ట్రాన్స్‌జెండర్లకు మేనకాగాంధీ క్షమాపణలు

కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ ట్రాన్స్‌జెండర్లకు క్షమాపణలు తెలిపారు. ఇటీవల ఆమె లోక్‌సభలో మానవ అక్రమ రవాణా అరికట్టే విషయంపై మాట్లాడుతూ ట్రాన్స్‌జెండర్లను ‘ది అదర్‌ వన్స్‌(ఇతరులు)’ అని అన్నారు. దీంతో తోటి ఎంపీలు కొందరు నవ్వారు. దీనిపై ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. తమను అవమాన పరిచేలా మాట్లాడారని ఆమె క్షమాపణలు చెప్పాలని ఆ సంఘానికి చెందిన మీరా సంఘమిత్ర డిమాండ్‌ చేశారు. మేనకాగాంధీతో పాటు సభలో నవ్విన ఎంపీలంతా కూడా క్షమాపణలు చెప్పాలని కోరారు.

ఈ ఘటనపై స్పందించిన మేనకా గాంధీ ట్రాన్స్‌జెండర్లను క్షమాపణలు కోరారు. తాను కావాలని అలా అనలేదని, ట్రాన్స్‌జెండర్లను అధికారికంగా ఏమనాలో తనకు అవగాహన లేకపోవడం చాలా ఇబ్బందికరంగా అనిపిస్తోందని ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘మానవ అక్రమ రవాణా బిల్లు 2018పై చర్చ సమయంలో లోక్‌సభలో ‘అదర్‌ వన్స్‌’ అనే పదం వాడినందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను. నేను నవ్వలేదు. అవగాహన లేకపోవడం పట్ల సిగ్గు పడుతున్నాను. ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీని అధికారికంగా ఏమంటారో నాకు తెలియదు. ఇక మీదట అలాంటి తప్పు జరగదు. అధికారిక సంభాషణల్లో ఎప్పుడైనా ట్రాన్స్‌జెండర్స్‌కు ‘టీజీస్’‌ అనే పదం వాడతాను’ అని మేనక ట్వీట్‌ చేశారు. మానవ అక్రమరవాణా వ్యతిరేక బిల్లు 2018 లింగ తటస్థంగా ఉంటుందని, అందరికీ రక్షణ కల్పిస్తుందని మేనక హామీ ఇచ్చారు.

Related posts

Leave a Comment