పాక్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో 103 స్థానాల్లో పీటీఐ ముందంజ
59 స్థానాల్లో నవాజ్‌షరీఫ్ పార్టీ 34 స్థానాల్లో పీపీపీ
హింసాత్మక సంఘటనల మధ్య ముగిసిన ఓటింగ్
ఆత్మాహుతి దాడిలో 31 మంది మృతి
పాకిస్థాన్‌లో ప్రజలు మార్పు కోరుకున్నారు. దేశ 70 ఏళ్ల చరిత్రలో ప్రజాస్వామ్య బద్ధంగా జరుగుతున్న రెండో అధికార బదిలీ ప్రక్రియలో పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ (పీటీఐ)వైపు ఎక్కువ మంది ఓటర్లు మొగ్గు చూపారు. బుధవారం జాతీయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ప్రముఖ మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్ నేతృత్వంలోని పీటీఐ అధిక స్థానాల్లో దూసుకుపోతోంది. 272 స్థానాలకు నేరుగా ఎన్నికలు జరగ్గా, 252 స్థానాల్లో ఫలితాల సరళి వెల్లడయింది. కడపటి సమాచారం అందేసరికి ఇమ్రాన్ పార్టీ 103 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇటీవల ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పడే వరకు అధికారంలో ఉన్న పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) 59 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మాజీ అధ్యక్షుడు జర్దారీ పార్టీ అయిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) 34 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. హంగ్ పార్లమెంట్ ఏర్పడితే పీపీపీ-కింగ్‌మేకర్ పాత్ర పోషించే పరిస్థితి కనిపిస్తోంది. స్వతంత్ర అభ్యర్థులు 18 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. సంప్రదాయ మత పార్టీల కూటమి ముతాహిద మజ్లిస్ ఎ అమల్(ఎంఎంఎ) అభ్యర్థులు 12 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలోని 272 సాధారణ స్థానాలకు 3,459 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. పంజాబ్, సింధ్, బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్సుల్లో 577 సాధారణ స్థానాలకు 8,396 మంది పోటీ పడ్డారు. 30కి పైగా పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దించాయి.
172 స్థానాలు సాధిస్తే అధికారం: జాతీయ అసెంబ్లీలో మొత్తం 342 మంది సభ్యులుంటారు. అందులో 272 మందిని నేరుగా ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎన్నుకుంటారు. 60 స్థానాలు మహిళలకు, పది స్థానాలు మతపరంగా అల్పసంఖ్యాక వర్గాలకు కేటాయించారు. 5% పైగా ఓట్లు వచ్చిన పార్టీలకు దామాషా పద్ధతిన స్థానాలు కేటాయించి, వీరిని ఎంపిక చేస్తారు. మొత్తం 172 స్థానాలు సాధించిన పార్టీయే అధికారంలోకి వస్తుంది. ఏకైక అతిపెద్ద పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 137 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు నేరుగా ఎన్నికై ఉండాలి.
ఫలితాల సరళి…
పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో పీఎంఎల్-ఎన్ 131 స్థానాల్లో, పీటీఐ 112 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. సింధ్ ఎన్నికల్లో పీపీపీ 60 స్థానాల్లో ముందంజలో ఉండి అతి పెద్ద పార్టీగా అవతరిస్తోంది. పీటీఐ 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఖైబర్ పఖ్తున్ఖ్వా ఎన్నికల్లో పీటీఐ 88 స్థానాల్లో ముందంజలో ఉంది. అవామీ నేషనల్ పార్టీ 6 చోట్ల ఆధిక్యంలో ఉంది. దేశ వ్యాప్తంగా 10.6 కోట్ల మంది ఓటర్లుగా తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఉదయం 8కి 85వేలకు పైగా పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ ప్రారంభమయింది. ఓటింగ్ ముగిసిన వెంటనే సాయంత్రం 6కు అక్కడికక్కడే ఓట్ల లెక్కింపు మొదలయింది. పాకిస్థాన్ సైన్యాధిపతి కమర్ జావెద్ బజ్వా తన ఓటు హక్కును రావల్పిండిలో ఉపయోగించుకున్నారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) అధ్యక్షుడు షాబాజ్ షరీఫ్ లాహోర్‌లో ఓటు హక్కు ఉపయోగించుకున్నారు. పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాద్(పీటీఐ) అధిపతి ఇమ్రాన్‌ఖాన్, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ సహాధ్యక్షుడు బిలావల్ భుట్టో, ముంబయి దాడుల ప్రధాన సూత్రధారి, జమాత్ ఉద్ దవా అధిపతి హఫీజ్ సయీద్ తదితరులు తమ నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఓటింగ్ సమయం పెంపునకు నిరాకరణ:
ఓటింగ్ సమయాన్ని గంటపాటు పొడిగించాలని ప్రధాన పార్టీలు చేసిన విజ్ఞప్తిని పాకిస్థాన్ ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. పలు నియోజకవర్గాల్లో ఓటింగ్ మందగమనంతో ఉన్నందున సమయం పొడిగించాలని పార్టీలు విజ్ఞప్తి చేశాయి. అంతకుముందు పాకిస్థాన్ సైన్యాధిపతి కమర్ జావెద్ బజ్వా ట్విట్టర్లో స్పందిస్తూ పాక్‌ను హానికర శక్తులు లక్ష్యంగా చేసుకున్నాయని, ఆ శక్తులను ఓడించే ప్రయత్నంలో చాలా ముందంజ వేశామని, వాటిని ఓడించడానికి ఏకతాటిపై ఉన్నామని అన్నారు. ఇమ్రాన్‌ఖాన్ పార్టీకి సైన్యం మద్దతుగా నిలబడి, ప్రత్యర్థి పార్టీలను లక్ష్యంగా చేసుకుందన్న ఆరోపణల మధ్య జరిగిన ఈ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠను కలిగించాయి. పీఎంఎల్-ఎన్ అధిపతి, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు అవినీతి ఆరోపణలపై ఇటీవలే కారాగార శిక్ష విధించిన నేపథ్యంలో ఈ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఉగ్రవాద సంస్థలు పాల్గొనడానికి అనుమతి ఇవ్వడంపైనా వివాదం చెలరేగింది. అతివాద నాయకులు, మతవిద్వేషాలను రెచ్చగొడుతున్న నాయకులు పలువురు బరిలో నిలిచారు. ముంబయి ఉగ్రవాద దాడి ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్ నేతృత్వంలోని జమాత్ ఉద్ దవా అభ్యర్థులు చాలా మంది ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. హింసాత్మక సంఘటనల మధ్య పాకిస్థాన్ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ మొదలయిన కొద్ది గంటల తర్వాత ఐసిస్ ఆత్మాహుతి బాంబర్ ఒకరు బలూచిస్థాన్ రాజధాని క్వెట్టాలోని భోసా మండి ప్రాంతంలో పేల్చేసుకున్నాడు. ఈ దాడిలో పోలీసులు సహా 31 మంది మరణించారు. వేర్వేరు సంఘటనల్లో జరిగిన ఘర్షణల్లో మరో నలుగురు మరణించారు.