తెలంగాణను బానిస కానివ్వ

తెలంగాణను బానిస కానివ్వ

తన కంఠంలో ప్రాణం ఉండగా తెలంగాణను బానిస కానివ్వబోనని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు తేల్చిచెప్పారు. దశాబ్దాలుగా బానిసగా ఉన్న తెలంగాణను.. కొట్లాడి సాధించుకున్నామని, నాలుగేండ్లుగా దేశానికే ఆదర్శంగా పాలించుకుంటున్నామని అన్నారు. ఇప్పుడు మళ్లా తెలంగాణ ప్రజలను బానిసలను కానివ్వనని స్పష్టంచేశారు. 58 ఏండ్లు తండ్లాడి, త్యాగాలతో సాధించుకున్న తెలంగాణను కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను కాకులకు, ఇనుపమూతి గద్దలకు ఇస్తే ప్రమాదమని హెచ్చరించారు. ఏండ్ల తరబడి గోసపెట్టినోళ్లే మళ్లీ వస్తున్నారన్న సీఎం.. తెలంగాణ గెలిచి నిలువాలని ప్రజలకు సూచించారు. యావత్తు తెలంగాణ ఈరోజు ఏమరపాటుకు గురికాకుండా, నక్కజిత్తులకు, మాయగాళ్లకు మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలి. 2018 ఎన్నికల చివరిసభ నుంచి తెలంగాణ ప్రజలకు మీ బిడ్డగా విజ్ఞప్తి చేస్తున్న. మనలోమనకు చిన్నచిన్న విభేదాలుంటే పరిష్కారం చేసుకుందం. అదో పెద్ద సమస్య కాదు. కానీ వలసశక్తులకు చోటియ్యొద్దు. చంద్రబాబు పెత్తనం నడిచే ప్రభుత్వం రావద్దు. ఢిల్లీ గులాంల ప్రభుత్వం రావద్దు. దరఖాస్తు పట్టుకొని విజయవాడకు పోయే దుస్థితి మనకు రావద్దు అన్నారు. పేదల కంట కన్నీరు చూడని తెలంగాణ నా స్వప్నం. దుఃఖంలేని తెలంగాణ నా ఆశ. ఆకుపచ్చ తెలంగాణ నా లక్ష్యం. కోటి ఎకరాలకు కచ్చితంగా నీరుపారేది నేనుచేస్తున్న యజ్ఞం. ఇది నెరవేరాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ యజ్ఞం ఆగొద్దు. ఈ ప్రయాణం ఆగొద్దు. తెలంగాణ గెలిచి నిలువాలి.

