కట్నం వేధింపులు భరించలేక చనిపోయినట్టు నాటకం.. మరో యువకుడితో పెళ్లి!

తాను చనిపోయినట్టు నమ్మించిన ఓ మహిళ.. మరో యువకుడితో కలిసి జీవిస్తూ కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌లో జరిగిందీ ఘటన. కట్నం కోసం వేధించి భార్యను హత్య చేసిన నేరం కింద భర్తను అరెస్ట్ చేసిన పోలీసులు ఇప్పుడు నాలుక్కరుచుకున్నారు. మహిళ ఫేస్‌బుక్ ఖాతా, ఆమె మొబైల్ నంబరు ఆధారంగా నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్థానిక కోర్టులో ప్రవేశపెట్టారు. తాను చేసిన నేరాన్ని నిందితురాలు కోర్టులో అంగీకరించింది.

సఫ్దర్‌జంగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే రూబీ అనే మహిళ 2016లో రాహుల్‌ను పెళ్లి చేసుకుంది. ఈ ఏడాది జూన్‌లో రూబీ తండ్రి హరిప్రసాద్ స్థానిక పోలీసులకు రాహుల్‌పై ఫిర్యాదు చేశారు. రాహుల్, ఆమె తల్లిదండ్రులు కలిసి అదనపు కట్నం కోసం వేధిస్తూ తన కుమార్తెను హత్యచేశారని అందులో ఆరోపించారు. అయితే, రూబీ మృతదేహం లభించకపోవడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు నిరాకరించారు. దీంతో ఆయన స్థానిక కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఈ ఘటనపై బారాబంకి ఎస్పీ వీపీ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. హరిప్రసాద్ ఫిర్యాదుతో విచారణ చేపట్టామని, కానీ రూబీ మృతదేహం గురించి ఎంత గాలించినా తమకు దొరకలేదని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసుకున్న తర్వాత దర్యాప్తు ప్రారంభించగా ఆమె ఫేస్‌బుక్ ఖాతా ఇంకా లైవ్‌లోనే ఉన్నట్టు గుర్తించామన్నారు. దీంతో ఆమె ఫోన్ నంబరుపై నిఘా వేయగా అసలు విషయం బయటపడిందని ఎస్పీ వెల్లడించారు. ఆమె ఢిల్లీలో ఉన్నట్టు గుర్తించి అక్కడికి వెళ్లిన పోలీసులకు రాము అనే మరో వ్యక్తితో ఆమె జీవిస్తున్న విషయం తెలిసి అవాక్కయ్యారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి తీసుకొచ్చిన పోలీసులు వారిని కోర్టులో హాజరుపరిచారు. పెళ్లి కోసం తాము ఈ నాటకం ఆడినట్టు అంగీకరించారు. పోలీసులను తప్పుదోవ పట్టించిన హరిప్రసాద్‌పైనా పోలీసులు కేసు నమోదు చేశారు.

Related posts

Leave a Comment