కల్లోల కేరళం కేరళను కమ్మిన మృత్యు మేఘాలు

కేరళను మృత్యు రుతుపవనాలు కమ్మేశాయి. గత వందేళ్లలో ఎప్పుడూలేని విధంగా తీవ్రమైన వరదలు రావడంతో రాష్ట్రం అతలాకుతలమయింది. పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం రాత్రి రాష్ట్రానికి చేరుకున్నారు. కేరళలో కేవలం గురువారం ఒక్క రోజునే 106 మంది ప్రాణాలు కోల్పోవడం ఇక్కడి దుస్థితిని తెలియజేస్తోంది. తొలుత దాదాపు 30 మంది చనిపోయారని భావించగా, శుక్రవారం నాటికి ఆ సంఖ్య భారీగా పెరిగింది. దీంతో గత పది రోజుల్లో మరణించిన వారి సంఖË్య 173కు చేరింది. రాష్ట్రంలోకి మే 29న నైరుతి రుతుపవనాలు ప్రవేశించగా, ఇంతవరకు 385 మంది దుర్మరణం చెందారని ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌ ప్రకటించారు. ఈ నెల ఎనిమిదో తేదీన నైరుతి రుతుపవనాల రెండో దశ ప్రారంభం కాగా, అప్పటి నుంచి భారీ వర్షాలు కురుస్తునే ఉన్నాయి. పది రోజులు గడిచినా తగ్గుముఖం పట్టకపోవడంతో జనజీవనం అస్తవ్యస్థమయింది. కాసరగోడ్‌ మినహా మిగిలిన 13 జిల్లాల్లో ప్రభుత్వం రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. మొత్తం 80 ఆనకట్టల గేట్లను ఎత్తివేసి నీటిని కిందికి విడుదల చేస్తున్నా వరద తీవ్రత తగ్గుముఖం పట్టలేదు.

తిరువనంతపురానికి మోదీ: దిల్లీలో మాజీ ప్రధాని వాజ్‌పేయీ అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రధాని మోదీ.. అనంతరం వాయుసేన ప్రత్యేక విమానంలో దిల్లీ నుంచి తిరువనంతపురానికి చేరుకున్నారు. శనివారం హెలికాప్టర్‌ ద్వారా వరద పరిస్థితిని ఆయన సమీక్షించనున్నారు. శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి విజయన్‌తో మోదీ ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గత రెండు రోజులుగా ఆయన ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నారు. రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్‌తో విజయన్‌ మాట్లాడి పరిస్థితి వివరించారు.
అదనపు సహాయానికి కేంద్రం సిద్ధం: కేరళకు అదనసంగా సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేబినెట్‌ కార్యదర్శి పి.కె.సిన్హా అధ్యక్షతన శుక్రవారం జరిగిన జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ (ఎన్‌సీఎంసీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకొంది. ఇప్పటికే 72 మరపడవలను పంపించగా, కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజ్ఞప్తి మేరకు అదనంగా మరికొన్ని పంపించనుంది.

రాజధానిలోనూ ఇంధనం కొరత: రాజధాని తిరువనంతపురంతో పాటు, చాలా చోట్ల పెట్రోలు, డీజిల్‌ నిల్వలు లేవు. ఇంధనం కోసం రాజధానిలోని పెట్రోలు బంకుల వద్ద వాహనాలు బారులు తీరాయి. సహాయ చర్యలు చేపట్టడం కోసం ప్రతి బంకులోనూ 3000 లీటర్ల డీజిల్‌, 1000 లీటర్ల పెట్రోలును తప్పనిసరిగా నిల్వ ఉంచాలని అధికారులు ఆదేశించారు. రన్‌వేలో నీరు నిలిచిపోవడంతో కోచి విమానాశ్రయాన్ని మూసివేశారు..వారం పాటు ఉచితంగా కాల్స్‌, డాటా సేవలు అందించనున్నట్టు టెలికాం కంపెనీలు ప్రకటించాయి.
శిబిరాల్లో 3.14 లక్షల మంది: పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 1568 పునరావాస శిబిరాల్లోకి 3.14 లక్షల మంది (70 వేలకు పైగా కుటుంబాలు)ని తరలించారు. రైల్వే శాఖ 1.20 లక్షల నీటి బాటిళ్లను సరఫరా చేసింది. 2.9 లక్షల లీటర్ల మంచినీటితో కాయంకులానికి ఓ ప్రత్యేక రైలును పంపించింది.

