కీలక బాధ్యతను భుజానికెత్తుకున్న “కేటీఆర్‌ “….

THE NEWS INDIA(TNI 24 NEWS NETWORK)…..ముఖ్యమైన ప్రచార బాధ్యతలను భుజానికెత్తుకున్నారు మంత్రి కేటీఆర్‌. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను గెలిపించేందుకు రంగంలోకి దిగారు. రాష్ట్రంలో సెటిలర్లు ప్రభావం చూపే స్థానాలతో పాటు ఎదురుగాలి వీస్తున్న చోట్లా గెలుపు బాధ్యతలు కేటీఆర్‌కే అప్పగించారు గులాబీ బాస్‌. కేసీఆర్‌ హాజరయ్యే నియోజకవర్గ బహిరంగ సభలతో సంబంధం లేకుండా 60 నియోజకవర్గాల్లో కేటీఆర్ కార్యకర్తలతో భేటీ కానున్నారు తారకరామారావు. ఎక్కడెక్కడ ఎవరు అవసరం.. ఏ ఇష్యూను ఎవరు డీల్ చేయగలరు… ఇలా గెలుపే లక్ష్యంగా వ్యూహ రచన చేస్తున్నారు కేసీఆర్. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు ముఖ్యనేతలకు బాధ్యతలు అప్పగిస్తున్నారయన. అందులో భాగంగా అత్యంత కీలకమైన బాధ్యతలను తన కుమారుడు, మంత్రి కేటీఆర్‌కు అప్పగించారు. పార్టీ గెలుపు క్రిటికల్‌ గా భావిస్తున్న నియోజకవర్గాలతో పాటు సెటిలర్లు ప్రభావితం చేసే నియోజకవర్గాల బాధ్యతలు కేటీఆర్‌కు కట్టుబెట్టారు.

గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోని కొన్ని ఎంపిక చేసిన నియోజకవర్గాల బాధ్యతలు కేటీఆర్‌కు అప్పగించినట్లు సమాచారం. అందులో భాగంగానే ఇబ్రహీంపట్నం, స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గాల్లో కార్యకర్తలు సమావేశమయ్యారు. పార్టీలో అంతర్గత విభేదాల వల్ల ఇబ్బందులు ఎదుర్కుంటున్న నియోజకవర్గాల బాధ్యతలు కూడా కేటీఆర్ భుజాన వేసుకున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థులకు ఎదురుగాలి వీస్తున్న నియోజకవర్గాలతో పాటు క్యాండిడేట్స్ ఎవరు కోరినా కాదనకుండా నియోజకవర్గ పర్యటనలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ సమావేశాలతో కార్యకర్తల్లో జోష్ నింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో వచ్చిన అనుభవాన్ని ఈ ఎన్నికల్లో ఉపయోగించనున్నారు కేటీఆర్‌. 99 కార్పోరేటర్ సీట్లు సాధించటంలో ప్రధాన పాత్ర పోషించిన కేటీఆర్‌…. సెటిలర్లు ప్రభావితం చేసే నియోజకవర్గాలను టార్గెట్‌ చేశారు. సెటిటర్లను ఒప్పించటంలో ప్రధాన భూమిక పోషించిన కేటీఆర్‌కు.. ఇప్పుడు కూడా సెటిటర్ల బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.

గ్రేటర్‌లోని 24 నియోజకవర్గాల్లో కనీసం 15 నియోజకవర్గాల్లో విజయం సాధించాలని భావిస్తుంది టీఆర్ఎస్. అందుకే సెటిలర్ల వ్యవహారాన్ని కేటీఆర్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది. సెటిటర్లుండే నియోజకవర్గాలపై ఏపీ సీఎం చంద్రబాబు కన్నేయటంతో సెటిలర్లపై ప్రత్యేక దృష్టి సారించారు. సెటిటర్లుండే నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి.. చంద్రబాబుకు చెక్ పెట్టేందుకు పక్కా స్కెచ్ వేస్తోంది గులాబీదళం. ఎన్నికల ప్రచారం ముగిసే నాటికి కేటీఆర్… తనకు అప్పగించిన పనిని పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారని భవన్‌లో అనుకుంటున్నారు. నిత్యం అభ్యర్థులతో టచ్‌లో ఉండి ఎక్కడిక్కడ సమస్యలు పరిష్కరించటం.. వ్యూహాలు.. ప్రతి వ్యూహాలతో అభ్యర్థులను రీచార్జ్ చేసే బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు కేటీఆర్.

Related posts

Leave a Comment