నవ్వెటోనిముందట జారిపడొద్దు. ఓట్లు అనంగనే గాలిగాలి గత్తరగత్తర కావొద్దు. మనం గాలిగాలి ఓటువేస్తే అంత గాలిగాలే ఉంటది. ఓటు వేసినోడు మల్ల కనిపించడు. ఐదేండ్లు గట్లనే ఉంటం. మీ బిడ్డగా యావత్ ప్రజానీకానికి నా విజ్ఞప్తి. దాచిదాచి దయ్యాల పాలుచేయొద్దు. ఇంత కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ ఇప్పుడిప్పుడే ఇగురంగా మొగ్గ తొడిగేటువంటి ప్రయత్నం. నేను చల్లిన విత్తనాలు మొలకెత్తి.. పూతపూసి.. కాయగాసే సమయం వస్తాఉన్నది అని సీఎం చెప్పారు. ఇప్పుడిప్పుడే తెలివికొస్తున్నం. దీన్ని చెడగొట్టుకోవద్దు అని విజ్ఞప్తిచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలో కోటి ఎకరాలను సస్యశ్యామలం చేయాలని కృషిచేస్తుంటే.. మన భూముల్లో పారాల్సిన గోదావరి నీళ్లు పంచుకుపోయేందుకు చంద్రబాబు కుట్రచేస్తున్నారని కేసీఆర్ అన్నారు. తెలంగాణను మళ్లీ వలస పెత్తందార్ల పాలుచేసేందుకు వస్తున్న కూటమికి ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. తాను పోటీచేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో బుధవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాదసభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణలో కీలుబొమ్మ ప్రభుత్వం ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు భావిస్తున్నారని అన్నారు.
కేసీఆర్ ఇక్కడుంటే తన ఆటలు సాగవని, దద్దన్నలు, మొద్దన్నలు ఉంటే గోల్‌మాల్ చేయొచ్చని అనుకుంటున్నారని విమర్శించారు. కృష్ణానదిలో నీళ్లులేవు.. గోదావరి నీళ్లు పంచుకుందాం.. అంటూ కాంగ్రెస్ సన్నాసులను పక్కనబెట్టుకుని మాట్లాడుతున్నాడని, ఆయన మాటలకు కాంగ్రెస్ గొర్రెలు తలకాయలు ఊపుతున్నాయని మండిపడ్డారు. కృష్ణాబేసిన్‌లో ఉన్న కోదాడలో నిలబడి.. కృష్ణాలో వాటా లేదంటవా? నీకెంత ధైర్యం? అని ప్రశ్నించారు. చాలా కష్టపడి, అనేక పోరాటాలు చేసి రాష్ర్టాన్ని సాధించుకున్నామని సీఎం చెప్పారు. 58 ఏండ్ల తండ్లాట. అనేక మరణాలు ఫైరింగులు, జైళ్లు, క్షోభ అనుభవించి భగవంతుని దయవల్ల 2014లో రాష్ట్రాన్ని సాధించుకున్నం. చిన్నమాట కాదు. ఎంత మంది చనిపోయారో, తల్లుల బాధ ఏందో అందరం చూశాం. త్యాగాల మీద వచ్చిన తెలంగాణ ఇది. ఎవడో బిస్కెట్‌లాగా మనకు ఇయ్యలే. తెలంగాణలో ఏం జరుగుతున్నదో మీకు తెలుసు. డంబాచారం డబ్బాలు కొట్టుకోవటం అవసరం లేదు అని చెప్పారు. దేశంలో రైతాంగానికి 24 గంటల ఉచిత కరంటు ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని సీఎం చెప్పారు.

ప్రధాని నరేంద్రమోదీ డబ్బా కొట్టే గుజరాత్‌లో కూడా ఇవ్వటంలేదని గుర్తుచేశారు. రాష్ట్రంలో రైతుల అప్పులు తీరిపోవాలనే వారికోసం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అమ్మవారి దీవెనతో కొండపోచమ్మసాగర్, కొమురెల్లి మల్లన్న దయతో మల్లన్నసాగర్ పూర్తవుతున్నయి. అవి నిండాలే.. మన కలలు పండాలే. సిద్దిపేట జిల్లా మొత్తం ఆకుపచ్చగా.. హెలికాప్టర్ ఎగిరితే బెత్తెడు జాగకూడా ఖాళీలేని పరిస్థితి రావాలి. యావత్ తెలంగాణ ఆ విధంగా కావాలి అని ఆకాంక్షించారు. తెలంగాణ మేధావులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, రచయితలు, కవులు, కళాకారులు అందరూ తెలంగాణకు రక్షణకవచంగా నిలువాలని కోరారు. ఈరోజు తెలంగాణ ఆర్థికాభివృద్ధి 17.17%. ఈ విషయంలో మనకు దరిదాపుల్లో ఏ రాష్ట్రం లేదు. ఏటా పెరిగే ఆదాయం రూ.12-16వేల కోట్లు. అదనపు ఆదాయం వస్తున్నది. పదేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇసుక మీద ఆదాయం రూ.9.56 కోట్లు. ఈరోజు నాలుగేండ్లలో ఇసుక మీద సంపాదించినది రూ.2,057 కోట్లు. ఎక్కడ తొమ్మిదిన్నర కోట్లు? ఎక్కడ రూ.2,057 కోట్లు? దొంగతనాలు, స్మగ్లింగ్, అరాచకాలను బంద్‌చేసినందువల్లే సాధ్యమైంది.

Related posts

Leave a Comment