గర్భిణిని ఆదుకున్న నేవీ: వరదలో చిక్కుకున్న ఓ గర్భిణిని నేవీ ఆదుకుంది. తొలుత తాడు సాయంతో ఆమెను హెలికాప్టర్‌లోకి లాగే ప్రయత్నం చేశారు. ఆ తాడు గాలిలో ఊగడంతో ఆమె కింద పడిపోవడంతో గర్భానికి కాస్త దెబ్బ తగిలింది. నేవీ ఆసుపత్రిలో బాబుకు జన్మనిచ్చింది. ఇద్దరూక్షేమంగా ఉన్నారు.

ప్రవాస కేరళీయుల అభ్యర్థన: తమ వారిని ఆదుకోవాలంటూ ప్రవాస కేరళీయలు వాట్సాప్‌ ద్వారా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. తన తల్లిదండ్రులు అలువాలో రెండు రోజులుగా చిక్కుకున్నారని, వారిని కాపాడాలని ఆస్ట్రేలియాకు చెందిన సౌమ్య కోరారు. ఆసుపత్రిలోఆక్సిజన్‌ లేక మేరీ వర్ఘీస్‌ విషమ పరిస్థితిలో ఉన్నారంటూ మరొకరు సందేశాన్ని పంపారు. కేరళలోని చిన్నారుల కోసం.. వంద టన్నుల ఆహార పొట్లాలను పంపిస్తున్నట్లు కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనక గాంధీ తెలిపారు. శనివారం ఉదయం హైదరాబాద్‌ నుంచి వీటిని కేరళకు తరలించనున్నట్లు పేర్కొన్నాయి.

వైద్య సేవలకు ఆటంకం
కోచి: కేరళలో వైద్య సేవలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఎర్నాకులం, పత్తనంతిట్టా, త్రిస్సూర్‌, ఆలప్పుళా జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. పంబా నది నుంచి వచ్చిన వరద నీటితో పత్తనంమిట్టాలోని ముత్తూట్‌ ఆసుపత్రి సేవలకు ఆటంకం ఏర్పడింది. ఐసీయూల్లో ఉన్న రోగులను.. వేరే ఆసుపత్రులకు తరలించారు. 200 మంది రోగులను పట్టణంలోనే ఉన్న ముత్తూట్‌ ఆశ్రమానికి పంపించారు. ఎర్నాకులం సమీపంలో ఉన్న శ్రీనారాయణ ఆసుపత్రి నాలుగు, ఐదో అంతస్తుల్లో 600 మందికిపైగా చిక్కుకుపోయారు.

విపత్తుల నిర్వహణపై న్యాయస్థానానికి నైపుణ్యం లేదు
దిల్లీ: కేరళలో తలెత్తిన ప్రకృతి వైపరీత్యాన్ని ఎదుర్కోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత సంస్థలు సమర్థంగా, సమన్వయంతో పనిచేయాలని ధర్మాసనం సూచించింది. ఇలాంటి వరదల సమయంలో ఏంచేయాలో చెప్పే నైపుణ్యం న్యాయస్థానానికి లేదని తెలిపింది. కార్యనిర్వాహక వ్యవస్థే తగిన విధంగా వ్యవహరించాలని సూచించింది. వరద ప్రాంతాల్లో తీసుకుంటున్న సహాయక చర్యలను కేరళ తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది హరేన్‌ రావల్‌ వివరించారు. కేంద్రం కూడా ఉప సంఘాన్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోందని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ పి.ఎస్‌.నరసింహ తెలిపారు.

