హైకోర్టు విభజనకు ముందడుగు

రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ నాటి హామీల అమలు, పెండింగ్ నిధుల మంజూరు అంశాలే ప్రధానంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తలపెట్టిన ఢిల్లీ పర్యటన ఫలితాలను సాధిస్తున్నది. ప్రధానమంత్రి నరేంద్రమోదీతోపాటు కేంద్ర మంత్రులను కలుస్తున్న సీఎంకు అందరినుంచీ సానుకూల సంకేతాలే వస్తున్నాయి. ఢిల్లీ పర్యటనలో శనివారం ప్రధానమంత్రిని కలిసి రాష్ర్టానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించిన సంగతి తెలిసిందే. జోనల్ వ్యవస్థకు ప్రధానమంత్రి నుంచి ఆమోదం పొందిన ఆయన.. ఆదివారం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీలతో సమావేశమై పలు అంశాల అమలు గురించి చర్చించారు. స్పష్టమైన ఫలితాలను రాబట్టారు. జోనల్ వ్యవస్థకు కేంద్రం నుంచి తాజాగా క్లియరెన్స్ లభించగా.. ఉమ్మడి హైకోర్టు విభజన ప్రక్రియ కూడా త్వరలోనే కొలిక్కి రానున్నది. ఈ వారంలోనే హైకోర్టు విభజన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారిస్తుందని కేంద్రం హామీ ఇచ్చింది. ఆస్తులు, సంస్థల పంపకం అంశం కూడా పరిష్కారమవుతుందని, ఇందుకోసం హోంశాఖ సీనియర్ అధికారులను కేటాయిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌కు హామీ లభించింది. అదే విధంగా మహిళా సంఘాలకు వడ్డీ బకాయిలు కూడా విడుదల చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. వెనుకబడిన ప్రాంతాలకిచ్చే (బ్యాక్‌వర్డ్ రీజియన్స్ గ్రాంట్ ఫండ్- బీఆర్జీఎఫ్) నిధులను విడుదల చేయనుంది. దీనిపై ఉన్నతాధికారులకు త్వరలోనే ఆదేశాలివ్వనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమై రాష్ట్రంలో జాతీయ రహదారుల పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించనున్నారు.

హైకోర్టు విభజనపై..
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదివారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. విభజన హామీలు, సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాలు సమర్పించి చర్చించారు. ఉమ్మడి హైకోర్టు విభజనపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో దాదాపు 20 నిమిషాలు మాట్లాడారు. రాష్ర్టానికి సం బంధించిన పలు కేసులు ఉమ్మడి హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. హైకోర్టు విభజన విషయంలో కాలయాపన జరుగుతున్నదని, దీనిపై చాలాకాలంగా కేంద్రానికి విన్నవిస్తున్నామని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుచేసిన జోనల్ వ్యవస్థకు ఆమోదం తెలిపే విషయంలో చొరవ చూపినందుకు హోంమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన సీఎం కేసీఆర్.. హైకోర్టు విభజనపై సుదీర్ఘంగా చర్చించారు. సత్వరమే తేల్చేయాలని కోరారు. దానికి మంత్రి సానుకూలంగా స్పందించారు. హైకోర్టు విభజన కోసం కేంద్ర హోం, న్యాయశాఖల తరుపున సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని, దానిపై వారంరోజుల్లో విచారణ జరిగే అవకాశముందని రాజ్‌నాథ్ చెప్పారు. ఆస్తులు, సంస్థల పంపకం అంశం కూడా పరిష్కారమవుతుందని, ఇందుకోసం హోంశాఖ సీనియర్ అధికారులను కేటాయిస్తున్నట్టు సీఎం కేసీఆర్‌కు రాజ్‌నాథ్ చెప్పారు. రాష్ట్రంలో రీజినల్ రింగురోడ్డుకు నిధులు కేటాయించాలని, జాతీయ రహదారులను విస్తరించాలని, కొత్త సచివాలయం నిర్మాణం కోసం రక్షణశాఖ భూములు కేటాయించాలని ముఖ్యమంత్రి కోరారు. ఇందుకు అవసరమైన వ్యయాన్ని భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ విషయాన్ని ప్రధానికి కూడా వివరించామని తెలిపారు. రక్షణశాఖ భూముల కేటాయింపునకు సంబంధించి హోంశాఖ మంత్రికి వినతిపత్రాలు సమర్పించారు.
Tags:CM KCR,UnionMinisters Rajnath Singh,Arun Jaitley,High Court,Zonal System

Related posts

Leave a Comment