజ్లిస్‌ కంటే ఎక్కువ సీట్లు వస్తాయా? తక్కువ వస్తాయా? అనే విషయాన్నీ విశ్లేషించనున్నట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌కు 45-50 సీట్లు వస్తే స్వతంత్ర ఎమ్మెల్యేలు, మజ్లిస్‌ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలిస్తారు. టీఆర్‌ఎస్‌కు మజ్లిస్‌ను దూరం చేసేందుకు కాంగ్రెస్‌కు చెందిన జాతీయ నాయకులు, కొందరు మైనారిటీ వర్గం జాతీయ నాయకత్వం రంగంలోకి దిగినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో కేసీఆర్‌-అసద్‌ భేటీకి రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

Related posts

Leave a Comment