అలోక్ వర్మ పిటిషన్‌పై..మోదీ ప్రభుత్వంలో టెన్షన్ ..!!

THE NEWS INDIA(DELHI)..సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను అర్ధ రాత్రి హడావుడిగా విధుల నుంచి తప్పించినప్పటికీ సుప్రీంకోర్టు ఎంత వరకు ఆమోదిస్తుందన్న అనుమానం ఇప్పుడు బీజేపీ నేతలను తొలిచేస్తోంది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం వినీత్ నారాయణ్ కేసులో ఎదురైన అనుభవమే ఎక్కడ ఎదురవుతుందోనని బీజేపీ నేతలు భయపడుతున్నారు.

 ఆ కేసులో కేంద్రానికి మొట్టికాయలు వేసిన సుప్రీం కోర్టు సీబీఐలో రాజకీయ జోక్యాన్ని నిరోధించాలని తీర్పు ఇచ్చింది. అందుకు అనుగుణంగా మార్గదర్శకాలు జారీ చేస్తూ సీబీఐ డైరెక్టర్‌కు పదవీ విరమణ తేదీతో సంబంధం లేకుండా రెండేళ్ల పదవీ కాలాన్ని నిర్ణయించింది. అలోక్ వర్మ దాఖలు చేసిన పిటిషన్ నేడు విచారణకు వచ్చే అవకాశం ఉండడంతో బీజేపీ నేతల్లో టెన్షన్ మొదలైంది.  

అలోక్ వర్మ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం నిజానికి 1997 నాటి సుప్రీం తీర్పుకు పూర్తిగా వ్యతిరేకమైనది. వర్మను పక్కనపెట్టినప్పుడు కొలీజియం కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇదే విషయం నేడు కోర్టులో ప్రస్తావనకు వస్తే ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. అయితే, నిర్ణయాన్ని సమర్థించుకునేందుకు మాత్రం సమాధానం సిద్ధం చేసుకుంది. అతడిని పదవి నుంచి తొలగించలేదని, సీబీఐ డైరెక్టర్ ఇప్పటికీ ఆయనేనని ఆ సంస్థ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. అస్థానా స్పెషల్ డైరెక్టర్‌గా, ఎం.నాగేశ్వరరావు తాత్కాలిక డైరెక్టర్‌గా మాత్రమే విధులు నిర్వహిస్తారని ఆయన పేర్కొన్నారు.  

ప్రభుత్వం ఎన్ని చెప్పినా ఆ వాదనలు కోర్టులో ఎంత వరకు నిలబడతాయన్నదే ప్రస్తుత సమస్య. అలోక్‌వర్మ సెలవుపై స్టే విధిస్తే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పకపోవచ్చని అంటున్నారు. ఇక్కడ ఇంకో విషయం కూడా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. నాగేశ్వరరావు కన్నా సీనియర్ అధికారులు ఉండగా, ఆయనకు బాధ్యతలు కట్టబెట్టడాన్ని సుప్రీం ప్రశ్నించే అవకాశం ఉంది. 

ముఖ్యమైన హోదాలో నియమించడం వంటి అసాధారణ కారణాలుంటే తప్ప సీబీఐ డైరెక్టర్‌ను బదిలీ చేయకూడదన్న నిబంధన ఉంది. అయితే, ఇందుకు కూడా ప్రధాని, ప్రతిపక్ష నేత, ప్రధాన న్యాయమూర్తితో కూడిన కొలీజియం అనుమతి ఉండాలని అత్యున్నత ధర్మాసనం గతంలో తీర్పు చెప్పింది. ఇప్పుడు వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే సుప్రీం కోర్టులో కేంద్రానికి మొట్టికాయలు తప్పకపోవచ్చని అంటున్నారు..

మంచాల భాస్కర్ రెడ్డి.,
న్యూస్ ఎడిటర్ (పొలిటికల్ డెస్క్).
న్యూ ఢిల్లీ.

Related posts

Leave a Comment