రేపటి సాయంత్రంతో పరిసమాప్తం

న్యూస్ ఇండియా పొలిటికల్ డెస్క్...సిటీబ్యూరో, : శాసనసభ ఎన్నికల మహా సంగ్రామంలో ప్రచార గడువు సమీపిస్తున్నది. బుధవారం సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే ప్రచారం చేసుకోవడానికి సమయమున్నది. దీంతో అభ్యర్థులకు మంగళ, బుధవారం రెండు రోజులు మాత్రమే ఓటర్లను కలుసుకునే అవకాశమున్నది. అభ్యర్థుల తరపున ప్రచారంతో పాటు బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించుకోవడానికి కూడా అంతే సమయం ఉంది. దీంతో ఒక్క క్షణం కూడా వృథా చేయకుండా ప్రచారంలో మునిగితేలుతున్నారు అభ్యర్థులు. నిన్న, మొన్నటి వరకు కాలనీ, డివిజన్లు చుట్టేసిన వచ్చిన వారు ప్రస్తుతం ముఖ్యనేతలతో కలిసి రోడ్ షోలపై దృష్టి సారించారు. అగ్ర నేతలను వెంటబెట్టుకొని ప్రచార జోరును పెంచారు. ఓటర్లను తమ వైపు తిప్పుకునేలా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వేడెక్కిన ప్రచారం.. ప్రచారంలో అభ్యర్థులు పదును పెంచారు. గడిచిన 85 రోజులకు పైగా టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రజాక్షేత్రంలో ఉండడం, ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ స్టార్ క్యాంపెయినర్లుగా గ్రేటర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ప్రతిపక్ష పార్టీల కంటే ముందున్నారు.

మరో రెండు రోజుల పాటు మంత్రి కేటీఆర్ రోడ్ షోలతో హోరెత్తించనున్నారు. ఇక మహాకూటమి అభ్యర్థులు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, విజయ్ శాంతి, బాలకృష్ణ, ఏపీ మంత్రులు, కోదండరాం నేతలు ప్రచారంలో పాల్గొంటుండగా, బీజేపీ పార్టీ తరపున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు, పరిపూర్ణానంద స్వామి బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ప్రచారానికి మరో రెండు రోజులు మాత్రమే మిలిగి ఉండడంతో అగ్ర నేతలంతా నగరంలో మాకాం వేసి ప్రచారం చేస్తుండడంతో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. నియోజకవర్గాల వారీగా..

గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. పోలింగ్‌బూత్‌ల వారీగా ఉన్న ఓట్లను సామాజిక వర్గాల వారీగా గుర్తించి ఆకట్టుకునేందుకు బృందాలు ఏర్పాటు చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా ఉన్న మొత్తం ఓట్లలో ఎక్కువ ప్రాబల్యం కలిగిన ఓట్లను పరిగణనలోకి తీసుకుంటున్న అభ్యర్థులు ఆయా సామాజిక వర్గాలను ఆకట్టుకునేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు.

Related posts

Leave a Comment