బండి తిండి.. ఆరోగ్యానికి గండి

నగరవాసుల ఆహార అలవాట్లు మారుతున్నాయి.. ‘బండి తిండి’కి అలవాటు పడాల్సి వస్తోంది. పని ఒత్తిడి.. గంటలతరబడి ప్రయాణం.. ఇలా కారణాలు ఏవైనా కడుపు నింపుకొనేందుకు.. రోడ్డు పక్కన తోపుడు బండ్లపై దొరికే ఆహారమ్మీద ఆధార పడుతున్నారు. నగరంలోనూ ఈ తరహా చిరు వ్యాపారులు పెరిగిపోయారు. కొందరైతే మధ్యాహ్నం భోజనాన్నీ అందిస్తున్నారు. ఈ తిండి ఆరోగ్యకరం కాదని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) హెచ్చరిస్తోంది. రహదారుల పక్కన లభించే ఆహారపదార్థాలు ఎంతవరకు ఆరోగ్యకరమనే అంశాన్ని ఎన్‌ఐఎన్‌ గతంలో పరీక్షించింది. కోసి ఉంచిన ఉల్లిపాయలు, మిరపకాయలు, మూతల్లేని ఆహార నిల్వ పాత్రలతో రోగాల బారిన పడే ప్రమాదం ఉందని సర్వే అనంతరం స్పష్టం చేసింది. ఈ ఆహారం తయారీ, సరఫరాలో శుచి, శుభ్రత పాటించడం లేదని, రోగాల బారిన పడే ప్రమాదం ఉందని పేర్కొంది. ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో బండి తిండి విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
శిక్షణ అవసరం..
దిల్లీలో తోపుడు బండ్ల మీద తినుబండారాలు అమ్ముకునే వ్యాపారులకు ప్రభుత్వ యంత్రాంగం చొరవ తీసుకొని శుచి… శుభ్రత నేర్పింది. ఇందుకోసం ప్రత్యేక శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది. స్టార్‌ హోటల్‌ నుంచి కాకా హోటల్‌ వరకూ గుర్తింపు లేనిదే ఆహారం అమ్మరాదనే నిబంధన పెట్టిన జీహెచ్‌ఎంసీ.. మరెందుకో రోడ్డుపక్కన అమ్మేవారు నిబంధనలు ఉల్లంఘిస్తున్నా పట్టించుకోవడంలేదు. వారికి శిక్షణ ఇవ్వాలనే ధ్యాస కొరవడింది. క్షేత్రస్థాయిలోని జీహెచ్‌ఎంసీ అధికారులకు ఈ వ్యాపారాలు అక్రమ ఆదాయవనరుగా మారాయి. ఎంతో కొంత మామూళ్లు దండుకొని.. చూసీచూడనట్లు వదిలేస్తూ నగరవాసులను ఆనారోగ్యంపాలు చేస్తున్నారు. ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ), ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌(ఐహెచ్‌ఎం), నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట వంటి సంస్థల సహకారంతో వీధుల్లో తిండి అమ్మే వ్యాపారులకు శిక్షణ ఇప్పించడంపై దృష్టి సారించడం అవసరం.

ఎన్‌ఐఎన్‌ సూచనలివే..
* రహదారులు పక్కన తోపుడు బండ్ల నిర్వాహకులు తప్పనిసరిగా చేతులకు గ్లౌజులు ధరించాలి.
* దుమ్ము ఉన్న ప్రాంతం, మురుగు కాల్వల పక్కన బండిని ఉంచి తిండి పెట్టవద్దు.
* ప్రతి వంటకం మీద తప్పనిసరిగా మూతలు వేసే ఉంచాలి.
* ముందుగానే ఉల్లిగడ్డలు, మిరపకాయలు, కొత్తిమీర కోసి ఉంచవద్దు.
* వంట చేసేవారు, పానీపూరి, తినుబండారాలు అందజేసేవారు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
* ఆరోగ్యకరమైన వంటలు చేసి.. వడ్డించేలా వారికి శిక్షణ ఇప్పించాలి. స్టార్‌ హోటల్లో మాదిరి నెత్తిన క్యాప్‌(టోపీ) ఉండాలి. వినియోగదారులున్నప్పుడే గ్లౌజులు వేసుకోవడం.. తర్వాత తీసి పక్కన పెట్టడం.. మళ్లీ వినియోగించడం చేయకూడదు.
* శుద్ధి చేసిన నీటిని అందించాలి.
* జీహెచ్‌ఎంసీ ఆహార తనిఖీ బృందాలు తరచూ పరిశీలించి.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తున్నారా.. లేదా అనేది పరిశీలించాలి.

Related posts

Leave a Comment