గోదారిలో దొరకని ఆచూకీ ప్రతికూల పరిస్థితుల్లోనూ గాలింపు చర్యలు

తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పశువుల్లంక వద్ద శనివారం గల్లంతయిన ఏడుగురిలో ఒక యువతి మృతదేహం బయటపడింది. ఆరుగురు విద్యార్థినుల ఆచూకీ తెలియాల్సి ఉంది. రెండు రోజుల నుంచి గోదావరిలో ఉన్న ప్రతికూల పరిస్థితులు గాలింపునకు సహకరించడం లేదు. ప్రమాదం జరిగిన చోటుకు దిగువన యానాం వద్ద ఆదివారం ఉదయం ఆరింటినుంచే విపత్తు నిర్వహణ సిబ్బంది, గజ ఈతగాళ్లు విస్తృతంగా గాలింపు చేపట్టారు. అర్ధరాత్రి నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో గాలింపునకు ఇబ్బందులు ఎదురయ్యాయి. వాటికి ఎదురీదుతూ వంతులవారీగా బృందాలు గాలిస్తున్నాయి. విశాఖలోని ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌ కూడా రంగంలోకి దిగింది. డోర్నియర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌, హెలీకాప్టర్‌, నేవీ డైవింగ్‌టీంలు శనివారం సాయంత్రం ఇక్కడికి వచ్చాయి.

ఆదివారం ఉదయం నుంచి వారు కూడా గాలిస్తున్నారు. మరో నేవీ హెలీకాప్టర్‌ యూహెచ్‌-3హెచ్‌ కూడా సేవలందిస్తోంది. రాష్ట్ర హోంమంత్రి చినరాజప్పతో సహా ఆయా శాఖల ఉన్నతాధికారులు వర్షంలోనే తడుస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇదే క్రమంలో సాయంత్రం ఆరింటి ప్రాంతంలో కొమరగిరి వద్ద నదిలో తేలియాడుతున్న మృతదేహాన్ని స్థానికులు గమనించి అధికారులకు సమాచారమిచ్చారు. ఐ.పోలవరం మండలంలోని శేరిలంకకు చెందిన యువతి గెల్లా నాగమణి(30)గా ఆమెను అధికారులు గుర్తించారు. పడవ ప్రమాదంలో గల్లంతైన మహిళగా నిర్ధరించారు. ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం ఆదివారం ఉదయానికి 9.50 అడుగులకు చేరింది. 3.23లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెట్టారు. దీంతో యానాం వద్ద వరద ఉద్ధృతి పెరిగింది. మరోవైపు సముద్రం దగ్గరలోనే ఉండటంతో ఆటుపోట్లు ఏర్పడి గాలింపునకు ఇబ్బందులేర్పడుతున్నాయి.

దిగువకు వెళ్లిపోతాయని…
గోదావరి ప్రవాహం ఉద్ధృతంగా ఉన్నందున గల్లంతయిన వారు పైకి తేలకుండా నీళ్లలోనుంచే సముద్రం వద్దకు వెళ్లిపోయే అవకాశాలున్నాయని స్థానికులు కొందరు చెబుతున్నారు. ఇలా అయితే వారి ఆచూకీ తెలియడం కష్టమేనని అంటున్నారు. ఇలాంటి ఇబ్బంది ఉంటుందని ముందుగానే గ్రహించిన అధికారులు ప్రమాదం జరిగిన ప్రాంతంలో కాకుండా పది కిలోమీటర్ల దిగువన బేస్‌క్యాంపు ఏర్పాటుచేసి రక్షణ చర్యలు చేపట్టారు. అక్కడినుంచి కూడా ముందుకు వెళ్లిపోయి ఉండవచ్చని మత్య్సకారులు భావిస్తున్నారు. సముద్రం దగ్గరలోకి వెళ్లి లంకల్లో తేలితే సమాచారం రావడం కష్టమేనని పేర్కొంటున్నారు.

గల్లంతయిన వారంతా విద్యార్థినులే..
ప్రమాదంలో గల్లంతయిన వారంతా ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో చదివే నిరుపేద బాలికలే. ఈ ప్రమాదం వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. పక్కపక్కనే ఉన్న మూడు లంకలకు చెందిన ఏడుగురు ఒకేసారి ప్రమాదంలో చిక్కుకోవడంతో ఆ గ్రామాలన్నీ శోకసంద్రంలో మునిగిపోయాయి.

బాధిత కుటుంబాలకు సాయం
ప్రమాదంలో గల్లంతయిన వారి కుటుంబాలకు నష్టపరిహారం అందిస్తామని హోంమంత్రి చినరాజప్ప తెలిపారు. చంద్రన్న బీమా కింద పెద్దవారికి రూ.ఐదు లక్షలు, బీమా వర్తించని పిల్లలకు రూ.మూడు లక్షల చొప్పున పరిహారం ఇవ్వడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారని తెలిపారు. ప్రస్తుతం ప్రమాదం జరిగిన చోట వంతెన నిర్మాణం పూర్తి చేస్తామని, దీనికోసం తమ ప్రభుత్వం రూ.35కోట్లు కేటాయించిందని తెలిపారు. గత ప్రభుత్వం వంతెనకు శంకుస్థాపన చేసి అరకొర నిధులే కేటాయించిందని తెలిపారు. నరసాపురం, కోటిపల్లి వద్ద కూడా వంతెనల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. నాటుపడవలను పూర్తిగా నిలిపివేయడానికి ఆదేశాలు జారీ చేస్తామని అన్నారు. అవసరమైతే పంటుల ద్వారా రాకపోకలు సాగించేలా చర్యలు చేపడతామన్నారు. అనుమతి లేనిదే గోదావరిలో బోట్లు, నాటుపడవలను నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆదివారం సాయంత్రం ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు కూడా సంఘటన స్థలికి వచ్చారు. రాత్రి కూడా గాలింపు కొనసాగుతుందని తెలిపారు.

ప్రభుత్వం సమాధానం చెప్పాలి: పురంధేశ్వరి
పడవ ప్రమాదంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కేంద్ర మాజీ మంత్రి, భాజపా నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కాకినాడలో డిమాండ్‌ చేశారు. తమకున్న సమాచారం మేరకు రెండో శనివారం సెలవు దినమైనప్పటికీ చిన్నారులను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వనం-మనం కార్యక్రమానికి తీసుకెళ్లి.. తిరిగి తీసుకువస్తుండగా ప్రమాదం జరిగిందని అన్నారు.

Related posts

Leave a Comment