రూ.29,088 కోట్ల పరోక్ష పన్ను ఎగవేతలు..

 న్యూస్ ఇండియా బిజినెస్ డెస్క్….న్యూఢిల్లీ,.. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన దర్యాప్తు విభాగం పెద్ద ఎత్తున పరోక్ష పన్ను ఎగవేతల్ని గుర్తించింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-అక్టోబర్ వ్యవధిలో 1,835 కేసుల్లో రూ.29,088 కోట్ల పన్ను ఎగవేతలు జరిగినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటిలిజెన్స్ (డీజీజీఐ) కనుగొన్నది. వీటిలో రూ.4,562 కోట్ల విలువైన 571 జీఎస్టీ ఎగవేత కేసులు కూడా ఉన్నాయి. రూ.1,553 కోట్ల విలువైన మరో 119 సెంట్రల్ ఎక్సైజ్ సుంకం కేసుల్నీ డీజీజీఐ వెలుగులోకి తెచ్చింది. ఈ మేరకు బుధవారం ఓ సీనియర్ అధికారి పీటీఐకి తెలిపారు. కాగా, అత్యధికంగా సేవా పన్నుల కేసులే ఉండగా, 1,145 కేసుల్లో రూ.22,973 కోట్ల ఎగవేతలున్నాయి.

పరోక్ష పన్నులు, కస్టమ్స్ కేంద్ర బోర్డు (సీబీఐసీ)కు చెందిన క్షేత్రస్థాయి కార్యాలయాల్లో నమోదైన మరికొన్ని కేసుల వివరాలనూ కలిపితే సంఖ్య మరింత పెరుగవచ్చని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ఏప్రిల్-అక్టోబర్ మధ్య రూ.5,427 కోట్ల పన్ను ఎగవేతల్నీ రాబట్టారు. ఇందులో జీఎస్టీ ఎగవేతదారుల నుంచి వచ్చినవే రూ.3,124 కోట్లుగా ఉన్నాయి. సేవా పన్ను ఎగవేత కేసుల నుంచి మరో రూ.2,174 కోట్లు, సెంట్రల్ ఎక్సైజ్ ఎగవేత కేసుల నుంచి రూ.128 కోట్ల వసూళ్లు జరిగాయి.
దీంతో పన్ను ఎగవేతదారులపై అవలంభిస్తున్న కఠిన వైఖరి సత్ఫలితాలనిస్తున్నదన్న అభిప్రాయాలు ప్రభుత్వ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి.

Related posts

Leave a Comment