చూపులేనివారిని చదివిస్తా!

పుట్టిన బిడ్డ ప్రపంచం చూడలేడని తెలిసి ఆ తల్లి గుండెలవిసేలా ఏడ్చింది. కానీ అది తాత్కాలికమే. ఆ బాధను మనసులోనే దాచుకుని కొడుకు బాగోగులపై దృష్టిపెట్టింది. ఆ సమయంలోనే అలాంటి పిల్లలకోసం ఏదైనా చేయాలనుకుంది. అలా ఆమె ప్రారంభించిందే ‘ద్వారకామాయి’ అంధుల పాఠశాల. యాభైమంది చూపులేని అనాథ పిల్లలకు అమ్మగా మారింది. ఆమే విజయనగరానికి చెందిన ఆశాజ్యోతి.

ఆ పిల్లలకు చదువొక్కటే కాదు, భోజన, వసతులను ఉచితంగా అందించడం కాస్త కష్టమైనా చేస్తున్నా. ఇదంతా ఎలా మొదలైందంటే… మా మేనమామ రవికుమార్‌ది రాజమండ్రికి దగ్గర్లోని కిర్లంపూడి. 1998లో మా పెళ్లి జరిగింది. ఆయనది చిన్న ఉద్యోగమే. రెండేళ్లకు బాబు పుట్టాడు. హరిస్మరణ్‌ అని పేరు పెట్టుకున్నాం. అయితే పుట్టే సమయంలో బాబు ఉమ్మనీరు మింగడంతో అది మెదడులోకి చేరింది. దీని ప్రభావం బాబు మానసిక ఎదుగుదలపై పడింది. అయిదేళ్ల వరకూ ఎవరినీ గుర్తుపట్టలేదు. మాట లేదు. నడకా లేదు. ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియని పరిస్థితి. తన చూపులోనూ తేడా కనిపిస్తుండటంతో కంగారుపడుతూ కంటి వైద్య నిపుణులకు చూపించాం. మా అనుమానం నిజమైంది. బాబుది రెటీనా పిగ్మెంటేషన్‌ సమస్య అనీ… చూపు పోతుందని చెప్పారు.

అన్నీ నేనే అయ్యా…
బాబు ఆరోగ్యం గురించి కొన్నాళ్లు బెంగపడ్డా కానీ… తరువాత వాడికాళ్లపై వాడు నిలబడేలా పెంచాలని నిర్ణయించుకున్నా. నెమ్మదిగా వాడి పనులు వాడు చేసుకునేలా శిక్షణ ఇచ్చా. మాటలూ, నడకా నేర్పించా. బాబులో కాస్త మార్పు వచ్చాక ఓ పాఠశాలలో చేర్పించా. రెండేళ్లుగా అక్కడే చదువుకున్నాడు. ఆ తరువాతే సమస్య ఎదురైంది. మా వాడు ఏదైనా చెబుతాడే తప్ప రాయలేడు. అందుకే తరువాత వాడిని విజయనగరంలోని ఓ అంధుల పాఠశాలలో చేర్పించా. ప్రతిరోజు నేనూ పాఠశాలకు వెళ్లేదాన్ని. దాంతో అక్కడి పిల్లలు కూడా నాకు దగ్గరయ్యారు. నేను ఒక్కరోజు రాకపోయినా మర్నాడు ఎందుకు రాలేదంటూ అడిగేవారు. అంతలా వారికి దగ్గరయ్యా. ఇంతలో ఆ పాఠశాలను భీమిలికి తరలిస్తున్నామని చెప్పారు. అంతదూరం బాబును పంపించలేను. దానికితోడు ఇతర పిల్లల పరిస్థితి ఏంటనేదీ ఆలోచించా.

డిగ్రీ చదువుతున్నారు…
చివరకు నేనే నా బిడ్డ లాంటివారికోసం ఓ పాఠశాల పెట్టాలని అనుకున్నా. మా వారూ ప్రోత్సహించడంతో మాకు దగ్గర్లోని కుసుమ హరనాథ క్షేత్రం, పూల్‌బాగ్‌లో 16 మంది పిల్లలతో ద్వారకామాయి అంధుల పాఠశాల ప్రారంభించా. మా అమ్మ కూడా నాకు అండగా నిలబడింది. వాళ్లందరికీ ఉచిత వసతి, భోజనం సదుపాయం కల్పించా. అధికారుల నుంచి ఒకటి నుంచి ఏడో తరగతి వరకు అనుమతీ తెచ్చుకున్నా. మరుసటి ఏడాదే ఎనిమిది నుంచి పదోతరగతికి బోధన మొదలుపెట్టాం. క్రమంగా విద్యార్థుల సంఖ్యా పెరిగింది. గ్రామాల్లో తిరిగి చూపులేనివారిని గుర్తించి మా పాఠశాలకు తీసుకొచ్చేదాన్ని. ప్రస్తుతం 50 మంది పిల్లలున్నారు .వారిలో ముగ్గురు ఇంటర్‌, ఇద్దరు డిగ్రీ చదువుతున్న విద్యార్థులున్నారు.

సొంత ఖర్చులతోనే…
ఈ బడి ప్రారంభించిన రెండేళ్ల వరకూ సొంత ఖర్చులతో నెట్టుకొచ్చాం. నెలకు సుమారు లక్షా డెబ్భై వేలవరకూ ఖర్చుయ్యేది. ఇది భారమే అయినా ఎవరినీ చేయిచాచి డబ్బులు అడగలేదు. క్రమంగా మేం చేస్తున్న కార్యక్రమాలు చూసి చాలామంది దాతలు ముందుకువచ్చారు. ఉపాధ్యాయులూ, సిబ్బంది అంతా కలిసి 14 మంది ఉన్నారు. పిల్లల్లో తమకు చూపులేదనే భావన రాకూడదని, వారూ మిగతావారితో సమానమని చెప్పడానికి అన్ని అంశాల్లోనూ శిక్షణ ఇస్తున్నాం. కంప్యూటర్‌ కూడా నేర్పిస్తాం. నాట్యం, నాటికలూ, యోగా… వంటి అంశాల్లోనూ శిక్షణ ఇప్పిస్తున్నాం. వీళ్లందరితో 2017లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారి ముందు ప్రదర్శన ఇప్పించా. పండగలన్నీ వారితోనే. ఏడాదికి రెండుసార్లు పిక్నిక్‌ కూడా ఉంటుంది.

కాలేజీలో చేర్పించా…
మా దగ్గర పదోతరగతి వరకే ఉంది. ఇంటర్‌ చదవాలంటే వేరే కాలేజీకి వేరే ప్రాంతానికి వెళ్లాలి. అది వాళ్లకు కష్టమే. అందుకే కిందటి సంవత్సరం పదోతరగతి పూర్తి చేసుకున్న ముగ్గురిని పట్టణంలోని కళాశాలలో చేర్పించా. వీళ్లు రోజూ ద్వారకామాయిలోనే ఉంటూ కళాశాలకు వెళ్లివస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అంధుల కాలేజీ హైదరాబాద్‌లోనే ఉంది. అక్కడికి వెళ్లలేక చాలామంది మధ్యలోనే చదువు ఆపేస్తున్నారు. ఇది తెలిశాకే కాలేజీ కూడా తెరవాలనుకుంటున్నా. విద్యార్థులు మా నుంచి బయటకు వెళ్లేలోపు ఏదో ఒక రంగంలో స్థిరపడాలని, వారి సొంత కాళ్లపై నిలబడేలా చేయాలనేది నా లక్ష్యం.

Related posts

Leave a Comment