రైళ్ల రాకపోకలకు ఆటంకం
ఈనాడు, హైదరాబాద్‌: కేరళలో వర్షాల కారణంగా రైళ్ల రాకపోకలకు గురు,శుక్రవారాల్లోనూ ఆటంకం కలిగింది. 17న బయల్దేరిన హైదరాబాద్‌-త్రివేండ్రం సెంట్రల్‌ శబరి ఎక్స్‌ప్రెస్‌ (నం.17230)ను తిరుపతి వరకే పరిమితం చేశారు. 18న మంగళూరు నుంచి బయల్దేరాల్సిన కాచిగూడ మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌ (నం.17605) రద్దయ్యింది. కొల్లాం నుంచి విశాఖపట్నం మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌ (నం.18568)ను కొల్లాం-కోయంబత్తూరు స్టేషన్ల మధ్య రద్దుచేశారు.

సహాయక చర్యల్లో త్రివిధ దళాలు
వరదల కారణంగా చాలా గ్రామాలు దీవుల్లా మారిపోయాయి. పలు చోట్ల కొండ చరియలు విరిగి రోడ్లపై పడడంతో ఆయా ప్రాంతాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అక్కడి వారిని ఆదుకోవడంలో జాతీయ విపత్తు స్పందన దళాలు (ఎన్‌డీఆర్‌ఎఫ్‌), సైన్యం, వాయుసేన, నౌకా సేన సిబ్బంది అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ఇళ్ల పైకప్పులు, ఎత్తయిన ప్రదేశాలు, పడవులు వెళ్లలోని ప్రాంతాల్లో చిక్కుకున్నవారిని హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నావికా దళం 42 బృందాలను పంపించి 52 బోట్లను వినియోగిస్తోంది. కోస్టు గార్డు 28 బృందాలను, 30 బోట్లను పంపించింది. వాయుసేన 23 హెలికాప్టర్లు, 11 సరకు రవాణా విమానాలతో సేవలు అందిస్తోంది. సైన్యానికి చెందిన 10 కాలాల సిబ్బంది, 10 ఇంజినీరింగ్‌ టాస్క్‌ ఫోర్సు సిబ్బంది నిర్విరామంగా సేవలు అందిస్తున్నారు. వారు కూడా 53 మిలటరీ బోట్లను తీసుకొచ్చి సహాయక చర్యలు చేపడుతున్నారు. మారుమూల ప్రాంతాలను అనుసంధానం చేసేలా 38 తాత్కాలిక వంతెనలు నిర్మించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌కు చెందిన 51 బృందాలు పనిచేస్తున్నాయి.

ఇంట్లో శవం… ఇంటి చుట్టూ జలం
కేరళలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో జనం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ క్షణాలు లెక్కపెడుతున్నారు. ‘రక్షించండి… రక్షించండి…’ అన్న ఆర్తనాదాలతో గొంతులు అలసి సొలసిపోయారు. పతనమిత్తట్ట జిల్లాలోని అరాన్‌ములాలో ఓ ఇల్లు మొదటి అంతస్తువరకూ నీళ్లు చేరాయి. మొదటి అంతస్తులు వృద్ధురాలైన తన భార్య మృతదేహంతో ఆమె భర్త పడిగాపులు కాస్తున్నారు. మరో ఇంట్లో శవపేటిక వరదలో కొట్టుకుపోకుండా దానికి తాడు కట్టి మృతదేహాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పదుల సంఖ్యలో నెలలు నిండిన మహిళలు పురిటి నొప్పులతో బాధపడుతున్నారు. వారిని ఆసుపత్రులకు తరలించేందుకు ఇప్పటివరకూ ఎలాంటి చర్యలూ కానరాలేదు. అత్యవసర సహాయ కేంద్రాలకు సాయం చేయండంటూ వరదలా వస్తున్న ఫోన్లలో చాలామటుకు ఇలాంటి పరిస్థితికి అద్దం పడుతున్నవే!

Related posts

Leave a Comment