ఎన్‌ఐఏ దర్యాప్తుపై పరిశీలన..

ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌పై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) చేత దర్యాప్తు చేయించే విషయంపై పరిశీలన జరుగుతోందని కేంద్ర ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు నివేదించింది. ఈ ఘటన ఎన్‌ఐఏ చట్టంలో నిర్ధేశించిన నేరాల పరిధిలోకి వస్తుందో రాదో పరిశీలన చేసి, ఆ తరువాత దర్యాప్తుపై నిర్ణయం తీసుకుంటామని, అందుకు కొంత సమయం పడుతుందని వివరించింది. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ఎన్‌ఐఏ దర్యాప్తుపై ఏ నిర్ణయం తీసుకున్నా బహిర్గతం చేయకుండా సీల్డ్‌ కవర్‌లో తమ ముందుంచాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ లోపు రాష్ట్ర పోలీసులు దర్యాప్తును కొనసాగించవచ్చునని తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది.

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది. తనపై జరిగిన హత్యాయత్నం ఘటన పౌర విమానయాన భద్రత చట్టం ప్రకారం చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్వచన పరిధిలోకి వస్తుందని, అందువల్ల దర్యాప్తు చేయాల్సింది జాతీయ దర్యాప్తు సంస్థని, ఆ మేర కేంద్ర హోం శాఖకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ వైఎస్‌ జగన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే ఘటనపై వైఎస్సార్‌సీపీ తరఫున మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై బుధవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.

ఈ సందర్భంగా పార్టీ తరఫున సీనియర్‌ న్యాయవాది దేశాయ్‌ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఎన్‌ఐఏ చట్టంలోని నిర్ధేశించిన నేరాల పరిధిలోకి వస్తుందని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని, ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఓ నివేదికను కేంద్రానికి పంపడం తప్పనిసరన్నారు. ఈ నివేదికను ఆధారంగా కేంద్రం ఎన్‌ఐఏ దర్యాప్తుపై నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. కేంద్రం ఎన్‌ఐఏ దర్యాప్తునకు ఆదేశిస్తే రాష్ట్ర పోలీసులు దర్యాప్తును కొనసాగించడానికి వీల్లేదని, అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కేంద్రానికి నివేదిక పంపలేదన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ, జగన్‌పై జరిగిన ఘటన పౌర విమానయాన భద్రత చట్టంలోని సెక్షన్‌ 3 పరిధిలోకి రాదన్నారు. ఆ చట్టం ప్రకారం పౌర విమానయాన భద్రతకు విఘాతం కలిగినప్పుడే ఎన్‌ఐఏ రంగంలోకి వస్తుందని, ఓ వ్యక్తిపై దాడి జరిగినప్పుడు ఎన్‌ఐఏ దర్యాప్తు అవసరముండదన్నారు. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపడం తప్పనిసరి కాదన్నారు. కేంద్రం సుమోటోగా నిర్ణయం తీసుకోవచ్చన్నారు. కేంద్రం తరఫున అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) కె.లక్ష్మణ్‌ స్పందిస్తూ.. ఎన్‌ఐఏ చట్టం ప్రకారం కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపడం తప్పనిసరన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రం నుంచి కేంద్ర హోం శాఖకు నివేదిక రాలేదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. జగన్‌పై హత్యాయత్నానికి సంబంధించి సీఐఎస్‌ఎఫ్‌ కేంద్రానికి నివేదిక పంపి ఉంటుందని, దాని ఆధారంగా కేంద్రం నిర్ణయం తీసుకోవచ్చునని తెలిపింది.

Related posts

Leave a Comment