సలాం జవాన్‌..

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: సరిగ్గా 19ఏళ్ల క్రితం ఇదే రోజు శత్రుదేశంపై భారత్‌ అఖండ విజయాన్ని సాధించింది. మాతృభూమిలోకి చొరబడిన ముష్కరులపై భారత జవాన్లు 60 రోజుల పాటు పోరాటం సాగించి దేశానికి విజయాన్నిఅందించారు. అదే కార్గిల్‌ యుద్ధం.. వందల మంది సైనికుల ప్రాణత్యాగ ఫలం. నేడు జులై 26.. కార్గిల్‌ విజయ్ దివస్‌. 1999 మే నెలలో మొదలైన కార్గిల్‌ యుద్ధం రెండు నెలల పాటు సాగి జులై 26న భారత జయభేరీతో ముగిసింది. దీంతో ఈ రోజును కార్గిల్‌ విజయ్‌ దివస్‌గా జరుపుకొంటున్నాం.

కార్గిల్‌ దివస్‌ను పురస్కరించుకుని ఇటీవల భారత ఆర్మీ ఓ వీడియోను విడుదల చేసింది. శత్రుదేశ సైనికులపై భారత జవాన్లు జరిపిన పోరును ‘ది అన్‌టోల్డ్‌ స్టోరీ – కార్గిల్‌ 1999’ పేరుతో వీడియో రూపంలో దేశ ప్రజలకు తెలియజేసింది. ‘భూమికి 18000 అడుగుల ఎత్తులో.. శరీరమే గడ్డకట్టే మంచులో.. కేవలం శత్రువులతో పోరాడం ఒకటే సవాల్‌ కాదు.. తాత్కాలిక జ్ఞాపకశక్తిని కోల్పోవడం.. ఇంకా ఎన్నో విపత్కర పరిస్థితులు.. వీటన్నింటినీ పక్కనబెట్టి దేశ జవాన్లు లద్దాఖ్‌ సరిహద్దుల్లో నిరంతర గస్తీ చేపడుతున్నారు..’ అంటూ ఈ వీడియో ప్రారంభమైంది.

ఇందులో కార్గిల్‌ యుద్ధం నాటి పరిస్థితులు, ఆ సయమంలో లద్దాఖ్‌ వద్ద జవాన్లు పోరాడిన తీరును వారి మాటల్లోనే చెబుతూ దృశ్యరూపంలో వివరించారు. ఈ వీడియోను మే 30న ఇండియన్‌ ఆర్మీ విడుదల చేసింది. నేడు కార్గిల్‌ దివస్‌ సందర్భంగా ఈ వీడియో మరోసారి వైరల్‌గా మారింది.

భారత్‌, పాకిస్థాన్‌ మధ్య 1999 మే నుంచి జులై 26 వరకు కార్గిల్‌ యుద్ధం జరిగింది. 1999 మే 3న భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన శత్రుదేశం సైనికులు కార్గిల్‌ వైపు చేరుకున్నారు. దీంతో అప్రమత్తమైన భారత ఆర్మీ.. వ్యూహరచనలు చేసింది. పాక్‌ సైనికులతో సుదీర్ఘ పోరాటం సాగించింది. ఎట్టకేలకు జులై 26న పాక్‌ సైనికులను తరిమికొట్టడంతో భారత్‌ కార్గిల్‌ యుద్ధంలో విజయం సాధించింది. ఈ పోరాటంలో 700 మంది(అధికారికంగా 527మంది) భారత జవాన్లు వీరమరణం పొందారు. 1300 మందికి పైగా గాయపడ్డారు.

Related posts

Leave a Comment