ఒంటిపై 6 కోట్ల విలువైన నగలు.. గోల్డెన్ బాబా ఈజ్ బ్యాక్!

ఒంటిపై 20 కిలోల బంగారం.. చేతికి 27 లక్షల విలువైన రోలెక్స్ వాచ్.. ఓ బీఎండబ్ల్యూ కారు, మూడు ఫార్చునర్లు, రెండు ఆడి, రెండు ఇన్నోవా కార్లు.. ఇది ఏ కుబేరుడి దగ్గరో ఉన్న వస్తువల జాబితా కాదు. ఓ బాబా దగ్గరున్న సొత్తు. గోల్డెన్ బాబాగా పేరుపొందిన సుధీర్ మక్కర్ ఈసారి కన్వర్ యాత్రతో మరోసారి వార్తల్లోకి వచ్చాడు. హరిద్వార్ నుంచి ఢిల్లీకి 200 కిలోమీటర్ల మేర ప్రతి ఏడాది ఈ గోల్డెన్ బాబా యాత్ర చేస్తాడు. ఇప్పుడీ యాత్ర 25వ ఏట అడుగుపెట్టింది. ఈ యాత్రలో భాగంగా సుధీర్ ఒంటిపై 20 కిలోల బంగారం ధరించాడు. ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం దీని విలువ రూ.6 కోట్లుగా ఉంది.

ప్రతి యాత్ర సందర్భంగా కన్వర్ దగ్గరున్న బంగారు నగలు పెరిగిపోతూనే ఉన్నాయి. 2016లో 12 కేజీలతో, 2017లో 14.5 కేజీల బంగారంతో అతను ఈ యాత్ర చేశాడు. యాత్రలో భాగంగా భక్తులు ఈ బంగారాన్ని గోల్డెన్ బాబాకు ఇచ్చేస్తుంటారు. ఇలా గతేడాది 21 గోల్డ్ చెయిన్లు, 21 దేవుడి లాకెట్లు, బ్రేస్‌లెట్స్, గోల్డ్ జాకెట్‌లు కూడా వచ్చాయి. ఓ ఎస్‌యూవీ వెహికిల్‌పై కూర్చొని గోల్డెన్ బాబా ఈ యాత్ర చేస్తుంటాడు. నా దగ్గరున్న కొత్త చెయిన్ బరువు 2 కిలోలు. ఈసారి ఎక్కువ బరువున్న బంగారం వేసుకోవడం లేదు. దీనివల్ల నా మెడ నరాలు దెబ్బతిన్నాయి. ఒక కంటి చూపు మందగించింది. పైగా ఇదే నా చివరి కన్వర్ యాత్ర అని సుధీర్ స్పష్టంచేశాడు.

ఈ యాత్రలో భాగంగా లగ్జరీ కార్ల కాన్వాయ్ ఇతని వెంట ఉంటుంది. అప్పుడప్పుడు హమ్మర్, జాగ్వార్, లాండ్ రోవర్‌లాంటి ఖరీదైన కార్లను రెంట్‌పై తీసుకొని వెళ్తాడు. తనకు బంగారంపై ఉన్న మోజు తగ్గదని, 1972లో తులానికి 200 ఉన్నప్పటి నుంచీ బంగారం ధరిస్తున్నానని ఈ గోల్డెన్ బాబా చెబుతున్నాడు. తాను చచ్చిపోయే వరకు ఈ బంగారమంతా తన దగ్గరే ఉంటుందని, చనిపోయే సమయంలో తనకు నచ్చిన భక్తుడికి ఈ బంగారమంతా ఇస్తానని అతను అన్నాడు. ఆధ్యాత్మికత వైపు రాకముందు సుధీర్ మక్కర్ ఓ బట్టల వ్యాపారం చేస్తుండేవాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు కోట్లకు అధిపతిగా మారాడు.

Related posts

Leave a Comment