ఈసారి మస్తు వానలు

తూర్పు, ఈశాన్య రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం
రెండో ముందస్తు అంచనాలను విడుదల చేసిన వాతావరణశాఖ
ఈనాడు, దిల్లీ: గత ఏడాది కంటే ఈసారి మెరుగైన వానలు కురవనున్నాయట! తూర్పు, ఈశాన్య రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా జూన్‌-సెప్టెంబరు మధ్య ‘సాధారణ వర్షపాతం’ నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) బుధవారం వెల్లడించింది. రెండో ముందస్తు దీర్ఘకాల సగటు (ఎల్‌పీఏ) అంచనాలను విడుదల చేసింది. 9% అటుఇటుగా దేశవ్యాప్తంగా జులైలో 101%, ఆగస్టులో 94% వర్షాలు కురుస్తాయని తెలిపింది. వర్ష పరిమాణపరంగా చూస్తే దేశవ్యాప్తంగా 97% వానలు నమోదవుతాయనీ, ఈ అంచనాల కచ్చితత్వం 4% అటూఇటుగా ఉండొచ్చని తెలిపింది. ‘‘ప్రాంతాలవారీగా చూస్తే నైరుతి భారతం (రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, జమ్ము-కశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, పంజాబ్‌, హరియాణా, దిల్లీ)లో 100%; మధ్య భారత్‌లో 99%; దక్షిణాదిన 95% వర్షాలు కురుస్తాయి. తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం 93% వానలేపడవచ్చు. వచ్చే 48 గంటల్లో రుతుపవనాలు ఈశాన్య రాష్ట్రాలను తాకేందుకు వాతావరణం అనుకూలంగా ఉంది. ఖరీఫ్‌ సీజన్‌లో దక్షిణాదిన.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మంచి వర్షాలే కురుస్తాయి’’ అని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ కె.జె.రమేష్‌ వెల్లడించారు.
* ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్‌ దీర్ఘకాల సగటు ప్రకారం దేశవ్యాప్తంగా జూన్‌లో 111%, జులైలో 97%, ఆగస్టులో 96%, సెప్టెంబరులో 101% వానలు కురుస్తాయని తెలిపింది.

Related posts

Leave a Comment